- క్రీడల పట్ల చిత్తశుద్ధిని నిరూపించుకున్న సీఎం చంద్రబాబు
- క్రీడాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, శాప్ ఛైర్మన్ రవినాయుడు చొరవతో క్రీడా ప్రోత్సాహకాలు విడుదల
- ఐదేళ్ల వైసీపీ పాలనలో రూ.11,68,62,288 పెండిరగ్
- గత నవంబర్‌లో సీఎం దృష్టికి తీసుకెళ్లిన శాప్ ఛైర్మన్
- 189 మంది క్రీడాకారులకు రూ.7,96,62,289 విడుదల
- సీఎంకు శాప్ ఛైర్మన్ కృతజ్ఞతలు
- హర్షం వ్యక్తం చేస్తున్న క్రీడాకారులు, క్రీడా సంఘాలు
విజయవాడ (చైతన్యరథం): రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు క్రీడల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధిని నిరూపించుకుంటున్నారని క్రీడాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాధికార సంస్థ(శాప్) ఛైర్మన్ అనిమిని రవినాయుడు వెల్లడిరచారు. శాప్ ఛైర్మన్‌గా రవినాయుడు బాధ్యతలు చేపట్టాక క్రీడాప్రోత్సాహకాల బకాయిలు విడుదల చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా పలువురు క్రీడాకారులు పెద్ద ఎత్తున వినతిపత్రాలు సమర్పించారన్నారు. గత ఐదేళ్ల పాలనలో క్రీడాకారుల భవిష్యత్తుతో వైసీపీ ప్రభుత్వం ఆడుకుందని, క్రీడాప్రోత్సాహకాలు మంజూరు చేసినప్పటికీ వాటిని చెల్లించకుండా తమ రాజకీయ విన్యాసాలకు వినియోగించుకుందన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో 220 మంది క్రీడాకారులకు రూ.11,68,62,288 క్రీడాప్రోత్సాహకాలను చెల్లించకుండా వైసీపీ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేసిందన్నారు.
దీనిపై గత నవంబర్ నెలలో సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి క్రీడాకారుల సమస్యను తీసుకెళ్లామని, క్రీడాకారుల పెండిరగ్ బకాయిలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. విజ్ఞప్తి చేసిన రెండు నెలల్లోనే సీఎం చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకున్నారని, రాష్ట్రవ్యాప్తంగా క్రీడాప్రోత్సాహకాల కోసం ఎదురుచూస్తున్న 189 మంది లబ్ధిదారులకు రూ.7,96,62,289 క్రీడాప్రోత్సాహకాలను సీఎం చంద్రబాబు విడుదల చేశారన్నారు. వైసీపీ ప్రభుత్వం బకాయిలు పెట్టిన ప్రోత్సాహకాలను కూటమి ప్రభుత్వం విడుదల చేసి క్రీడాకారులకు అండగా నిలిచిందన్నారు. ఈ ఏడాదిలో రాణించిన క్రీడాకారులకు తదుపరి బడ్జెట్ ప్రారంభంలోనే ప్రోత్సాహకాలను విడుదల చేస్తామని శాప్ ఛైర్మన్ రవినాయుడు హామీ ఇచ్చారు. నిధుల విడుదలపై క్రీడాకారులు, క్రీడాసంఘాల నిర్వాహకులు, డీఎస్‌ఏల అధికారులు, కోచ్‌లు సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారని గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రోత్సాహకాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబుకు రవినాయుడు కృతజ్ఞతలు తెలియజేశారు.