- అమరావతి ప్రపంచంలోనే అద్భుత నగరం అవుతుంది
- లోకేష్‌తో ఢిల్లీ పరిశ్రమల మంత్రి మన్జిందర్ సింగ్ శిర్సా
- ఏపీ ప్రతినిధులను ఢిల్లీకి పంపించాలని ఆహ్వానం
అమరావతి(చైతన్యరథం): అమరావతి రాజధాని నిర్మాణ తీరును చూశాం..నిజంగా ఇదొక అద్భుతం..ప్రపంచంలోనే ఇదొక గొప్ప నగరంగా మారుతుందని ఢిల్లీ పరిశ్రమల మంత్రి మన్జిందర్ సింగ్ శిర్సా ప్రశంసించారు. చంద్రబాబు విజనరీ ముఖ్యమంత్రి.. అభివృద్ధికి, దార్శనికతకు ఆయనొక విశ్వవిద్యాలయం..పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంలో ఏపీ ప్రభుత్వం మార్గదర్శిగా నిలు స్తుందని కొనియాడారు. ఏపీని చూసి ఢిల్లీ ప్రభుత్వం నేర్చుకోవా ల్సింది ఎంతో ఉందని వ్యాఖ్యానించారు. పెట్టుబడుల ఆకర్షణ, స్మార్ట్ గవర్నెన్స్ తదితర అనేక రంగాల్లో మాకు మీ సహకారం కావాలని మంత్రులు లోకేష్, టీజీ భరత్‌లను కోరారు. ఢిల్లీ మంత్రి మన్జిందర్ సింగ్ శిర్సా నేతృత్వంలో ప్రత్యేక ప్రతినిధుల బృందం ఏపీలో పర్యటించి ఇక్కడి పారిశ్రామిక విధానాలు, పాలనా సంస్కరణలను అధ్యయనం చేస్తోంది. సచివాలయం లోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్)లో రాష్ట్ర పరిశ్రమల శాఖ అధికారులతో ఈ బృందం మంగళవారం సమా వేశమైంది. ఈ బృందానికి మంత్రి నారా లోకేష్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌లు సాదర స్వాగతం పలికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానం గురించి వివరించారు.
పెట్టుబడులకు స్వర్గధామంగా ఆంధ్రప్రదేశ్
దేశంలోనే ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు స్వర్గధామంగా మారిందని లోకేష్ వివరించారు. 2026 ఆర్థిక సంవత్సంలో ఆంధ్రప్రదేశ్ 18 బిలియన్ డాలర్ల పెట్టుబడులను సాధించింద న్నారు. భారత దేశం ఆకర్షిస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం పెట్టుబడులు ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే వస్తున్నాయని వివరిం చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా క్లస్టర్ ఆధారిత అభివృద్ధి దిశగా పారిశ్రామికాభివృద్ధి సాధిస్తున్నా మని తెలిపారు. తిరుపతి ప్రాంతంలో ఎలక్ట్రానిక్ క్లస్టర్ ఏర్పాటు చేయడం ద్వారా ఆ రంగా నికి చెందిన పరిశ్రమలు, అనుబంధ రంగ పరిశ్రమలన్నీ ఒకేచోట నెలకొల్పడానికి కావాల్సిన అనువైన వాతావరణం ఏర్పాటు చేశామని, రాష్ట్రంలో మొత్తం 22 క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అమరావతి, తిరుపతి, విశాఖ పట్నం ప్రాంతాలను ఎకనామిక్ జోన్లుగా అభివృద్ధి చేస్తున్నా మన్నారు. ఇటీవలే ఉత్తరాంధ్ర ప్రగతికి కీలకం కానున్న భోగాపు రం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించామన్నారు. రాయలసీమలోని కర్నూలు జిల్లాలో 300 ఎకరాల్లో డ్రోన్ సిటీ ఏర్పాటు చేస్తున్నా మని తెలిపారు. డేటా లేక్ ద్వారా పాలనను మరింత సరళీకృతం చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వంలోని అన్ని శాఖలకు చెందిన డేటాను ఒకచోట అనుసంధానించి డేటా లేక్ రూపొందించామని, దాని ద్వారా స్మార్ట్ గవర్నెన్స్ ప్రజలకు చేరువ చేస్తున్నామని వివరించారు. డేటా కేవలం ఒక సోర్సు నుంచి కాకుండా పలు సోర్సుల ద్వారా సేకరించి ఎప్పటికప్పుడు విశ్లేషించి డేటాను నిరంతరం అప్డేట్ చేస్తూ పారదర్శక పాలన అందిస్తున్నామని వివరణాత్మకంగా చెప్పారు.
పనితీరుకు ర్యాంకులు
ప్రభుత్వ పనితీరును కూడా తాము ఎప్పటికప్పుడు విశ్లేషించు కుంటున్నామని, ప్రభుత్వం అమలు చేస్తున్న పలు కార్యక్రమాలపై ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ పరిశీలిస్తూ పనిచేస్తున్నామని తెలిపారు. మంత్రుల మొదలు ప్రభుత్వంలో కిందిస్థాయి ఉద్యోగి వరకు వారి పనితీరుకు ర్యాంకు లు ఇస్తున్నామన్నారు. ఆయా ప్రాంతాల్లో సభలు నిర్వహించి నప్పుడు అక్కడ ఆ సభల్లోనే ప్రజల సమక్షంలో మంచిగా పని చేసిన ఉద్యోగులను అభినందిస్తున్నామని తెలిపారు. ఈ ప్రభు త్వంపై ప్రజలో ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, వారి ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా తమ ప్రభుత్వం నిరంతరం పాటు పడుతోందన్నారు. పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ మాట్లాడు తూ పెట్టుబడులు పెట్టడానికి ఏపీ అన్ని విధాలా అనుకూలమైన రాష్ట్రంగా నిలుస్తోందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చే వారికి ఎలాంటి అవరోధాలు లేకుండా అను మతులన్నీ సులభంగా వచ్చేలా సింగిల్ డెస్క్ పోర్టల్ అమలు చేస్తున్నామని వివరించారు. డేటా సెంటర్లు, షిప్ బిల్డింగ్, సెమీ కండక్టర్స్, మెడికల్ డివైజులు, ఫార్మా, ఏరోస్పేస్, డిఫెన్స్, డ్రోన్ల మొదలు రాష్ట్రంలో 22 ప్రత్యేక క్లస్టర్లు అభివృద్ధి చేస్తున్నామ న్నారు. గత రెండేళ్లుగా నూతన పారిశ్రామికాభివృద్ధి విధానం 4.0 ద్వారా సత్ఫలితాలు సాధిస్తున్నామని చెప్పారు.
ఏపీ సహకారం కావాలి
పెట్టుబడుల ఆకర్షణ, పారిశ్రామికాభివృద్ధి విధానాల అమలు తదితర అనేక అంశాల్లో ఆంధ్రప్రదేశ్‌ను చూసి మేము చాలా నేర్చుకోవాల్సి ఉందని ఢిల్లీ ప్రభుత్వ పరిశ్రమల శాఖ మంత్రి సర్దార్ మన్జిందర్ సింగ్ శిర్సా తెలిపారు. తాను చాలా ప్రభుత్వా లను చూస్తున్నానని కానీ డేటాను ఇంత సమర్థవంతంగా వినియో గించుకుని సత్ఫలితాలు సాధిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే నని ప్రశంసించారు. పబ్లిక్ ప్రైవేటు పార్టనర్షిప్కు ఆంధ్రప్రదేశ్ దేశానికే మార్గదర్శిగా నిలిచిందని పేర్కొన్నారు. అమరావతిలో ఇంత పెద్ద నిర్మాణ పనులు జరుగుతుండటం చూసి ఆశ్చర్యపో యానన్నారు. ఢిల్లీలో ఇలా నిర్మాణాలు జరగడానికి ఆస్కారం లేదన్న ఆయన భవిష్యత్తులో అమరావతి ప్రపంచంలోనే ఒక గొప్ప నగరంగా అభివృద్ధి చెందుతుందనడంలో ఎంత మాత్రం అనుమానం లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక విశ్వవిద్యాలయం లాంటి వారు..
ఆయన పుత్రుడు లోకేష్.. మీ విశ్వవిద్యాలయంలో ఇప్పుడు మాకు కూడా అడ్మిషన్ ఇవ్వండి అని సరదాగా చమత్కరించారు. పెట్టుబడుల ఆకర్షణ, పారిశ్రామి క విధానాల రూపకల్పన, డేటా డ్రైవెన్ గవర్నెన్స్ అమలు, స్మార్ట్ గవర్నెన్స్ తదితర అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికున్న అపార అనుభవంతో ఢిల్లీ ప్రభుత్వానికి ఏపీ సహకారం అందించాలని కోరారు. ఏపీ బృందాన్ని ఢిల్లీకి పంపాలని, అక్కడ తమ అధికారు లకు ఇక్కడ చేపడుతున్న కార్యక్రమాలు, విధానాల గురించి వివరించాలని కోరారు. దీనికి మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ ఢిల్లీ ప్రభుత్వానికి తాము పూర్తి సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అనంతరం ప్రతినిధుల బృందాన్ని మంత్రి నారా లోకేష్ సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఈ సమావేశంలో ఢిల్లీ ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి సజ్జన్ సింగ్ యాదవ్, రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ తదితరులు పాల్గొన్నారు.











