- వచ్చే మార్చిలోగా మరో 50 వేలు పూర్తిచేయాలి
- పూర్తయిన ఇళ్లకు త్వరలో గృహప్రవేశాలు
- మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు
- సమీక్షలో మంత్రి పార్థసారథి
అమరావతి (చైతన్యరథం): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తిచేశామని రాష్ట్ర గృహనిర్మాణం, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. వచ్చే మార్చి నాటికి మరొక 50వేల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయటానికి లక్ష్యాలను నిర్దేశించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో జరుగుతున్న గృహనిర్మాణాలపై మంత్రి సోమవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. నిర్మాణాలు పూర్తయిన లక్ష ఇళ్లను త్వరలో ప్రారంభించి లబ్ధిదారులుకు ఇంటి తాళాలు అందించే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో ఒక జిల్లాలో నిర్వహించే కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొంటారని, మిగిలిన జిల్లాల్లో మంత్రులు, శాసనసభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొని లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందిస్తారన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
మౌలిక సదుపాయాలు కల్పించాలి
ఇళ్ళు నిర్మాణాలు జరిగిన కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం పురపాలక,పట్టణాభివృద్ధి శాఖ, పంచాయితీరాజ్, విద్యుత్, తదితర శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహించి తగు ప్రణాళికలు రూపొందించాలన్నారు. అవసరమైతే ఆయా శాఖల మంత్రులతో సమావేశాలు ఏర్పాటు చేసి నిధులు విడుదలకు మంత్రుల స్థాయిలో చర్చిస్తామన్నారు. ప్రతీ రోజు జిల్లా అధికారులతో సమావేశాలు నిర్వహించాలని, ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి స్పష్టం చేశారుీా సందర్భంగా రాష్ట్రంలో లక్ష ఇళ్ల ప్రారంభోత్సవాలకు తీసుకుంటున్న చర్యలను మంత్రికి రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కే.రాజబాబు వివరించారు.ఈ సమావేశంలో గృహనిర్మాణ సంస్థ చీఫ్ ఇంజినీర్ జీ.వీ.ప్రసాద్, సూపరింటెండెంట్ ఇంజినీర్లు జయరామాచారి, నాగభూషణం, ఇతర అధికారులు పాల్గొన్నారు.