విజయవాడ (చైతన్యరథం): రాష్ట్రంలో ముస్లిం మైనారిటీల అభివృద్ధికి సీఎం చంద్రబాబు కట్టుబడి ఉన్నారని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అన్నారు. భారత రత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ 138 వ జయంతి సందర్భంగా మైనారిటీ సంక్షేమ శాఖ అధ్వర్యంలో మంగళవారం విజయవాడ తుమ్మలపల్లి కళా క్షేత్రంలో నిర్వహించిన మైనారిటీ సంక్షేమ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎన్ఎండీ ఫరూక్ మాట్లాడుతూ.. భారత రత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కావటం చాలా సంతోషదాయకమన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి ముస్లిం మైనార్టీల సంక్షేమంపై ప్రత్యేక ధృష్టి సారిస్తున్నారన్నారు. ముఖ్యమంగా మైనార్టీల విద్యకు తొలి ప్రాధాన్యతనివ్వడంతోపాటు ఎన్నో సంక్షేమ పథకాల అమలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాతే రాష్ట్రంలో మైనారిటీల అభివృద్ధి జరిగిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎన్టీ రామారావు కృషి ఫలితంగానే ఉర్దూ అకాడమీ, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్, రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటయ్యాయన్నారు. ముస్లిం బిడ్డలకు సాంకేతిక విద్య అవకాశాన్ని కల్పించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందన్నారు.
నేడు లక్షలాది మంది విదేశాలలో విద్యను అభ్యసిస్తున్నారంటే అందుకు కారకులు ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఏడున్నర శాతం ముస్లిం జనాభాకు మించి రెట్టింపు పథకాలు ముస్లిం వర్గాలకు అందుతున్నాయన్నారు. మెగా డీఎస్సీ ద్వారా ముస్లిం మైనార్టీలకు దాదాపు 30 శాతంకు పైగా ఉద్యోగాలు లభించాయన్నారు. గత పాలకులు కబుర్లు చెప్పి కాలక్షేపం చేశారు తప్ప కనీసం వారి సొంత జిల్లా కడపలో హజ్ హౌస్ కూడా పూర్తి చేయలేకపోయారన్నారు.. విజన్ ఉన్న ముఖ్యమంత్రి రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తున్నారన్నారు. 2003 వ సంవత్సరంలోనే ముస్లింలకు రిజర్వేషన్లు కల్సించాలని సంకల్పించిన నాయకుడు, దూరదృష్టి గల నేత, ముస్లిం మైనారిటీల బంధువు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అని కొనియాడారు..
రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ వీసీ, ఎండి యాకూబ్ భాషా మాట్లాడుతూ ముస్లిం మైనారిటీలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు వారికి ఎంతో ఆర్థిక తోడ్పాటును అందిస్తున్నాయన్నారు.
తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి ని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పుష్పాంజలితో ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మౌలానా అజాద్ అవార్డులను ఆయా రంగాల్లో ప్రముఖులకు అందించారు.
కార్యక్రమంలో శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు, శాసనసభ్యులు నసీర్ అహ్మద్, మైనార్టీ వ్యవహారాల సలహాదారు షరీఫ్ మహ్మద్ అహ్మద్, ఆంధ్రప్రదేశ్ నూరు భాషా/దూదేకుల సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా షేక్ ముస్తాక్ అహ్మద్, హజ్ కమిటీ చైర్మన్ షేక్ హసన్ భాషా, స్టేట్ ఉర్దూ అకాడమీ డైరెక్టర్ షేక్ మహమ్మద్ గౌస్, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మి శా, మౌజంలు, ఇమాములు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.












