- తలసేమియా బాధితుల కోసం 15న విజయవాడలో మ్యూజికల్ నైట్
- టికెట్‌పై వచ్చే ప్రతిరూపాయీ వారికే వెళుతుంది
- అడిగిన వెంటనే తమన్ అంగీకరించారు
- చేసిన మంచి పనులే మనతో ఉంటాయి
- సమాజ సేవకోసం ఎన్టీఆర్ స్ఫూర్తితో ట్రస్ట్ ఏర్పాటు
- ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి స్పష్టీకరణ
విజయవాడ: విజయవాడలో నిర్వహించే మ్యూజికల్ నైట్‌కు ముఖ్యమంత్రి అయినా, ఆయన వెంట వచ్చే పీఏలు, భద్రతా సిబ్బంది.. ఎవరైనా టికెట్ కొనుగోలు చేస్తేనే లోనికి అనుమతి అని ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి స్పష్టం చేశారు. ఈ నెల 15న తలసేమియా బాధితుల సహయార్థం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయవాడలో ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ఆధ్వర్యంలో యుఫోరియా మ్యూజికల్ నైట్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. యుఫోరియా కార్యక్రమ వివరాలను గురువారం భువనేశ్వరి వెల్లడిరచారు. తమ కుటుంబ సభ్యులకు రూ.6 లక్షలు వెచ్చించి చంద్రబాబే మ్యూజికల్ నైట్ టికెట్లు కొని టేబుల్ బుక్ చేశారని తెలిపారు. ఎవరి కాళ్లమీద వాళ్లే నిలబడాలి అని భావించే వ్యక్తి చంద్రబాబు అని పేర్కొన్నారు. అందుకే ట్రస్టు కార్యక్రమాల గురించి ఆయనను తానేమీ అడగనని, అడిగినా వెంటనే అంగీకరించరని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను కూడా మ్యూజికల్ నైట్ ఈవెంట్‌కు ఆహ్వానించామని భువనేశ్వరి తెలిపారు. ఆయన తప్పకుండా వస్తారని ఆకాంక్షించారు. టికెట్ పై వచ్చే
ప్రతి రూపాయి తలసేమియా బాధితులకు అందిస్తామని భువనేశ్వరి తెలిపారు.
‘సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు’ అని ఎన్టీఆర్ గట్టిగా నమ్మారని భువనేశ్వరి అన్నారు. ఎన్టీఆర్ స్పూర్తితో ట్రస్టు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రక్తదాన కార్యక్రమాల్లో పాల్గొనాలని.. అది చాలా మంది జీవితాలను నిలబెడుతుందన్నారు. రక్తదానం చేసిన వ్యక్తులు ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపుతారు. ఫండ్ రైజింగ్ కోసం మ్యూజికల్ నైట్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దీని గురించి చెప్పగానే.. తమన్ కూడా ఒక్క నిమిషం ఆలోచించకుండా వెంటనే మ్యూజికల్ నైట్ కి వస్తా అన్నారు. ఎంతో గొప్ప మనసుతో ఈ షో ఫ్రీ గా చేస్తా అని చెప్పారు. ప్రతి ఒక్కరు తెలుగు తల్లి రుణం తీర్చుకోవాలి. అందరూ సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలు చేయాలి. మనం చేసిన మంచి పనులే మనతో ఉంటాయని భువనేశ్వరి తెలిపారు. మనం వెళ్ళేటప్పుడు మన వెంట డబ్బు రాదు…ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తే అందరికి గుర్తు ఉంటుంది.
ఇంత పెద్ద బాధ్యత అప్పగించారు: తమన్
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ ఈ షో తాను చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. తలసేమియా బాధితుల కోసం ఈ కార్యక్రమం చేయాలని భువనేశ్వరి అడిగారు. తలసేమియా బాధితులకు సహాయం కోసం అని చెప్పగానే నేను వెంటనే ఈ కార్యక్రమానికి వస్తా అని చెప్పాను. ఈ టికెట్ పై పెట్టె ప్రతి రూపాయి తలసేమియా బాధితులకు వెళ్తుంది. భువనేశ్వరి నాపై నమ్మకం ఉంచి ఇంత పెద్ద కార్యక్రమం నా చేతిలో పెట్టినందుకు కృతజ్ఞతలు. ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రం కోసం పగలు, రాత్రి నిర్విరామంగా శ్రమిస్తున్నారని తమన్ కొనియాడారు.