- రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం
- సామాజిక న్యాయం కూటమి ప్రభుత్వ సిద్ధాంతం
- రైతాంగం మీద మమకారం ఉన్న ప్రభుత్వం మనది
- పేదరికం లేని సమాజం నా లక్ష్యం
- ఏపీని అన్నింటా అగ్రగామిగా నిలుపుతా
- సంపద పెంచి, సంక్షేమం అందిస్తాం
- దివ్యక్షేత్రంగా శ్రీశైలం అభివృద్ధి
- సున్నిపెంట నీటి వినియోగదారుల సంఘం ప్రతినిధులతో ముఖ్యమంత్రి ముఖాముఖి..
శ్రీశైలం(చైతన్యరథం): రాయలసీమలో కరువును పారదోలటమే మనందరి సంకల్పం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కృష్ణా జలాలు పారించి రాయలసీమను రతనాల సీమ చేయటమే తమ ధ్యేయమన్నారు. శ్రీశైలంలో గురువారం స్వామి, అమ్మవార్లను దర్శించుకుని, కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన అనంతరం సున్నిపెంటలో నీటి వినియోగదారుల సంఘం ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ నీళ్లుంటే సంపద సృష్టించవచ్చునన్నారు. దాని వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది.. తద్వారా పేదరిక నిర్మూలన జరుగుతుందన్నారు. శ్రీశైలాన్ని దివ్యక్షేత్రంగా అభివృద్ధి చేసే బాధ్యత తనదన్నారు. సామాజిక న్యాయం కూటమి ప్రభుత్వ సిద్ధాంతం అన్నారు.
అభివృద్ధిలో అగ్రస్థానం..
పేదరికంలేని సమాజాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఒకపక్క సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలి. ఇంకోపక్క అభివృద్ధి చేయాలి. యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి. అందుకోసమే యువతలో నైపుణ్యాలు పెంచేందుకు కృషి చేస్తున్నాం. వినూత్నంగా నైపుణ్య గణన (స్కిల్ సెన్సస్) కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. శ్రీశైలంలో ఉండే పిల్లలకు అమెరికాలో ఉండే న్యూయార్క్ లో పనిచేసే శక్తిని ఇవ్వాలనేది నా అభిమతం. ఇప్పటికే 25 ఏళ్ల కిందట ఉమ్మడి రాష్ట్రంలో నేను చేసిన అభివృద్ధి మీరు చూశారు. విశ్వనగరంగా ఎదిగిన హైదరాబాద్ నగరాన్ని మీరు చూశారు. ప్రపంచమంతా విస్తరించిన తెలుగు ఐటీ ప్రొఫెషనల్స్‌ను చూశారు. ఇంతచేసినా ఎవరో కొత్త బిచ్చగాడు వస్తే, ఏదో చేస్తారని ఓట్లు వేశారు. వాళ్లు అడవి పందుల మాదిరి మొత్తం చెడగొట్టి పోయారు. సర్వనాశనం చేసి, భ్రష్టుపట్టించి, విధ్వంసం చేసి వెళ్లిపోయారు. ఇప్పుడు అవన్నీ సరిదిద్దాలంటే నాకు ఐదు, పదేళ్లు పట్టేలా ఉంది. కానీ నాకొక సంకల్పం ఉంది. మా కూటమిని మీరు చూస్తే.. నేను, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోదీ.. అందరం ఒక దృఢ సంకల్పంతో ఉన్నాం. అభివృద్ధిని పరిగెత్తిస్తాం. రాబోయే రోజుల్లో ఏపీని తిరిగి నెం.1 స్టేట్‌గా తయారుచేసే బాధ్యత మాది
సామాజిక న్యాయం టీడీపీ సిద్ధాంతం
జనాభా దామాషా ప్రకారం ప్రతి కులానికి, ప్రతి మతానికి, ప్రతి వర్గానికీ న్యాయం చేయడం మా పార్టీ సిద్ధాంతం. ఇటీవల ఎన్నికల్లో సీట్లు కూడా.. నంద్యాల ఎంపీగా శబరికి టిక్కెట్ ఇస్తే, పక్కన కర్నూలు ఎంపీగా కురుబ కులానికి చెందిన నాగరాజుకు అవకాశం ఇచ్చాం. అనంతపురంలో బోయ వర్గానికి చెందిన వ్యక్తికి ఎంపీ టిక్కెట్ ఇచ్చాం. నంద్యాలలో మైనారిటీ వర్గానికి చెందిన ఫరూక్ కు ఎమ్మెల్యే గా అవకాశం ఇచ్చి, మంత్రిగా చేశాం. కర్నూలులో వైశ్య కులానికి చెందిన టీజీ భరత్ ను ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి మంత్రిని చేశాం. సామాజిక న్యాయం జరగాలి. అన్ని వర్గాలకు న్యాయం జరగాలి. ఈ ప్రభుత్వం అందరిది. నేను మీ అందరివాడిగా ఉంటానని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
పేదరిక నిర్మూలన దిశగా..
గ్రామాల్లో పేదవాళ్లు పైకి తీసుకొచ్చే బాధ్యత ధనవంతులు తీసుకోవాలి. గతంలో నేను ఒక ఫార్ములా తెచ్చాను. పీ-3 (పబ్లిక్, ప్రైవేట్ పార్ట్ నర్ షిప్) మోడల్లో హైదరాబాద్ బాగుపడిరది. హైదరాబాద్ లో రోడ్లు, టెలి కమ్యూనికేషన్లు, కరెంట్.. ఇవన్నీ ప్రైవేట్ వ్యక్తుల భాగస్వామ్యంతో వచ్చాయి. ఇప్పుడు నేను మాట్లాడేది పీ`4. అంటే సమాజంలో ఇప్పటికే అభివృద్ధి చేందిన వాళ్లు.. పేదవాళ్లను పైకి తీసుకువచ్చే బాధ్యత తీసుకోవాలి. పైనుండే పదిమంది కింద ఉండే 25 మందికి చేయూత ఇవ్వగలిగితే పేదరిక నిర్మూలన సాధ్యం అవుతుంది. అదే నా జీవితాశయం, నా సంకల్పం. తప్పకుండా ఈరోజు మల్లన్న సాక్షిగా చెబుతున్నా ఇది సాధించి తీరుతామని మీ అందరికీ హామీ ఇస్తున్నానని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.
ఆదాయం పెంచి పేదలకు పంచుతా
ఈరోజు ఏడాదికి రూ.33 వేల కోట్లు ఖర్చు పెట్టి పింఛన్లు ఇస్తున్నాం. నేను ఒకటే హామీ ఇస్తున్నా. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ, ఆ సంపద పేదవాళ్లకు పంచడం తెలిసిన పార్టీ మనది. మొన్నటివరకు పరిపాలించిన పార్టీ దోచుకోవడం తెలిసిన పార్టీ. దాచుకోవడం, దోచుకోవడం, వ్యవస్థలను విధ్వంసం చేయడం, నిద్రలేస్తే అబద్ధాలు చెప్పడం. అధికారంలోకి వచ్చి రెండు నెలలైనా కాలేదు.. అప్పుడే నేను ఏమీ చేయలేదని మాట్లాడుతున్నారు. ఒక పక్క అభివృద్ధి చేస్తా, ఒక పక్క సంక్షేమానికి పెద్దపీట వేస్తా, ఇంకోపక్క ఆదాయం పెంచుతా. పెంచిన ఆదాయం ఈ పేదవాళ్లకు పంచే బాధ్యత తనదని సీఎం చంద్రబాబు అన్నారు.
మంచి వర్షాలు పడి ఒక్కసారి రిజర్వాయర్లు నిండితే ఐదేళ్ల పాటు కరువు లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే గతంలో ప్రాజెక్టుల కోసం రూ.68 వేల కోట్లు ఖర్చు పెట్టాం. మైక్రో ఇరిగేషన్ తీసుకొచ్చాను, డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చాను. కానీ వైసీపీ వచ్చిన తర్వాత అన్నీ ఆపేశారు. ఈ రోజు వర్షాలు బ్రహ్మాండంగా పడ్డాయ్, దేవుడు కరుణించాడు. అన్ని రిజర్వాయర్లలో నీళ్లు నింపి, వాటిని పొదుపుగా వాడుకుని అక్కడ నుంచి మీకు సంపద సృష్టించే మార్గాలు, ఆదాయం పెంచే మార్గాలు ఎన్ని ఉన్నాయో అన్నీ నేర్పించే బాధ్యత నాది, మాది. ఈ ప్రక్రియలో మీరు కూడా పూర్తిగా అనుసంధానమైతే మనకు మంచి జరుగుతుంది. రాష్ట్రానికి మంచి జరుగుతుందని సీఎం చంద్రబాబు అన్నారు.
కరువు లేని సీమ ఎన్టీఆర్ సంకల్పం
దేనికైనా ఒక దూరదృష్టి ఉండాలి. రాయలసీమలో కరువు లేకుండా చేయాలి. అది దివంగత ఎన్టీ రామారావు కల. కృష్ణా మిగులు జలాలను తెలుగుజాతి అవసరాలకు వాడుకోవచ్చని మొట్టమొదటిసారిగా చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారకరామారావు. ఆ రోజు ఆయన ఒకటే ఆలోచించారు. రాయలసీమకు నీళ్లివ్వాలనేది ఆయన సంకల్పం. తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా తమిళనాడుకి నీళ్లు ఇవ్వాలంటే పైపులు భూమిలో వేసి తీసుకువెళ్లాలనే ప్రతిపాదనలు వస్తే.. కాలువల ద్వారా అయితే రాయలసీమకు నీళ్లివ్వచ్చని ఆలోచించి, అందుకు అనుగుణంగా తెలుగుగంగ ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేసి మహనీయుడు ఎన్టీఆర్. హంద్రీ-నీవా, ఎస్సార్‌బీసీ, నగరి-గాలేరు అన్ని కాలువలు, రిజర్వాయర్లు ప్రారంభించింది ఆయన.. అవి పూర్తి చేసింది నేను. ఇన్ని చేసినా రాజకీయాలకు అర్హతలేని వ్యక్తికి పట్టం కట్టారంటే ఎక్కడో మనలో ఇంకా చిన్న లోపం ఉంది. ఆయన ఐదేళ్లు ఉన్నాడు. నేను ఆ పేరు కూడా చెప్పను, మీకు నచ్చిన పేరు పెట్టుకోవచ్చు. ఐదేళ్లలో ఆయన మొత్తం రూ.12 లక్షల కోట్ల బడ్జెట్‌లో సాగునీటి ప్రాజెక్టులకు పెట్టిన ఖర్చు చూస్తే.. రూ.19 వేల కోట్లు. టీడీపీ ప్రభుత్వంలో ఐదేళ్ల మొత్తం బడ్జెట్ రూ. 7లక్షల కోట్లయితే సాగునీటి ప్రాజెక్టులకు చేసిన ఖర్చు చేసిన రూ.69 వేల కోట్లు. అదీ రైతాంగం మీద మన ప్రభుత్వం చిత్తశుద్ధి అంటూ జగన్ పేరు ఎత్తకుండానే సీఎం చంద్రబాబు విమర్శించారు. హంద్రీ-నీవా.. ఐదేళ్లలో రూ.5,520 కోట్లు మనం ఖర్చు పెడితే ముష్టి రూ.515 కోట్లు ఖర్చు పెట్టారు. గాలేరు-నగరి సుజల స్రవంతికి మనం రూ.2,056 కోట్లు పెడితే రూ.448 కోట్లు ఖర్చు పెట్టాడు. రాయలసీమలోనే మనం రూ.12 వేల కోట్లు ఖర్చు పెడితే అతను ఖర్చు పెట్టింది రూ.2,011 కోట్లు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యూనల్ ముందు రాయలసీమకు మిగులు జలాలు అవసరం లేదని ఆనాటి పాలకులు లిఖితపూర్వకంగా ఇస్తే, దానికోసం పోరాడాం. మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా. ఏ వ్యక్తి వల్ల, ఏ పార్టీ వల్ల మనకు న్యాయం జరిగింది, జరుగుతుంది అనే ఆలోచన మీలో ఉండాలి. మొన్న ఈ ఆలోచన మీకు వచ్చింది, అది ఎప్పుడూ ఇలాగే ఉండాలి. మొన్న ఎన్నికలు ఒక సునామీ. ఒక్కొక్క సీటులో 90 వేల మెజారిటీ. నేను ఆరోజే చెప్పాను. రాబోయేది సునామీ. ఈ సునామీలో చిత్తుచిత్తుగా ఊడ్చుకుపోతారు అని చెప్పాం అదే జరిగిందని సీఎం చంద్రబాబు అన్నారు.
నీటితోనే అభివృద్ధి
ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే రాయలసీమలో ఉద్యాన పంటలు బ్రహ్మాండంగా పండుతాయి. వాటికి సంబంధించిన పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత నాది. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు రావాలి. ఫుడ్ ప్రాసెసింగ్‌కి ఎక్కువ రావాలి. మనం పండిరచే పంటలు ప్రపంచం మొత్తం విక్రయించాలి. అందుకోసం ఇప్పటికే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేస్తున్నాం. రాయలసీమలో 4 ఎయిర్‌పోర్టులు ఉన్నాయి. అన్ని ప్రాంతాలకు అనుసంధానంగా నేషనల్ హైవేస్ వచ్చేశాయి. కరెంట్ కూడా ఇక్కడే ఉత్పత్తి అవుతోంది. రాయలసీమలో పెద్దఎత్తున పరిశ్రమలు వస్తే వేరే ప్రాంతాలవాళ్లు ఈ ప్రాంతానికి ఉపాధి వెతుక్కుంటూ కోసం వస్తారని సీఎం చంద్రబాబు అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండి ఫరూక్, రోడ్లు భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, జల వనరుల శాఖ మంత్రి డా. నిమ్మల రామానాయుడు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, నంద్యాల పార్లమెంటు సభ్యురాలు బైరెడ్డి శబరి, డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజకుమారి, డిఐజీ కే ప్రవీణ్ కుమార్, జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా, తదితరులు పాల్గొన్నారు.