టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పిజి విద్యార్థులకు గొడ్డలిపెట్టులా మారిన జిఓ నెం.77ను రద్దుచేసి పాత ఫీజు రీఎంబర్స్ మెంట్ ను పునురుద్దరిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే రాజకీయాలతో సంబంధం లేని ఉన్నత విద్యావంతులను విసిలుగా నియమిస్తామని హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్రలో భాగంగా సోమవారం రాఫ్తాడు సమీపంలోని ఎస్ కె యునివర్సిటి వద్ద ఎఐఏసెఫ్ కు చెందిన విద్యార్ధులు లోకేష్ కు సంఘీభావం తెలిపి వారి సమస్యలు గురించి విన్నవించారు.
ఈ సందర్భంగా విద్యార్ధులతో లోకేష్ మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన విశ్వవిద్యాలయాల్లో సొంత మనుషులను జొప్పించి ఉన్నత విద్యావ్యవస్థను జగన్మోహన్ రెడ్డి భ్రష్టు పట్టించారని విమర్శించారు. జిఓ నెం.77తో పిజి విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్ మెంట్ రద్దుచేసి రాష్ట్రవ్యాప్తంగా 50వేలమంది పేదవిద్యార్థులకు జగన్ అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు వివిధ పోటీపరీక్షలకు శిక్షణ తీసుకునేందుకు అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ ను తిరిగి ప్రారంభిస్తామన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. కరోనా సమయంలో హాజరుశాతం లేక డిటైన్ కు గురైన విద్యార్థుల అడ్మిషన్ పునరుద్దరించి పరీక్షలు రాసుకునే అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు.