- విశాఖ కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ పరిధి ఖరారు
- వాల్తేర్ డివిజన్ పేరు విశాఖ డివిజన్‌గా మార్చి జోన్‌లో కొనసాగింపు
- 410 కిలోమీటర్ల పరిధిలో సౌత్ కోస్టల్ రైల్వే జోన్
- కూటమి ప్రభుత్వ విజ్ఞప్తిని మన్నించిన కేంద్రానికి ప్రత్యేక ధన్యవాదాలు
- టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు
అమరావతి (చైతన్యరథం): వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధికి దోహదపడే విధంగా వాల్తేర్ డివిజన్‌ను విశాఖ డివిజన్‌గా పేరు మార్చి, విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ను ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు స్వాగతించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి దోహదం చేసేలా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా హర్షిస్తున్నామని తెలిపారు. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు చేసిన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో వాల్తేరు డివిజన్‌ను పూర్తిగా తొలగించడం సరికాదంటూ కేంద్రానికి కూటమి ప్రభుత్వం విజ్ఞప్తి చేసిందన్నారు. ఆ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం విశాఖ కేంద్రంగా నాలుగు డివిజన్లతో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని తెలిపారు. ఇది ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన కీలక ముందడుగుగా అభవర్ణించారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం కూటమి ప్రభుత్వం సాధించిన మరో ఘన విజయం. విశాఖ రైల్వే అభివృద్ధిలో చారిత్రాత్మకమైన ముందడుగుగా నిలిచిపోతుంది. ఉత్తరాంధ్ర ప్రజలకు మెరుగైన రైలు సేవలు అందించడంతో పాటు ప్రాంతీయ అభివృద్ధికి ఇది మరింత ఊతమిస్తుంది. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు రైల్వే కేటాయింపుల్లో మరింత ప్రాధాన్యం లభించేందుకు ఈ నిర్ణయం దోహదం చేస్తుందని పల్లా శ్రీనివాసరావు అన్నారు.
ఉత్తరాంధ్రపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి
ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే నష్టాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం నుంచి రూ.11,440 కోట్ల నిధులు సాధించడంతో పాటు కేంద్ర బడ్జెట్‌లో క్యాపిటల్ షేర్ కింద మరో రూ.3,295 కోట్లు కేటాయించేలా కృషి చేశారు. దేశ ప్రధానే విశాఖకు వచ్చి రూ.2 లక్షల కోట్లు విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. విశాఖను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారు. రైల్వే జోన్ సాధించడంలో ఎంపీ ఎం. శ్రీభరత్, కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా చాలా కృషి చేసారు. రాష్ట్రం మరింత ప్రగతి సాధించేలా టీడీపీ కృషి కొనసాగిస్తుంది. కేంద్రంతో సమన్వయం చేస్తూ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు కట్టుబడి ఉంటామని గురువారం ఒక ప్రకటనలో పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.