- నీటి మునిగిన నూలు, సామగ్రికి రూ.5 వేలు
- 718 మందికి రూ.35.90 లక్షల పరిహారం
- 27,982 తుఫాన్ బాధిత కుటుంబాల గుర్తింపు
- మత్స్యకారులకు చేస్తున్న విధంగానే నిత్యావసరాలు
- బీసీ సంక్షేమ, చేనేత జౌళి శాఖ మంత్రి సవిత
అమరావతి(చైతన్యరథం): మొంథా తుఫాన్‌తో నష్టపోయిన చేనేత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా నిలిచింది. నీటి మునిగి తడిచిపోయిన నూలు, రంగులు, రసాయనాలకు రూ.5 వేల చొప్పున నష్టపరిహారం అందజేస్తున్నామని బీసీ, ఈడబ్ల్యూ ఎస్, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. వర్షాల కారణంగా ఉపాధి కోల్పోయిన చేనేత కార్మికుల కుటుంబాలకు 50 కిలోల బియ్యం, లీటర్ పామాయిల్, కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, పంచదార కిలో చొప్పున నిత్యా వసరాలు అందజేస్తున్నట్లు మంత్రి వెల్లడిరచారు. మత్స్యకారులకు, చేనేతలకు మాత్రమే 50 కిలోల చొప్పున బియ్యం అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఇటీవల మొంథా తుఫాన్ రాష్ట్రంలో బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందేనన్నారు. ఈ తుఫాన్ కారణంగా రైతులతో పాటు చేనేత కార్మిక కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయన్నారు. వర్షాల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సర్వేలో 27,982 చేనేత కుటుంబాలను తుఫాన్ బాధిత కుటుంబాలుగా అధికారులు గుర్తించినట్లు తెలిపారు. తీవ్ర వర్షాల కారణంగా నీట మునిగి మూడు మగ్గాలు దెబ్బతిన్నట్లు గుర్తించాం. 718 మందికి చెందిన నూలు, రంగులు, రసాయనాలు వంటి ఇతర వస్తువులు నీటిలో తడిచిపోయాయి.
తడిచిపోయిన నూలు, ఇతర రంగులకు రూ.5 వేలు చొప్పున రూ.35.90 లక్షలు అందజేస్తున్నాం. నీటి మునిగిన మూడు మగ్గాలు స్వల్పం నష్టం చేకూరిందని, ఆ మగ్గాలకు అవస రమైన పరికరాల కొనుగోలుకు బాధితులకు రూ.10 వేలు అందజేస్తున్నాం. వాటితో పాటు నిత్యాసరాలు అందజేస్తున్నామని వివరించారు. బాపట్ల జిల్లాలో అత్యధికంగా 8,567 మంది చేనేత కుటుంబాలకు తుఫాన్ కారణంగా నష్టపోయారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 4,278 కుటుంబాలు, కృష్ణాలో 3,900 కుటుంబాలు, శ్రీకాకుళంలో 3,333 కుటుంబాలు, నెల్లూరులో 2,400 కుటుంబాలు, తిరుపతి జిల్లాలో 1700 కుటుంబాలు మొంథా బాధిత కుటుంబాలను గుర్తించినట్లు చెప్పారు. మిగిలిన జిల్లాల్లోనూ బాధిత కుటుంబాలను గుర్తించి నిత్యావసరాలు అందజేస్తున్నామని తెలిపారు.















