- అదే కూటమి ప్రభుత్వ ధ్యేయం
- పెట్టుబడుల కోసం దేశ, విదేశాలు తిరుగుతున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్
- విశాఖ భాగస్వామ్య సదస్సు ద్వారా 7.2 లక్షల ఉద్యోగాలు
- వెనుకబడిన కనిగిరి ప్రాంతంలో ఎంఎస్‌ఎంఈ పార్క్ ఏర్పాటు శుభపరిణామం
- మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
కనిగిరి (చైతన్యరథం): రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి అన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని పీసీపల్లి మండలంలో ఈనెల 11న జరగనున్న ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను స్థానిక శాసనసభ్యుడు డా. ముక్కు ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి ఆదివారం నాడు మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాట్లపై మంత్రి అధికారులతో సమీక్షించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డా. స్వామి మాట్లాడుతూ..వెనుకబడిన కనిగిరి ప్రాంతంలో ఎంఎస్‌ఎంఈ పార్కులు, బయో గ్యాస్ ప్లాంట్లు ఏర్పాటుచేసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. ఈనెల 11న పీసీ పల్లితో పాటు రాష్ట్రంలో మరి కొన్ని ఎంఎస్‌ఎంఈ పార్కులను పర్చువల్ గా ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని తెలిపారు.
నిరుద్యోగ రహిత ఆంధ్ర రాష్ట్ర్రం కోసం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రాష్ట్రంలోని యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు తెచ్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కాలికి బలపం కట్టుకొని దేశ విదేశాల్లో పర్యటిస్తున్నారన్నారు. మంత్రి లోకేష్.. దీపావళి పండుగ నాడు కూడా కుటుంబ సభ్యులతో గడపకుండా పెట్టుబడుల కోసం విదేశాల్లో తిరుగుతూ కష్టపడుతున్నారు. విశాఖలో పెట్టుబడుల సదస్సు ద్వారా 7.2 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా ఎంఓయూలు కుదుర్చుకోనున్నాం. వెనుకబడిన ప్రకాశం జిల్లా అభివృద్ధికి మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటుతో పాటు, త్వరితగతిన వెలుగొండ పూర్తికి ప్రత్యేక ప్రణాళికలతో జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, మంత్రి లోకేష్‌కి జిల్లా ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు మంత్రి డా. స్వామి తెలిపారు.















