- డిసెంబరు 21లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వండి
- రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా ఆదేశం
విజయవాడ(చైతన్యరథం): ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరూ డిసెంబరు 21వ తేదీలోగా ఎన్నికల వ్యయ వివరాలను తప్పనిసరిగా సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా ఆదేశించారు. ఎన్నికల్లో గెలిచిన వారు, ఓడిపోయిన వారు అనే తేడా లేకుండా పోటీ చేసిన ప్రతి అభ్యర్థీ తమ ఖర్చుల తుది వివరాలను వెంటనే అందజేయాలని స్పష్టం చేశారు. అభ్యర్థులు తమ ఎన్నికల వ్యయ వివరాలను సంబంధిత ఎంపీడీవో కార్యాలయం ద్వారా జిల్లా ఎన్నికల అధికారికి సమర్పించాలని సూచించారు. నవంబరు 7న ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో నిబంధనల ప్రకారం 45 రోజుల్లోగా (డిసెంబరు 21 లోపు) ఈ లెక్కలు అప్పగించాలని ఎసఈసీ ఆజ్ఞాపించారు. ఈ గడువులోగా వ్యయ వివరాలను సమర్పించని అభ్యర్థులపై పంచాయతీరాజ్ చట్టం సెక్షన్ 19-దీ ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. లెక్కలు చెప్పని అభ్యర్థులు మూడేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హతకు గురవుతారని, గెలిచిన వారైతే పదవి కూడా కోల్పోతారని స్పష్టం చేశారు. అభ్యర్థులందరూ ఈ గడువులోగా వివరాలను సమర్పించే లా ఎంపీడీవోలు చొరవ తీసుకోవాలని, కలెక్టర్లు విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశించారు.



















