విజయవాడ (చైతన్య రథం): ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి మేరకు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు దక్షిణ కొరియాకు చెందిన వరల్డ్ స్మార్ట్ సిటీ ఫోరం ముందుకొచ్చింది. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా దొనకొండలో 25 ఎకరాల విస్తీర్ణంలో 480 మిలియన్ డాలర్ల వ్యయంతో చన్ జాంగ్ ఉన్ చల్లా క్యాన్సర్ సెంటర్‌ను నెలకొల్పనుంది. ఈమేరకు విజయవాడ పార్క్ హయత్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్యాన్సర్ సెంటర్ నిర్మాణానికి ఐదు భాగస్వామ్య కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అనంతరం వరల్డ్ స్మార్ట్ సిటీ ఫోరం అధ్యక్షుడు పీటర్ చున్ మాట్లాడుతూ.. ఈ తరహా క్యాన్సర్ సెంటర్‌ను చెన్నైలోనూ ప్రారంభించామని, అక్కడ వైద్య సేవలు కొనసాగుతున్నాయని చెప్పారు. దొనకొండలో సెంటర్ నిర్మాణం అనంతరం మెడిసిన్ తయారీ, డయాగ్నిస్టిక్ ఎక్విప్మెంట్ తయారీ, ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ఒక ఇనిస్టిట్యూట్ నిర్మాణం చేపడతామన్నారు. అనంతరం చల్లా గ్రూప్ అధినేత చల్లా ప్రసాద్ మాట్లాడుతూ.. తాను ప్రకాశం జిల్లా వాసినని, తనకు జన్మనిచ్చిన ప్రాంతంలో దక్షిణ కొరియాకు చెందిన వరల్డ్ స్మార్ట్ సిటీ ఫోరం సహకారంతో చన్ జాంగ్ ఉన్ చల్లా క్యాన్సర్ సెంటర్ ఏర్పాటు చేస్తుండటం సంతోషంగా ఉందన్నారు. ఏపీలో పెట్టుబడుల కోసం సీఎం చంద్రబాబు చేస్తోన్న నిరంతర కృషి ప్రశంసనీయమన్నారు.










