- కార్యకర్తలు సంయమనం పాటించాలని హితవు
అమరావతి(చైతన్యరథం): విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ఏపీ ప్రభుత్వం యూ టర్న్ తీసుకుందంటూ డక్కన్ క్రానికల్ దినపత్రికలో వచ్చిన వార్త అభూత కల్పన అని, దురుద్దేశంతో కూడుకున్నదని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఖండిరచారు. అదే సమయంలో విశాఖలోని ఆ పత్రిక కార్యాలయం వద్ద సైన్‌బోర్డును టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. వైసీపీకి ప్రయోజనం చేకూర్చేందుకు, విశాఖ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసి, నగరవాసుల్లో అశాంతి రేకెత్తించే దురుద్దేశంతో డక్కన్ క్రానికల్ దినపత్రిక ఆ కథనాన్ని వండివార్చిందన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు పూర్వవైభవం తెచ్చేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇందుకోసం అన్ని ప్రయత్నాలు చేస్తామన్నారు. మన రాష్ట్ర నాశనాన్ని కోరుకుంటూ నీలి మీడియాలో వచ్చే ఇలాంటి తప్పుడు కథనాలను నమ్మవద్దని రాష్ట్ర ప్రజలకు లోకేష్ విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో విశాఖలోని డక్కన్ క్రానికల్ కార్యాలయం వద్ద ఉన్న ఆ పత్రిక సైన్‌బోర్డును టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేయటం సరికాదని లోకేష్ హితవు పలికారు. కార్యకర్తలు భావోద్రేకాలకు లోనుకాకుండా సంయమనం పాటించాలని కోరారు. వాస్తవదూరమైన, పక్షపాత ధోరణితో కూడిన ఇలాంటి తప్పుడు కథనాలు ప్రచురించే నీలి మీడియా సంస్థలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని లోకేష్ స్పష్టం చేశారు.