- విజయవాడ ఉత్సవ్‌లో సందడి చేసిన ఏపీ, తమిళనాడు ముఖ్యమంత్రులు
- విజయ్ రాకతో విజయవాడ దద్దరిల్లిందన్న చంద్రబాబు
విజయవాడ (చైతన్యరథం): తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ రాకతో విజయవాడ నగరం దద్దరిల్లిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. సీఎం పదవి చేపట్టిన తర్వాత తొలిసారిగా ఏపీకి వచ్చిన విజయ్‌కు చంద్రబాబు ఆత్మీయ స్వాగతం పలికారు. ఉండవల్లిలో ఇద్దరూ ప్రత్యేకంగా భేటీ అయిన అనంతరం విజయవాడలోని పున్నమి ఘాట్‌లో నిర్వహిస్తున్న ‘విజయవాడ ఉత్సవ్’లో కలిసి పాల్గొన్నారు.. సాంస్కృతిక ప్రదర్శనలను ఇద్దరు నేతలూ ఆసక్తిగా తిలకించారు.
మోదీ నాయకత్వంలో ఏదైనా సాధ్యమే: చంద్రబాబు
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… పార్టీ స్థాపించిన కేవలం రెండేళ్లలోనే విజయ్ తమిళనాడు సీఎం అయ్యారని, ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన కంకణం కట్టుకున్నారని కొనియాడారు. విజయవాడ -ఉత్సవ్‌ను స్థానిక నేతలు, అధికారులు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. ‘పొరుగు రాష్ట్రాలు కూడా బాగుండాలని మేము కోరుకుంటాము. ప్రధాని మోదీ నాయకత్వంలో ఏది సాధించాలన్నా సాధ్యమే’ అని స్పష్టం చేశారు. కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో గోదావరి-కావేరి నదుల అనుసంధానం వేగవంతంగా జరుగుతుందని, మొత్తం ఐదు నదులను అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని ఆకాంక్షించారు. 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే నెం.1 దేశంగా ఎదుగుతుందనే ధీమాను చంద్రబాబు వ్యక్తం చేశారు.
నదుల అనుసంధానంపై చర్చించాం: విజయ్
‘అందరికీ నమస్కారం’ అంటూ తమిళనాడు సీఎం విజయ్ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించి ఆకట్టుకున్నారు. విజయవాడకు రావడం తనకు ఎంతో సంతోషంగా ఉందని, పవిత్రమైన దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనడం దక్కిన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబుతో జరిగిన భేటీలో నదుల అనుసంధాన ప్రక్రియపై విస్తృతంగా చర్చించానని వెల్లడించారు. విజయవాడకు విచ్చేసిన తనకు ప్రతి ఒక్కరూ ఘన స్వాగతం పలికారంటూ ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. తెలిపారు.














