“ముందస్తు ఎన్నికలు జరిగితే జగన్ ను ఇంటికి పంపడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారు.మేము ఎన్నికలకు సిద్దంగా లేము అనేది జగన్ పగటి కల. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఎన్నికలకు మేం సిద్దంగా ఉన్నాం” అని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వైసిపికి షాక్ ట్రీట్మెంట్. వచ్చే ఎన్నికలు వైసీపీకి పర్మినెంట్ ట్రీట్మెంట్. ప్రభుత్వం పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో, అసహనంతో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఫలితాలు ఇంకా గట్టిగా ఉంటాయి అని పేర్కొన్నారు. టిడిపి కేంద్ర కార్యాలయంలో శనివారం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. జగన్ ను 175 ఓడించడం మా లక్ష్యం.
రాజకీయాలకే అర్హత లేని వ్యక్తి జగన్. బుద్ది ఉన్నవాడు అయితే 175 లో పోటీ చేస్తావా, లేదా అని అడుగుతారా?175 లో పోటీ చేస్తారా అనేది ఒక బుద్ది లేని ప్రశ్న అని చంద్రబాబు ధ్వజమెత్తారు. వైసిపి నుంచి చాలా మంది టీడీపీలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో చాలా మందిని హోల్డ్ లో పెట్టామని చంద్రబాబు చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగు దేశం గెలిస్తే ఎమ్మెల్యేలు అమ్ముడు పోయారు అంటారా? మీ దగ్గర ఉన్న వాళ్లు ఎవరు? అని ప్రశ్నించారు. మాకు 23 ఎమ్మెల్యేలు గెలిచిన చోట…ఇంగిత జ్ఝానం ఉంటే జగన్ పోటీ నే పెట్టకూడదు. సరిపోను సంఖ్యా బలం లేకపోయినా జగన్ 7 గురిని పోటీలో పెట్టాడు.
బుద్ది ఉంటే తన పార్టీలో చేర్చుకున్న ఆ నలుగురిని పార్టీ నుంచి జగన్ బయటకు పంపాలన్నారు. కాస్తో కూస్తో ఇంగిత జ్ఞానం ఉన్న వాళ్లు వైసిపిలో ఉండకూడదు. గౌరవం లేని వైసీపీలో ఎవరూ ఉండకూడదు. పబ్లిక్ లైఫ్ కి జగన్ కు అర్హత లేదని పేర్కొన్నారు. ఎవరైనా పార్టీ మారితే రాజీనామా చేసి మా పార్టీలోకి రావాలి అని జగన్ నాడు సభలో అన్నాడా లేదా? మా పార్టీ నుంచి 4 గురిని తీసుకున్నారు. మరి దానిపై జగన్ ఏం సమాధానం చెపుతాడు? అంటే నాకు రావాల్సిన సీటును నేను వదిలేయాలా? నేను నిలబెట్టిన వారు గెలిస్తే,మ్యానేజ్ చేసినట్లా? అని ప్రశ్నించారు. చట్టాన్ని, ధర్మాన్ని బతికించాలి అనుకుంటున్నా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ పెట్టా అని చెప్పారు.
జగన్ ఇప్పటి వరకు పబ్లిక్ ను ఫూల్స్ చేస్తూ వచ్చాడు. ఫైనల్ గా జగన్ ను ప్రజలు పెద్ద ఫూల్ ను చేస్తారు. తన చర్యల వల్ల జగన్ ఫూల్ అవ్వడం ఖాయం. జరిగేది ఇదే అని వెల్లడించారు. నేడు అప్పులతో రాష్ట్రం ఎటుపోతుందో అర్థం కావడం లేదు. నేడు రాష్ట్ర అప్పు రూ. 10.31 లక్షల కోట్లకు చేరింది. సిఎం జగన్ ఒకవైపు పన్నులు వేస్తున్నాడు. మరోవైపు లక్షల కోట్ల అప్పులు చేస్తున్నాడు? ఆ డబ్బు అంతా ఎక్కడికి పోతుంది? ఈ ఒక్క ఏడాదిలోనే జగన్ రూ.96 వేల కోట్ల అప్పు చేశాడు.
ఇలా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తే ఎలా? అని ప్రశ్నించారు. ఇది మరింత ఆర్థిక సంక్షోభానికి దారి తీస్తుంది. రాష్ట్రం పూర్తిగా దివాళా తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.లక్షల కోట్ల అప్పులు చేసినా పోలవరం పూర్తి చేయలేదు. అమరావతి నాశనం చేశాడు. ఒక్క సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేయలేదు. రోడ్లు వేయలేదు. రైతులకు సబ్సిడీలు లేవు, జీతాలు ఇవ్వలేకపోతున్నాడు. మరి ప్రభుత్వం చేసిన 10 లక్షల కోట్ల అప్పులు ఎక్కడికి పోయాయి? అని ప్రశ్నించారు. ప్రభుత్వంలో నిధుల దుర్వినియోగం స్పష్టంగా కనిపిస్తుంది.ఇవన్నీ చూసిన తరువాత రాష్ట్రం ఏమవుతుంది అనే ఆవేదన, బాధ కలుగుతుందన్నారు.
రాష్ట్రాన్ని నాశనం చేయడానికే జగన్ రెడ్డిపుట్టాడా అని అందుకే నేను అన్నాను. విభజన తరువాత మనకు హైదరాబాద్ లేదు కాబట్టి, మన భవిష్యత్ ఏంటి అని ప్రజలు నాడు భయపడ్డారు. అందుకే అమరావతికి రూపకల్పన చేశాను అని చెప్పారు. నేడుతెలంగాణ పర్ క్యాపిటా ఇన్ కం రూ. 3.08 లక్షలకు చేరింది. అంటే దేశంలోనే ప్రధమంగా నిలిచింది అని చెప్పారు. అందుకే నా తరువాత అక్కడ వచ్చిన ముఖ్యమంత్రులను నేను అభినందించాను. నాడు చేసిన సంస్కరణలు, నిర్ణయాల కారణంగా మంచి ఫలితాలువచ్చాయి. తరువాత వచ్చిన ప్రభుత్వాలు వాటిని కొనసాగించాయి అని తెలిపారు. ఇప్పుడు ఆ ఫలాలను తెలంగాణ అనుభవిస్తుంది. కానీ ఇప్పుడు ఎపిలో పర్ క్యాపిటా ఇన్ కం రూ. 2.19 లక్షలు. అంటే తెలంగాణకు , ఎపికి ఎంత తేడా ఉందో చూడండి. ఒక మనిషి విధ్వంసం వల్లనే ఎపిలో ఈ పరిస్థితి వచ్చింది.
హైదరాబాద్ అభివృద్దిని ఎవరూ డిస్టర్బ్ చేయలేదు. అందుకే మంచి ఫలితాలు వచ్చాయని వివరించారు. తెలంగాణలో ఇప్పుడు భూముల విలువ కూడా పెరిగింది. తెలంగాణ లో ఉండే మారుమూల ప్రాంతాల్లో కూడా భూముల ధరలు లక్షలు, కోట్లు అయ్యాయి. కానీ ఎపిలో నేడు ఇప్పుడు భూములు కొనే వారు లేరు. పోలవరం పూర్తి అయ్యి ఉంటే అద్భుత ఫలితాలు దక్కేవి అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
కియా పరిశ్రమపై నాడు జగన్ ఏమని ప్రచారం చేశాడు? ఏమి వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు ఆ కియా వల్ల ఆ ఏరియా రూపురేకలు మారిపోయాయి. 25 వేల మంది ప్రత్యక్షం గా లబ్ధి పొందారు. ఆ ప్రాంతం లో భూముల విలువ పెరిగింది అని వివరించారు. దేశంలో నెంబర్ 1 దోపీడీ దారుడు జగన్ కాక ఇంకెవరు? దేశంలో అందరి సిఎంల సంపద కంటే జగన్ సంపదే ఎక్కువ ప్రజలను లూటీ చేసి నేను పేదల మనిషిని అంటే జగన్ ను ప్రజలు నమ్ముతారా? ఇసుకలో వందల కోట్లు అక్రమాలు చేస్తూ నేను పేదల మనిషిని అంటే ఎలా? జగన్ డబ్బు అంతా ఎక్కడికి తరలిస్తున్నాడు. నేలమాలిగల్లో పెట్టాడా అని పిస్తుంది. జగన్ అవినీతి చేసి అందరిపై బురద జల్లాలని ప్రయత్నం చేస్తున్నాడు అని ధ్వజమెత్తారు. జగన్ పాలనలో రాష్ట్ర సంపద నాశనం అయ్యింది. దోపిడీకి గురయ్యింది.ఆర్ధిక అసమానతలు తగ్గించే విధానానికి శ్రీకారం చుడతాం. ప్రతి ఇంటికి ఒక విజన్ రూపొందిస్తాం. పేదల జీవితాలను సమూలంగా మార్చుతాం. దానికి అనుగుణంగా ప్రణాళికలు సిద్దం చేస్తున్నాం.
అంబానీ సోదరుల కధ .. రెండు రాష్ట్రాల వ్యధ
ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ ల ప్రయాణాన్ని మన రెండు రాష్ట్రాలు అన్వయించుకోవాలి. రిలయన్స్ అన్నదమ్ముల్లో ఏం జరిగిందో, తెలుగు రాష్ట్రాల్లో జగన్ వల్ల అదే జరిగింది. తెలంగాణకు హైదరాబాద్ ఉంటే ఎపికి సముద్ర తీరం ఉంది. ఎపిలో మంచి భూములు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటే 2029 నాటికి దేశంలో టాప్ స్టేట్స్ గా ఈ రెండు రాష్ట్రాలు ఉండేవి.జగన్ కారణంగా ఎపి మునిగిపోయింది. అభివృద్ధి కొనసాగడం వలన అటు తెలంగాణ మాత్రం సక్సెస్ అయ్యింది. అని చంద్రబాబు వివరించారు. ఒక మనిషి విధ్వంస ఎంత వేగంగా చేయగలడో జగన్ చూపించాడని విమర్శించారు.జగన్ ప్రజల బిడ్డ కాదు. పేదల బిడ్డ కాదు..రాష్ట్రాన్ని నాశనం చేసిన బిడ్డ. నెలకు ఒక్క ఇసుకలో 250 కోట్లు దోచేసిన జగన్ మీ బిడ్డ అంటే నమ్మాలా? గన్ కల్చర్, గొడ్డలి కల్చర్, గంజాయి కల్చర్ తెచ్చిన వాడిని నమ్మాలా? అని ప్రశ్నించారు.
ఉండవల్లి శ్రీదేవికి అండగా ఉంటాం
అధికార పార్టీ దౌర్జన్యాలకు గురవుతున్న ఎమ్మెల్యే శ్రీదేవికి అండగా ఉంటాం. నాడు ఎంపీ రఘు రామ రాజుకు అండగా నిలిచాము అని చంద్రబాబు వెల్లడించారు. బిజిపి నేతలపై దాడి ఉన్మాద చర్య. ప్రశ్నించే వారిపై ఉన్మాదంతో వ్యవహరిస్తున్నారు అని ఆరోపించారు. వివేకా హత్య కేసులో తులసమ్మ సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ పై వాయిదా వాయిదాకు లాయర్లను ఎలా మార్చుతున్నారు? తులసమ్మకు అంత స్దాయి ఉందా?సుప్రీం కోర్టులో లాయర్లను ఎవరు పెడుతున్నారు? డబ్బులుఎవరు ఇస్తున్నారు అని చంద్రబాబు ప్రశ్నించారు.