- ఉద్యాన సమ్మేళనంలో మంత్రి పయ్యావుల పిలుపు
- హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నాం: టీజీ భరత్
- లక్ష టన్నుల అరటి ఎగుమతి లక్ష్యం: ఎంపీ అంబిక
- అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానం: ప్రభుత్వ విప్ కాల్వ
- సమ్మేళనానికి భారీగా హాజరైన హార్టీకల్చర్ రైతాంగం
అనంతపురం (చైతన్య రథం): ‘‘ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఇండియా’’గా అనంతపురం జిల్లాను తీర్చిదిద్దడమే లక్ష్యమని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. అనంతపురంలోని బళ్లారి రోడ్‌లోవున్న ఎంవైఆర్ కన్వెన్షనల్ హాల్‌లో బుధవారం ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో అనంత ఉద్యాన సమ్మేళనం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి పయ్యావుల కేశవ్ రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన 13 స్టాల్స్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ మరియు రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు పరిటాల సునీత, అమిలినేని సురేంద్రబాబు, గుమ్మనూరు జయరాం, బండారు శ్రావణి శ్రీ, తాడిపత్రి మున్సిపల్ చైర్‌పర్సన్ జెసి ప్రభాకర్ రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (హార్టికల్చర్, అగ్రికల్చర్, ఫిషరీస్) వ్యవసాయం మరియు సహకార శాఖ బి రాజశేఖర్, ఏపీ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ మరియు సెరికల్చర్ కె.శ్రీనివాసులు, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సిఈఓ శేఖర్‌బాబు, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్.వి తదితరులు పాల్గొన్నారు.
మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ కార్యక్రమం ఏర్పాటుకు సీఎం చంద్రబాబు స్ఫూర్తి అని, కార్యక్రమాన్ని రైతులకు అంకితం చేస్తున్నామన్నారు. రైతాంగం జీవితంలో మార్పు తేవడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. నారు పోసే దగ్గరనుంచి పంట ఉత్పత్తులను అమ్ముకునే వరకు రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. అనంత జిల్లాను ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఇండియాగా తయారు చేయడమే తమ లక్ష్యమన్నారు. ఉద్యాన పంటల సాగులో బ్రాండ్ అనంతను సృష్టించాలన్నారు. పంటల నాణ్యత మరింత పెరగాలని, మంచి విత్తనాలు ఎన్నుకోవాలన్నారు. 1995-96లో మొదటిసారి డ్రిప్ ప్రవేశపెట్టినపుడు అనేక విమర్శలు వచ్చాయని, అయినా ముందుకు వెళ్ళామని, గత నాలుగేళ్లుగా డ్రిప్ పంపిణీ ఆగిపోయిందని, మళ్లీ తాము ప్రవేశపెడుతున్నామని, ఉరవకొండలో సామూహిక ఇరిగేషన్ ప్రాజెక్టు కింద 50,000 ఎకరాలకు నీళ్ళందించే కార్యక్రమం చేపట్టామన్నారు. రైతు భారాన్ని తగ్గించి ఆదాయం పెంచి ముందుకు తీసుకోవడమే తమ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం అన్నారు. ఆటోమేటిక్ వాల్వ్ సిస్టంలు, డ్రిప్, ఇతర పరికరాలు రైతులకు విస్తృతంగా అందిస్తామన్నారు. మెరుగైన టెక్నాలజీ ద్వారా రైతు శ్రమ తగ్గించి ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. తాము అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ కాలువపై జంగిల్ క్లియరెన్స్ చేస్తున్నామని, ఒక్క సీజన్లోనే హంద్రీనీవా కాలవ వెడల్పు పనులు చేపడతామంటూ, ఆ పనులను సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు.
జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నాం
కార్యక్రమానికి వర్చువల్‌గా హాజరైన జిల్లా ఇన్చార్జ్ మంత్రి, రాష్ట్ర పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ అనంతపురం జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని, ఇప్పటికే మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతోందన్నారు. సమ్మేళనం.. రైతులకు మరింత సహాయకారిగా ఉండేందుకు దోహదం చేస్తుందన్నారు. సమ్మేళనం ఏర్పాటుకు మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ మంత్రి అచ్చనాయుడు చాలా కృషి చేశారన్నారు. జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందిస్తున్న పథకాలు మరియు ప్రోత్సహకాల గురించి అధికారులు, సమ్మేళనంలో పాల్గొన్న వక్తల ద్వారా రైతులు తెలుసుకోవాలన్నారు. ఈ సందర్భంగా అవార్డులు పొందిన వారికి అభినందనలు తెలిపారు. సమ్మేళనంలో చేసుకున్న ఎంఓయుల ద్వారా రైతులు ఇప్పటినుంచి సంవత్సర కాలంలో మెరుగైన ఫలితాలు చూడగలుగుతామన్నారు..
లక్ష టన్నుల అరటి ఎగుమతికి ప్రయత్నం
కార్యక్రమానికి వర్చువల్‌గా హాజరైన అనంతపురం ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌గా మారిన అనంతపురం జిల్లా రైతులు హార్టికల్చర్ పరిశ్రమని దేశవ్యాప్తంగా విస్తరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. జిల్లానుంచి లక్ష టన్నుల అరటిని ఎగుమతి చేసే ప్రయత్నం మొదలైందన్నారు. అత్యల్ప వర్షపాతం నమోదైనా రత్నాల్లాంటి పంటలు పండిరచి రతనాల సీమను తయారు చేయాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు ఉన్నారని, జిల్లాలో హార్టికల్చర్ ఎయిర్‌పోర్ట్‌ని ఏర్పాటు చేసి వివిధ నగరాలకు వీలైనంత తొందరగా పండ్లను ఎగుమతి చేసే అవకాశం కల్పించి.. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నామన్నారు.
అంతర్జాతీయ మార్కెట్లతో అనంత అనుసంధానం
ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ అనంతపురం జిల్లా దశాబ్దాల కాలంగా పండ్ల తోటలకు ప్రసిద్ధి చెందిందన్నారు. జిల్లాలో పండే చీని, దానిమ్మ, ద్రాక్ష తదితర పంటలు జాతీయ మార్కెట్లో ఎంత ప్రసిద్ధిగాంచాయని, ఇటీవల కాలంలో అరటి, బొప్పాయిలాంటి పంటలు పెద్ద ఎత్తున ఉత్పత్తి అవుతున్నాయన్నారు. వాటికి సరైన మార్కెట్ సౌకర్యం కల్పిస్తే అధిక ధరలు లభిస్తాయన్నారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన మార్కెట్లతో అనంతపురం మార్కెట్‌ను ఏవిధంగా అనుసంధానం చేయాలో ఆలోచించాలని, దాని ద్వారా రైతులకు అధిక ధరలు లభించే అవకాశం ఉందన్నారు.
టమోటా రైతును ఆదుకోండి
గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ జిల్లాలో టమోటా ఎక్కువగా పండిస్తారని. వారికి గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ కళ్యాణదుర్గంలో 30 వేల ఎకరాలలో ఐదు లక్షల టన్నుల టమోటాను రైతులు సాగు చేశారన్నారు. ధరల హెచ్చుతగ్గుల సమయంలో వారి పంటను కాపాడుకోవడానికి రైతులకు ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. అలాగే ఈ ప్రాంతంలో పండే మామిడికి మంచి పేరు ఉందని, మామిడికి సైతం ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలన్నారు. అలాగే చింతపండు కూడా ఎక్కువగా పండుతుందని, ఆ పంటను అధిక ధరలకు అందుకునేందుకు రైతులకు కోల్డ్ స్టోరేజ్‌ను ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు.
రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ రైతులకు రాయితీపై డ్రిప్పు మరియు స్ప్రింక్లర్లను ఐదు ఎకరాల వరకు ఇస్తున్నారని, వాటిని ఐదు ఎకరాల నుంచి పది ఎకరాలకు పెంచి అందించాలన్నారు. జిల్లాను గ్రోత్ ఇంజన్‌గా గుర్తించిన పంటలతోపాటు సీతాఫలం, దానిమ్మలనూ చేర్చాలని కోరారు. డ్రోన్ ద్వారా మందుల పిచికారి చేసేందుకు ఎకరాకు 630 రూపాయలు తీసుకుంటున్నారని, ఈ ధరను తగ్గించే ఏర్పాట్లు చేయాలన్నారు. సమ్మేళనం జిల్లా ఉద్యాన రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జిల్లాలో నిర్వహించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో తాడిపత్రి మున్సిపల్ కమిషనర్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి సమ్మేళనానికి విశేష కృషి చేసిన జిల్లా కలెక్టర్‌ను అభినందిస్తూ శాలువాకప్పి ప్రత్యేకంగా సన్మానించారు. కార్యక్రమంలో స్పెయిన్, ఆల్గా ఎనర్జీ వైస్ ప్రెసిడెంట్ దేబబ్రత సర్కార్, వెంకట్రామన్నగూడెం హార్టికల్చర్ యూనివర్సిటీ హెడ్ డా.రవీంద్ర, ఏఎఫ్ ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ మల్లారెడ్డి, ఏపీఎంఐపీ ప్రాజెక్ట్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, అడిషనల్ డైరెక్టర్ హరినాథ్ రెడ్డి, హార్టికల్చర్ డిడి నరసింహారావు, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి ఉమామహేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.