టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే నియోజకవర్గాల వారీగా బిసిలకు రెసిడెన్షియల్ కళాశాలలు ఏర్పాటు చేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్రలో భాగంగా గురువారం ఉరవకొండ నియోజకవర్గం కమ్మూరు లో బిసి సామాజిక వర్గీయులతో లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా బిసి సామాజిక వర్గ ప్రతినిధులు పలు సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. వాటిపై లోకేష్ సానుకూలంగా స్పందిస్తూ టిడిపి అధికారంలోకి రాగానే బిసిల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకువస్తామన్నారు. న్యాయపోరాటానికి అయ్యే ఖర్చు సైతం ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు.
వైసీపీ ప్రభుత్వం బీసిలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నదని, ఇప్పటివరకు 26 వేల మందిపై అక్రమకేసులు పెట్టారని ఆరోపించారు. ఏ ప్రభుత్వ హయాంలో బిసిలకు మేలు జరిగిందనే విషయం పై చర్చకు రావాలని బిసి సంక్షేమ శాఖామంత్రి కి లోకేష్ సవాల్ విసిరారు. టిడిపి తోనే బిసిలకు రాజకీయ, ఆర్థిక స్వాతంత్య్రం వచ్చింది అని చెప్పారు. పలు కార్పొరేషన్ ల ద్వారా బిసిలను ఆదుకున్నామని చెప్పారు. టిడిపి హయాంలో బిసిలకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తే, వైసీపీ ప్రభుత్వం దానిని తగ్గించింది అని ధ్వజమెత్తారు. జగన్ కు బిసిలు అంటే ప్రేమ లేదు అందుకే డమ్మీ కార్పొరేషన్ లు పెట్టి నిధులు, విధులు లేకుండా చేశారని విమర్శించారు. పేదరిక నిర్మూలన చేయటమే టిడిపి లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
టిడిపి అధికారంలోకి రాగానే దామాషా ప్రకారం బిసి ఉపకులాలకు నిధులు కేటాయిస్తామని తెలిపారు. టిడిపి హయాంలో లో ఈడిగ కులస్తులను ప్రోత్సహించినట్టు చెప్పారు. జగన్ తన మద్యం వ్యాపారం కోసం కల్లు గీత కార్మికులను వేధిస్తున్నాడని ఆరోపించారు. ఆదరణ పథకం ద్వారా బిసిలకు పనిముట్లు అందించామన్నారు. వైసీపీ ప్రభుత్వం చనిపోయిన లేదా గాయపడిన ఒక్క కల్లుగీత కార్మికుడినీ ఆదుకోలేదని విమర్శించారు. అధికారంలోకి రాగానే చంద్రన్న బీమా ను మరింత పటిష్టంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. టిడిపి అధికారంలోకి రాగానే ఫీజు రీ యింబర్స్మెంట్ పథకం, విదేశీ విద్యా పథకాలను పునరుద్ధరిస్తామని చెప్పారు. వన్ టైం సెటిల్మెంట్ తో రీ యింబర్స్మెంట్ బకాయిలు అన్నీ చెల్లిస్తామని హామీ ఇచ్చారు. విద్యాదీవెన, వసతి దీవెన ల కారణంగా విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. జగన్ బటన్ నొక్కినా తల్లిదండ్రుల ఖాతాలలో డబ్బులు పడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాల యాజమాన్యాలు ఫీజులు చెల్లించాలని విద్యార్థులపై వత్తిడి తీసుకు వస్తున్నారన్నారు.