72 గంటలలోగా ధాన్యం కొనుగోలు చేయకపోతే సిఎం ఇంటివద్దకు ధాన్యం
ధాన్యాన్ని పారబోయవద్దు అని రైతులకు విజ్ఞప్తి
కేసులకు భయపడవద్దు.
రైతులకు న్యాయం జరిగే వరకూ పోరాడుతా
ఎస్ ముప్పవరం లో పంటపొలాల పరిశీలన అనంతరం రైతులకు చంద్రబాబు భరోసా
72 గంటల్లో ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే ఎవరు పారబోయొద్దు..
ధాన్యం కొనుగోలు చేయకపోతే మనమే సీఎం జగన్ నివాసం తాడేపల్లి ప్యాలెస్ తీసుకువెళ్దాం. సీఎం జగన్ ఇంటి ముందు ఈ ధాన్యం తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండండి అని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రైతులకు పిలుపునిచ్చారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎస్ ముప్పవరం లో అకాల వర్షాలకు పంట నష్టం జరిగిన ప్రాంతాలలో శనివారం చంద్రబాబు పర్యటించారు. అక్కడ వర్షానికి తడిసి రోడ్డు వెంట ఆరబెట్టిన ధాన్యాన్ని చంద్రబాబు పరిశీలించారు. రైతులతో స్వయంగా మాట్లాడి వారి కష్టాలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా రైతులనుద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ రైతులకు ధైర్యం చెప్పారు. రైతులు కష్టాల్లో ఉంటే జగన్ ఎక్కడ? సీఎంకి రైతుల్ని పరామర్శించే బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. అకాల వర్షాలకు రైతులు, కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారు అని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు, మిల్లరులు కలిసి రైతుల్ని దోపిడి చేస్తున్నారు అని ఆరోపించారు. మిల్లర్లు ఎందుకు డబ్బులు కట్టించుకుంటున్నారు , వారికి లైసెన్సు ఏమైనా ఇచ్చారా? అని ప్రశ్నించారు. పోరాడాల్సిందిగా రైతులకు పిలుపునిచ్చారు. పోరాడితే నష్టం లేదు.
కేసులు పెడతారని భయపడవద్దు అని రైతులకు సూచించారు. నష్టపోయిన రైతులను ఆదుకునేవారకు ప్రభుత్వాన్ని వదలిపెట్టేది లేదని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ రైతులకు అండగా వుంటుందని, వారికి న్యాయం జరిగే వరకూ తాను పోరాడుతానని చంద్రబాబు వెల్లడించారు.