- మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్థులకు పంపిణీ
- మరో మూడేళ్ల పొడిగింపునకు ప్రభుత్వం నిర్ణయం
- మంత్రి లోకేష్ సమక్షంలో సత్యసాయి సేవా ట్రస్ట్‌తో విద్యాశాఖ ఎంవోయూ
ఉండవల్లి (చైతన్య రథం): ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటో తరగతినుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు సన్నబియ్యంతోపాటు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా కూటమి ప్రభుత్వం అందిస్తోంది. మెనూలో మార్పులతో ఎక్కువమంది భోజనం చేస్తున్నారు. భోజనం మరింత రుచి, శుచిగా వడ్డించేలా విద్య, ఐటీ మంత్రిగా నారా లోకేష్ ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు అదనపు పోషకాహారం అందించేందుకు శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ సహకారంతో ప్రస్తుతం అమలులో ఉన్న రాగిజావ పంపిణీ కార్యక్రమం మరో మూడేళ్లు కొనసాగింపునకు ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు మంత్రి నారా లోకేష్ సమక్షంలో 2026-29 కాలానికి విద్యార్థులకు రాగిజావ పంపిణీ కార్యక్రమం కొనసాగించేందుకు శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్‌తో విద్యాశాఖ ఎంవోయూ కుదుర్చుకుంది. శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ సహకారంతో రాగిజావ పంపిణీ కార్యక్రమం మార్చి 2023లో ప్రారంభం కాగా.. ఈ ఏడాది ఏప్రిల్‌తో కాలపరిమితి ముగిసింది.
దీంతో పొడిగింపునకు విద్యాశాఖ ఎంవోయూ కుదుర్చుకుంది. ప్రస్తుతం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో జోనల్‌వారీగా విద్యార్థులకు మెనూ అమలు చేస్తున్నారు. ఈ మెనూలో ఫోర్టిఫైడ్ ఫైన్ రైస్, వారానికి 5సార్లు గుడ్డు, వారానికి మూడుసార్లు చిక్కీ, అలాగే పోషకాహారపు పదార్థాలుగా చిక్కీలేని రోజుల్లో రాగిజావను వారానికి మూడుసార్లు అందిస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకంపై ప్రభుత్వం ఏడాదికి సుమారు రూ.1,850 కోట్లు ఖర్చుచేస్తోంది. తద్వారా విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్, అటెండెన్స్, డ్రాపఅవుట్స్ నివారణ, పోషకస్థాయిలు మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకుంది. విద్యార్థులకు హెల్త్ సప్లిమెంట్‌గా రాగిజావను పంపిణీ చేస్తున్నారు. 10 గ్రాముల రాగి పిండి, 10 గ్రాముల బెల్లం పొడిని 150 మిల్లీలీటర్ల వేడినీటిలో కలిపి విద్యార్థులకు అందించడం జరుగుతోంది. తద్వారా కాల్షియం, ఐరన్‌తో సమృద్ధిగా ఉండి పోషకాహారాన్ని మెరుగుపరుస్తుంది.
రాగిపిండి, బెల్లంపొడిని శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఉచితంగా అందిస్తుంది. ట్రస్ట్ ద్వారా జిల్లా కేంద్రాల వరకు సరఫరా చేస్తారు. అక్కడినుంచి పౌరసరఫరాల శాఖ ద్వారా పాఠశాలలకు పంపిణీ చేస్తారు. ఇందుకోసం మూడేళ్లలో రూ.80 కోట్ల వరకు వెచ్చించనున్నారు. కార్యక్రమంలో శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జే రత్నాకర్, శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ అడ్మిన్ కోఆర్డినేటర్ ఎస్‌జి చలం, శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభాగం అధ్యక్షులు ఆర్ లక్ష్మణరావుతోపాటు మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్ బి శ్రీనివాసరావు, అడిషనల్ డైరెక్టర్ ఆరఎస్ గంగాభవాని తదితరులు పాల్గొన్నారు.

















