అమరావతి(చైతన్య రథం): మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఏరియల్ సర్వే నిర్వహించారు. బుధవారం తుపాను ప్రభావిత ప్రాం తాల పర్యటనకు వెళ్లిన చంద్రబాబు.. హెలీకాప్టర్‌లో ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. బాపట్ల, పల్నాడు, కృష్ణా, ఏలూరు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో ముంపునకు గురైన ప్రాంతాలను హెలికాఫ్టర్ నుంచి పరిశీలించారు. ఏరియల్ వ్యూ అనంతరం కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవులో సీఎం పర్యటించారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో ప్రయాణించి వర్షాలకు నీట మునిగిన పంటపొలాలను పరిశీలించారు. అలాగే, చిలకలూరి పేట, పర్చూరు, చీరాల, కోడూరు, నాగాయలంక మీదుగా ఓడలరేవు వరకు ఏరియల్ విజిట్ చేశారు.
మొదలైన నష్టాల అంచనాలు
మొంథా తుపానువల్ల సంభవించిన నష్టం అంచనా ప్రక్రియను అధికారులు కొనసాగిస్తున్నారు. తుపానువల్ల రాష్ట్రంలో ఇద్దరు మృతి చెందినట్టు అధికారులు గుర్తించారు. ప్రాథమిక అంచనా నివేదికను రెండ్రోజుల్లో ప్రభుత్వానికి నివేదించే అవకాశం ఉంది. అంచనాలు వచ్చాకే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక అందించనుంది. 249 మండలాలు, 48 మున్సిపాలిటీల్లో 18 లక్షలమందిపై తుపాను ప్రభావం ఉన్నట్టు తెలుస్తోంది. పలు జిల్లాల్లో వరి, ఉద్యాన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో ఈదురు గాలులకు చాలాచోట్ల కొబ్బరి చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది.
భారీ వర్షాలతో అతలాకుతలం
మొంథా తుపాను ప్రభావంతో ప్రకాశం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఒంగోలులో రోడ్లపై భారీగా వర్షపు నీరు చేరింది. పలు కాలనీలు జలమయమయ్యాయి. ఎగువ కురిసిన వర్షాలకు గుండ్లకమ్మ రిజర్వాయర్‌లోకి భారీగా వరద నీరు చేరింది. అధికారులు 11 గేట్లుఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. మార్కాపురంలో తుపాను ధాటికి పలు ప్రాంతాలను వరద ముంచెత్తింది. అర్ధవీడులో పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో ఉండిపోయాయి. జోరువానలకు కంభం చెరువు జలకళను సంతరించుకుంది.
ఇక కడప జిల్లాలో కుందూ నది ఉగ్రరూపం దాల్చింది. చాపాడు మండలం సీతారామపురంవద్ద వంతెనపైనుంచి నీరు ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు నిలిచి పోయాయి. పోలీసులతోపాటు రెవెన్యూ అధికారులు అప్రమత్తమై నిఘా పెట్టారు. కర్నూలు, నంద్యాల జిల్లాలతోపాటు కడప జిల్లాలో విస్తారంగా వర్షాలు పడటంతో వాగులు, వంకలనుంచి కుందూ నదికి వరద ప్రవాహం పెరిగింది. నంద్యాల-కడప జిల్లాల సరిహద్దులోని రాజోలి ఆనకట్ట వద్ద మంగళవారం 7 వేల క్యూసెక్కుల ప్రవాహం ఉండగా.. 24 గంటల్లో 26 వేల క్యూసెక్కులకు చేరింది. చాపాడు మండలం సీతారామపురం వద్ద 30 వేల క్యూసెక్కులు ప్రవహిస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
మొంథా తుపాను ప్రభావంతో నల్లమల ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీశైలం ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగి రహదారిపై పడ్డాయి. దీంతో పోలీసులు ఆ మార్గంలో రాకపోకలను నిలిపివేశారు. పెద్ద డోర్నాలలోని అటవీశాఖ చెక్ పోస్ట్ వద్ద వాహనాలను శ్రీశైలం వైపునకు వెళ్లకుండా నిలిపివేశారు. వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపై పడిన రాళ్లను పొక్లెయిన్‌తో తొలగిస్తున్నారు.













