- సీబీఐ, ఈడీ కేసుల్లో రోజువారీ విచారణకు కోర్టుల నిర్ణయం
- మద్యం కుంభకోణం, వివేకా హత్యలో 40 కోట్ల సుపారీ.. వేళ్లన్నీ ఆయన వైపే
- తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని రూ.43 వేల కోట్ల ప్రజాధనం దోపిడీపై 11 సీబీఐ, 9 ఈడీ ఛార్జ్ షీట్లపై ఇక వేగంగా విచారణ
- న్యాయస్థానాలతో 14 ఏళ్ల ఆటలకు తెర, ఇక జగన్ దారెటు?
- అదే సమయంలో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్, అగమ్యగోచరంగా వైకాపా పరిస్థితి
- స్థానిక ఎన్నికలపై గతం మరిచి మాట్లాడుతున్న సజ్జల
- టీడీపీ పొలిట్యూరో సభ్యుడు, ఎమ్మెల్సీ వర్ల రామయ్య
వైకాపా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత రాజకీయ పరిస్థితి చూస్తుంటే కుడితిలో పడ్డ ఎలుకలా కొట్టుమిట్టాడుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్సీ వర్ల రామయ్య విమర్శించారు. చుట్టూ ముసురుకుంటున్న అవినీతి కేసులు, హత్యా రాజకీయాలకు సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో జగన్ రాజకీయ భవిష్యత్తుపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కోర్టుల్లో కేసుల విచారణను రోజువారీ ప్రాతిపదికన చేపట్టేందుకు రంగం సిద్ధమైన ఈ తరుణంలో మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారిని నేను సూటిగా అడుగుతున్నాను “మీ దారెటు జగన్ గారూ? అటా? ఇటా? ఎటు వెళ్తున్నారు మీరు?” మీ పరిస్థితి ఏంటో, మీ దారి ఎటో ఇప్పుడు యావత్ రాష్ట్ర ప్రజలకూ స్పష్టంగా అర్థమైపోయింది. తప్పు చేసినవాడు ఎప్పటికీ చట్టం నుంచి తప్పించుకోలేడు. హిందీలో ఒక ప్రసిద్ధ సామెత ఉంది. “కానూన్ కే హాత్ బహుత్ లంబే హోతే హై” అంటే చట్టం చేతులు చాలా పొడవుగా ఉంటాయి. నువ్వు ఎంత దూరం పరిగెట్టినా, ఎంతకాలం దాక్కోవాలని చూసినా చట్టం చేయి వచ్చి నీ మెడను పట్టుకుంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సరిగ్గా అదే పరిస్థితి ఎదురవుతోంది.
తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని రూ.43 వేల కోట్లు ప్రజాధనాన్ని కోట్టేశాడని సీబీఐ అరెస్ట్ చేసి, 11 ఛార్జ్ షీట్లు వేసి, ఇప్పుడు రోజువారి విచారణ జరుపుతుంటే మీదారెటూ జగన్?
తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని రూ.43,000 కోట్ల ప్రజాధనాన్ని, ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టారని మేం చెప్పడం లేదు, మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు, మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు కూడా అనలేదు. ఈ దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ ఆధారాలతో సహా చెప్పింది. రూ.43,000 కోట్ల అవినీతిపై సమగ్ర దర్యాప్తు జరిపి, మిమ్మల్ని అరెస్టు చేసి, 16 నెలల పాటు చంచల్గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉంచింది సీబీఐ కాదా? సీబీఐ మీపై ఏకంగా 11 చార్జిషీట్లు దాఖలు చేసిన మాట వాస్తవం కాదా? ఆ అవినీతి దర్యాప్తు ఆధారంగా మనీలాండరింగ్ జరిగిందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరో 9 చార్జిషీట్లు వేసి, దాదాపు రూ.2,000 నుంచి రూ.3,000 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన సంగతి నిజం కాదా? ఇంతకాలం రకరకాల వాయిదాలు కోరుతూ కాలయాపన చేసిన రోజులు ముగిశాయి. ఇప్పుడు న్యాయస్థానాలు ఈ కేసులన్నింటినీ రోజువారీ పద్ధతిలో విచారించడానికి సిద్ధపడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారూ.. ఇన్ని ఆధారాలు, ఇన్ని చార్జిషీట్లు మీ మెడకు చుట్టుకున్న వేళ ఇప్పుడు మీ పరిస్థితి ఏమిటి? ప్రజలకు సమాధానం చెప్పే ధైర్యం మీకు ఉందా? మీ దారెటు.. కోర్టు మెట్లా? లేక చంచల్గూడ జైలు బాటా? చట్టానికి ఎవరూ అతీతులు కారని, చేసిన పాపాలు పండినప్పుడు అనుభవించక తప్పదని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా గుర్తించాలి.
మద్యం స్కాం.. వివేకా హత్య కేసు.. ముంచుకొస్తున్న రోజువారీ విచారణ.. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారూ, మీ దారెటు?
వైకాపా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అక్రమాలు, దందాలు ఒక్కొక్కటిగా బట్టబయలవుతుంటే ఆయన పరిస్థితి ఇప్పుడు నిలువునా నీరైపోతోంది. మీ ఐదేళ్ల పాలనలో జరిగిన రూ.3,500 కోట్ల భారీ మద్యం కుంభకోణంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే మీ కోటరీలోని ముఖ్య నేతలందరినీ సిట్ అధికారులు కటకటాల వెనక్కి నెట్టారు. మిమ్మల్ని పక్కనపెడితే మిగిలిన వారంతా ఊచలు లెక్కపెడుతున్నారు. ఇటీవల పదవీ విరమణ చేసిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ స్థాయి సీనియర్ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ కూడా వాంగ్మూలం, సాక్ష్యాధారాలు ఇచ్చేశారు. ఇక ఈ మద్యం దందాలో ఆ రూ.3,500 కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి? ఆ ‘అంతిమ లబ్ధిదారుడు’ ఎవరు అనేది తేలడమే తరువాయి. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారూ.. మీ దారెటు? అటా? ఇటా? ఇక మీ మెడ మీద వేలాడుతున్నది మామూలు కత్తి కాదు, గొడ్డలి కాదు.. సాక్షాత్తూ మీ సొంత బాబాయ్ వై.ఎస్. వివేకానంద రెడ్డి గారి దారుణ హత్య కేసు హంతకులకు రూ.40 కోట్ల సుపారీ ఇచ్చారనే ఆరోపణల్లో ఆ వేళ్లన్నీ ఎటువైపు చూపిస్తున్నాయో రాష్ట్రంలో పసిపిల్లాడిని అడిగినా చెబుతారు. అవినాష్ రెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిన్న ఏడు గంటల పాటు విచారించింది, ఈరోజు కూడా విచారణ కొనసాగిస్తోంది. ఆయన తండ్రిని, బంధువులను, మరికొందరిని ముమ్మరంగా ప్రశ్నిస్తూ దర్యాప్తును చివరి దశకు తీసుకొచ్చింది.
ఈ పరిణామాల మధ్య జగన్మోహన్ రెడ్డి గారూ.. మీ దారెటు? అటా? ఇటా? కాస్త తేల్చుకోండి. ఓవైపు కేసులు చుట్టుముడుతుంటే, మరోవైపు నిన్న రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. దాంతో వైకాపా శిబిరంలో ఒక్కసారిగా గజగజ వణుకు మొదలైంది. నాయకులంతా విలవిల్లాడిపోతున్నారు. ఏమిటీ తక్షణ కర్తవ్యం? అసలు కిం కర్తవ్యం?, మన పార్టీ గతి ఏంటి? మన అధినేత పరిస్థితి ఏంటి?, రెండో శ్రేణి నాయకుల భవిష్యత్తు ఏమిటి? అసలు ఈ స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడమా? లేక పలాయనం చిత్తగించడమా? అంటూ వైకాపా శ్రేణులు తీవ్ర గందరగోళంలో, సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నాయి. వంద గుడ్లు తిన్న రాబందు ఒక్క గాలివానకే కుప్పకూలిపోయినట్లు.. సీబీఐ, ఈడీ కేసుల రోజువారీ విచారణ మొదలవుతోందన్న వార్త వినగానే జగన్ శిబిరం పేకమేడలా కకావికలమైపోయింది. తన భవిష్యత్తు ఏంటో జగన్ గారికి పూర్తిగా బోధపడింది. అందుకే గత రెండు మూడు రోజులుగా ఆయన పార్టీ నాయకులతోనో, కార్యకర్తలతోనో కాకుండా.. కేవలం నల్లకోటు న్యాయవాదులు, సుప్రీంకోర్టు లీగల్ ఎక్స్పర్టులతోనే తాడేపల్లి ప్యాలెస్లో తలమునకలవుతున్నారు. “ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఎటు వెళ్లాలి? ఏం చేయాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?” అంటూ న్యాయకోవిదులను ప్రాధేయపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అధినేత లీగల్ కేసుల భయంతో తలదాచుకుంటుంటే, కింద క్యాడర్ మాత్రం దిక్కుతోచక రోడ్డున పడింది. తప్పులు చేసి ప్రజాధనాన్ని లూటీ చేసిన వారికి, కుటుంబ సభ్యుల హత్యల వెనుక నిజాలను తొక్కిపెట్టిన వారికి చట్టం ముందు తలవంచక తప్పదని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా గ్రహించాలి. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారూ.. మీ దారెటు? చట్టం ముందు మోకరిల్లడమా? లేక ప్రజాగ్రహానికి గురికావడమా? తేల్చుకోండి
న్యాయస్థానాలతో 14ఏళ్లుగా ఉయ్యాల ఆటలు.. ఇక సాగవు జగన్మోహన్ రెడ్డి గారూ
నేను ఎవరి మీదా జాలిపడో లేక కించపరచాలనో ఈ మాటలు మాట్లాడటం లేదు. వాస్తవాలను సమాజం ముందుంచడమే నా బాధ్యత. మన ఆటలు, నాటకాలు ఎల్లకాలం సాగవు, న్యాయస్థానాలతో ఉయ్యాల ఆట ఆడుతూ కాలయాపన చేయడం ఇకపై అస్సలు సాధ్యం కాదని చెప్పడమే నా ప్రధాన ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డి గారిపై సీబీఐ తొలి చార్జిషీటు దాఖలు చేసి దాదాపు పద్నాలుగు సంవత్సరాలు గడిచిపోయింది. పద్నాలుగేళ్లుగా డిశ్చార్జి పిటిషన్ల పేరుతో, చట్టంలోని చిన్నచిన్న లొసుగులను అడ్డుపెట్టుకుని, కోట్లాది రూపాయల ఫీజులు చెల్లించి పెద్ద పెద్ద న్యాయవాదులను పెట్టుకుంటూ విచారణ ముందుకు సాగకుండా అడుగడుగునా అడ్డుపడ్డారు. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గానీ, విభజిత రాష్ట్రంలో గానీ ఇన్ని అవినీతి కేసులు విచారణకు రాకుండా, బలహీనమైన కుంటిసాకులతో డిశ్చార్జి పిటిషన్లు వేస్తూ పద్నాలుగేళ్లు సాగదీసిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? అందుకే నేను అంటున్నాను.. జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థలతో, న్యాయస్థానాలతో ఉయ్యాల ఊగారని.
న్యాయవ్యవస్థలో ఒక ప్రాథమిక సూత్రం ఉంది. “న్యాయం చేయడంలో ఆలస్యం జరగవచ్చేమో గానీ, న్యాయం ఎప్పటికీ నిరాకరించబడదు. ఇప్పుడు సీబీఐ దాఖలు చేసిన అభియోగపత్రాలతో పాటు, ఈడీ దాఖలు చేసిన తొమ్మిది చార్జిషీట్లపై న్యాయస్థానాలు రోజువారీ విచారణ చేపట్టాలని నిర్ణయించాయి. చట్టబద్ధంగా నిజానిజాలు నిగ్గుతేల్చేందుకు సాహసోపేత నిర్ణయం తీసుకున్న న్యాయస్థానాలకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను న్యాయస్థానాలను వేలెత్తి చూపడం లేదు, చట్టపరిధిలోనే అవి వ్యవహరిస్తాయి. అయితే ఒక సాధారణ పౌరుడిగా, ఒక సామాన్యుడిగా నేను అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కోర్టుకు హాజరైతే భద్రతా సమస్యలు వస్తాయని, కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చవుతుందని భావించి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపులు ఇచ్చారు. ప్రజాధనం వృథా కాకూడదనే సదుద్దేశంతో తీసుకున్న ఆ నిర్ణయాన్ని నేను తప్పుపట్టడం లేదు. కానీ ఆయన ముఖ్యమంత్రి కుర్చీ దిగిపోయి ఇప్పటికే రెండున్నర సంవత్సరాలు దాటింది. ఒక సాధారణ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తికి ఇంకా వ్యక్తిగత హాజరు విషయంలో ప్రత్యేక వెసులుబాట్లు, జాప్యాలు ఎందుకు? సీబీఐ ఇప్పటివరకు ఎందుకు చురుగ్గా కదలలేదు? వ్యవస్థలు ఎందుకు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టలేకపోయాయి? అనే ప్రశ్నలు ప్రతి సామాన్యుడి మెదడును తొలిచేస్తున్నాయి.
జగన్ రాజకీయ కుప్పిగంతులు.. గజగజలాడుతున్న వైకాపా శిబిరం
రాష్ట్ర ప్రజలు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా పక్కన పెట్టేశారు, ఆయన్ను పట్టించుకోవడమే మానేశారు. మరోవైపు విచారణ వేగవంతమవుతోందన్న భయంతో జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా కుప్పిగంతులు వేస్తున్నారు. ఆయన పెడుతున్న అర్థంపర్థం లేని ట్వీట్లు, ఆయన ప్రవర్తన, వైకాపా వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే వారిలో గందరగోళం, తీవ్రమైన భయం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. నాయకుడి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారడంతో పార్టీ క్యాడర్, రెండో శ్రేణి నేతలు గజగజ వణికిపోతున్నారు. వెయ్యి గుడ్లు తిన్న రాబందు ఒక్క గాలివానకే కుప్పకూలినట్లు.. కేసుల రోజువారీ విచారణ మొదలవగానే జగన్ శిబిరంలో గుబులు మొదలైంది. ఆయనకు ఏదో అన్యాయం జరిగిపోవాలని మేము కోరుకోవడం లేదు. నేను అలాంటి మనస్తత్వం ఉన్న మనిషిని కాను. కానీ చట్టం, ధర్మం తన పని తాను చేసుకుంటూ పోవాలి. వ్యవస్థలు నిష్పక్షపాతంగా వ్యవహరించి, ప్రజలకు న్యాయం జరుగుతోందన్న స్పష్టమైన విశ్వాసాన్ని కలిగించాలి. పద్నాలుగేళ్లుగా మూలనపడ్డ కేసుల ఫైళ్లు తెరుచుకుంటున్న వేళ.. ఇకపై ఎలాంటి జాప్యానికి తావులేకుండా ఈ విచారణను వేగంగా పూర్తి చేసి, చట్టం ముందు అందరూ సమానులేనని నిరూపించాలని కోరుతున్నాను.
ఎన్నికలంటే అంత వణుకెందుకు సజ్జలా?.. 2021లో మీరు చేసిన పైశాచికాలు గుర్తున్నాయా?
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సజ్జల రామకృష్ణారెడ్డి గారు రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాస్తూ కేంద్ర బలగాలను దించాలని, ఎన్నికలు సజావుగా జరపాలని డిమాండ్ చేయడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. ఈ విషయంపై లేళ్ల అప్పిరెడ్డి గారు కూడా లేఖలు రాశారు. నేను నేరుగా వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను. అసలు మీకు, మీ పార్టీకి నిజంగా ధైర్యం ఉందా? 2021లో మీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలను ఏ విధంగా నడిపించారో ఈ రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదు. ఆనాడు నామినేషన్ల ప్రక్రియను ఎలా సాగనిచ్చారు? ప్రతిపక్ష పార్టీల అభ్యర్థుల చేతుల్లోని నామినేషన్ పత్రాలను చించివేయలేదా? పోటీ చేయాలనుకున్నవారిపై దాడులు చేయించి, కిడ్నాప్లు చేయించి బలవంతపు ఏకగ్రీవాలు చేసుకోలేదా? అప్పటి పోలీసు యంత్రాంగాన్ని, ఎన్నికల అధికారులను మీ పార్టీ తొత్తులుగా మార్చి ప్రజాస్వామ్యాన్ని నడిరోడ్డుపై ఖూనీ చేయలేదా? అప్పుడు మీరు చేసిన ఆ అరాచక పద్ధతిలోనే ఇప్పుడు కూడా ఎన్నికలు నిర్వహించాలని అడిగే దమ్ము, ధైర్యం మీకు ఉన్నాయా సజ్జలా? నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వంలో ఎన్నికలు అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, పూర్తి స్వేచ్ఛాయుత వాతావరణంలో జరుగుతాయి.
నామినేషన్లు వేయడానికి ఏ ఒక్కరికీ ఎలాంటి ఆటంకాలు ఉండవు. గత వైకాపా పాలనలో జరిగినట్లుగా గూండాయిజానికి, అప్రజాస్వామిక విధానాలకు ఇక్కడ రవ్వంత కూడా తావుండదు. పూర్తి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తామని మేం బాహాటంగా హామీ ఇస్తున్నాం. వాస్తవానికి వైకాపా నాయకత్వానికి వచ్చిన అసలు భయం ఎన్నికల నిర్వహణ కాదు. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు, కేడర్ చేజారిపోతోందన్న భయం వారిని వెంటాడుతోంది. స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి కనీసం అభ్యర్థులు కూడా దొరకని దయనీయ స్థితిలో పడ్డారు. అందుకే పోటీ చేయలేక, ముఖం చెల్లక.. ఒకవైపు కేంద్ర బలగాలు కావాలని, మరోవైపు నామినేషన్లకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలంటూ సాకులు వెతుక్కుంటూ లేఖల డ్రామాలకు తెరతీస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారూ.. ఎన్నికలు సజావుగా జరగాలని సుద్దులు చెప్పే ముందు, 2021లో మీరు సాగించిన రక్తచరిత్రను, అరాచకాలను ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. ఆనాడు మీ నిరంకుశ విధానాలతో ప్రజాస్వామ్యాన్ని కాలరాసిన చరిత్ర మీది; నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించి ప్రజాతీర్పును గౌరవించే సంస్కృతి మా తెలుగుదేశం పార్టీది. మీ ఓటమి భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి వ్యవస్థలపై బురదజల్లడం మానుకోవాలని హితవు పలికారు.















