- రత్నాలచెరువు నివాసితుల ఇళ్లస్థలాలను రెగ్యులరైజ్ చేస్తాం
- వీవర్స్‌శాలల ఏర్పాటుతో చేనేతల ఆదాయం పెంచుతాం
- మంగళగిరి నియోజకవర్గ రచ్చబండ సభల్లో యువనేత లోకేష్
మంగళగిరి(చైతన్యరథం): తాను మంగళగిరి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాక రత్నాలచెరువు ఎసైన్డ్, చెరువు పోరంబోకు భూముల్లో దశాబ్దాలుగా నివసిస్తున్న వారికి బట్టలు పెట్టి మరీ పట్టాలు అందజేస్తామని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి రత్నాలచెరువు, తాడపల్లి రూరల్ వడ్డేశ్వరం రాధారంగా నగర్, తాడేపల్లి క్రిస్టియన్ పేటల్లో శుక్రవారం నిర్వహించిన రచ్చబండ సభలో యువనేత లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… మీ అందరి ఆశీస్సులతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక గత పాతికేళ్లలో జరిగిన నష్టాన్ని భర్తీచేసి, మంగళగిరిని అభివృద్ధి దిశగా పరుగులు తీయిస్తానన్నారు. యువగళం పాదయాత్రలో రాష్ట్రమంతా తిరిగినా నా మనసంతా మంగళగిరిలోనే ఉంది.
మీ అందరి ఆశీస్సులతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక పేదరికంలేని నియోజకవర్గంగా మంగళగిరి తీర్చిదిద్దడం నా సంకల్పం, అహర్నిశలు శ్రమించి ఆ లక్ష్యాన్ని సాధించి తీరుతా. మంగళగిరి పరిధిలో మరో 10 వీవర్స్‌శాలలను ఏర్పాటుచేసి చేనేతల ఆదాయం పెంచుతాం. 2019లో ఓటమి నాలో కసి పెంచింది, మంగళగిరి సొంతమని భావించి, ప్రజల మనసు గెలవాలని నిర్ణయించుకున్నా. సొంత నిధులతో 29 సంక్షేమ పథకాలు అమలు చేశాను. చేనేతల ఆదాయం పెంచేందుకు వీవర్స్‌శాలను ఏర్పాటుచేశా. జకార్డ్ మగ్గాలు, అధునాతన డిజైన్లు, డైస్ తెచ్చాం. అధికారంలోకి వచ్చాక భూగర్భ డ్రైనేజితో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాం, కృష్ణానదినుంచి పైప్‌లైన్ వేసి ప్రతి ఇంటికీ కుళాయిద్వారా తాగునీరు అందజేస్తాం. ప్రజలు నా చుట్టూ తిరగడం కాదు, నేనే ప్రజలచుట్టూ తిరిగి అభివృద్ధి చేస్తా. సమస్యలన్నీ పరిష్కరించి దమ్ము, ధైర్యంతో ప్రజలముందు నిలబడతానని లోకేష్ అన్నారు.
కరెంటు బిల్లు పట్టుకుంటే షాక్ కొడుతోంది
జగన్ పుణ్యమా ప్రస్తుతం కరెంటు బిల్లు పట్టుకుంటేనే షాక్ కొడుతోంది. ఐదేళ్లలో 9సార్లు విద్యుత్ ఛార్జీలు, 3సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచి జనం నడ్డివిరిచారు. గతంలో వందల్లో వచ్చే కరెంటు బిల్లు ప్రస్తుతం వేలల్లో వస్తోంది. మౌలిక సదుపాయాలు కల్పించకుండా కార్పొరేషన్‌లో విలీనం చేసి ఇంటిపన్ను, చెత్తపన్ను పెంచేసి స్థానికులను ఇబ్బంది పెడుతున్నారు. శవరాజకీయాలను అలవాటుగా మార్చుకున్న జగన్మోహన్ రెడ్డి ఈ నెలలో కావాలనే పింఛన్లను ఆలస్యం చేశారు. పింఛన్ల్ల జాప్యంతో 32మంది వృద్ధులను చంపేసి వికృత రాజకీయ క్రీడకు తెరలేపారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక పింఛన్ రూ. 4వేలకు పెంచడమేగాక ఇతర సంక్షేమ పథకాలను కూడా వాలంటీర్ల ద్వారా అందించే ఏర్పాటు చేస్తాం. విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తాం. అప్పులు చేసి సంక్షేమం చేస్తే రాష్ట్రం మరో శ్రీలంకలా మారుతుంది. అభివృద్ధి, సంక్షేమాలను జోడెడ్లబండిలా నడపాలన్నది తెలుగుదేశం పార్టీ విధానమని లోకేష్ వివరించారు.
లోకేష్ దృష్టికి రత్నాలచెరువు వాసుల సమస్యలు
రత్నాలచెరువు వాసులు తమ సమస్యలను యువనేత లోకేష్ దృష్టికి తెచ్చి పరిష్కరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కళాశాలలకు వెళ్లేందుకు సకాలంలో బస్ సౌకర్యం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. జగన్ ప్రభుత్వంలో ఉన్నవాళ్లకే మళ్లీ ఇచ్చారు, ఇళ్లులేని వారికి ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. చేనేతలకు అధునాతన మగ్గాలు, మార్కెట్ లింకేజి సౌకర్యం కల్పించాలి. బంగారు పనిచేసే స్వర్ణకారులకు సబ్సిడీ రుణ సౌకర్యం కల్పించాలి. రత్నాల చెరువులో 7వేలమంది పద్మశాలీలు ఉన్నారు. కళ్యాణమండపానికి స్థలం కేటాయించాలి. చేనేతలకు జనావాసాలకు దూరంగా కాకుండా స్థానికంగానే ఇళ్లు కట్టించి ఇవ్వాలి. వర్షాలు వస్తే పనుల్లేక పస్తులు ఉండాల్సి వస్తోంది. రత్నాలచెరువులో ఎస్టీలు నివసించే ప్రాంతాల్లో రోడ్డు సౌకర్యం లేదు.
స్కూలుకు అనుబంధంగా ఆటస్థలం ఏర్పాటు నేయాలి. ముస్లిం షాదీఖానాకు స్థలం కేటాయించాలి. కొర్రీలు లేకుండా దుల్హన్ పథకం అమలుచేయాలి. ఎస్సీ, ఎస్టీలకు కళ్యాణమండపం నిర్మించాలని కోరారు. లోకేష్ స్పందిస్తూ… విద్యార్థులకు బస్ సౌకర్యం కల్పించి కనెక్టివిటీ పెంచుతాం. ఇళ్లులేని వారందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తాం. గోల్డ్ సెజ్ ఏర్పాటుచేసి స్వర్ణకారులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాం. జనాభా దామాషా పద్ధతిన కమ్యూనిటీ హాళ్లకు స్థలాలు కేటాయిస్తాం, రోడ్లనిర్మాణం చేపడతాం, అధికారంలోకి వచ్చాక రూరల్ ప్రాంతాన్ని పంచాయితీగా మార్పుచేసి భారీపన్నుల నుంచి ఉపశమనం కలిగిస్తాం. ముస్లింలకు కొర్రీలు లేకుండా దుల్హన్ పథకాన్ని అమలుచేస్తాం. టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటుచేసి మంగళగిరి ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని లోకేష్ హామీ ఇచ్చారు.
రాధారంగా నగర్ వాసుల సమస్యల ఏకరువు
తాడేపల్లి రూరల్ వడ్డేశ్వరం రాధారంగానగర్ వాసులు తమ సమస్యలను లోకేష్ దృష్టికి తెచ్చారు. మా ప్రాంతంలో ఎప్పటినుంచో నివసిస్తున్న వారికి ఇళ్లపట్టాలు, ఇళ్లులేని వారికి కొత్తగా ఇళ్లస్థలాలు ఇవ్వాలి. శ్మశానానికి స్థలం కేటాయించాలి. డీజీపీ ఆఫీసు వైపునకు వెళ్లేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాలి. జంగమదేవర్లకు ఎంబీసీ రిజర్వేషన్ కల్పించడంతో పాటు శివాలయాల్లో అర్చకత్వానికి అవకాశం కల్పించాలి. ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు నిర్వహించాలి. ఆటస్థలం ఏర్పాటుచేయాలి. మసీదు సెకండ్ ఫ్లోర్ నిర్మాణానికి ఆర్థికసాయం అందించాలని కోరారు. నారా లోకేష్ స్పందిస్తూ దామాషా ప్రకారం శ్మశానానికి స్థలం కేటాయిస్తామని చెప్పారు. దీర్ఘకాలికంగా నివసిస్తున్న వారికి శాశ్వత పట్టాలతో ఇళ్లులేని నిరుపేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తాం. మంగళగిరికి ఐటీతో పాటు ఇతర పరిశ్రమలు తెచ్చి యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.