- రూ.1.72 కోట్లతో మంగళగిరిలో మోడల్ గ్రంథాలయం
- డిజిటల్ ప్రపంచంతో పోటీ పరీక్షలకు కొత్త బాట
మంగళగిరి (చైతన్యరథం): చదువే ఆయుధం…. విజ్ఞానమే బలం… లక్ష్యమే గమ్యం… ఈ నినాదానికి ప్రతిరూపంగా మంగళగిరిలో ఆధునిక మోడల్ పబ్లిక్ లైబ్రరీ రూపుదిద్దుకుంది. విద్యార్థుల కలలకు రెక్కలు తొడిగి నిరుద్యోగ యువత ఆశయాలకు అండగా నిలిచే లక్ష్యంతో అభివృద్ధి చేసిన ఈ విజ్ఞాన కేంద్రం ప్రారంభమై నేడు ఏడాది పూర్తి చేసుకుంటోంది.. రూ.1.72 కోట్ల భారీ వ్యయంతో ఆధునిక హంగులు అద్దుకున్న ఈ గ్రంథాలయం పట్టణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 1986లో మొదలైన ప్రస్థానం… ఆధునికతతో కొత్త రూపం దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ హయాంలో 1986లో తెలుగు విజ్ఞాన సమాచార కేంద్రంగా ప్రారంభమైన ఈ గ్రంథాలయం దశాబ్దాలుగా విజ్ఞానాన్ని పంచుతోంది. కాలానుగుణంగా మారుతున్న విద్యా అవసరాలకు అనుగుణంగా దీనిని ఆధునికీకరించారు. 2025 నవంబరు 27న విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఆధునిక మోడల్ పబ్లిక్ లైబ్రరీని ప్రారంభించారు.
ఒకే ప్రాంగణంలో విజ్ఞాన ప్రపంచం
రెండు అంతస్తుల్లో రూపుదిద్దుకున్న ఈ గ్రంథాలయంలో పిల్లల కోసం ప్రత్యేక పఠన గది, ఆట స్థలం, దినపత్రికలు, మ్యాగజైన్ల విభాగం, వృద్ధుల కోసం ప్రత్యేక పఠన విభాగం, విశాలమైన రీడింగ్ హాల్ ఏర్పాటు చేశారు. విద్యార్థుల కోసం ప్రత్యేక స్టడీ రూమ్, రెండు బోధనా హాళ్లు, డిజిటల్ లైబ్రరీ, డిజిటల్ రిసోర్స్ సెంటర్ వంటి ఆధునిక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చారు.
యువత కలలకు డిజిటల్ రెక్కలు
గ్రూప్స్, సివిల్స్, డీఎస్సీ, బ్యాంకింగ్, రైల్వే వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువతకు ఈ గ్రంథాలయం విజ్ఞాన గనిగా నిలుస్తోంది. ఖరీదైన ప్రైవేట్ స్టడీ సెంటర్లకు వెళ్లలేని పేద, మధ్య తరగతి విద్యార్థులకు ప్రశాంతమైన వాతావరణంలో చదువుకునే వేదికగా ఇది ఉపయోగపడుతోంది. తాజా పోటీ పరీక్షల పుస్తకాలు, నాణ్యమైన స్టడీ మెటీరియల్, డిజిటల్ పనరులు నిరంతరం అందుబాటులో ఉంటే యువత విజయానికి మరింత బలమైన పునాది ఏర్పడుతుంది.
రూ.1.72 కోట్లతో అభివృద్ధి..నిధుల సమీకరణలో భాగస్వామ్యం
ఈ గ్రంథాలయ ఆధునికీకరణకు మొత్తం రూ.1.72 కోట్లు వెచ్చించారు. గుంటూరు జిల్లా మినరల్ ఫండ్స్ నుంచి రూ.90 లక్షలు. ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ నుంచి రూ.42 లక్షలు, నోవో ఇన్సూరెన్స్ ట్రోకింగ్ సర్వీసెస్ నుంచి రూ.30 లక్షలు సమకూరాయి.. ప్రభుత్వ నిధులతో పాటు సంస్థల భాగస్వామ్యం ప్రజా విజ్ఞాన కేంద్రాల అభివృద్ధికి దోహడపడింది.
ఏడాది ప్రస్థానానికి మరింత బలం… భవిష్యత్తుకు కొత్త లక్ష్యం
గ్రంథాలయం అభివృద్ధి ఒక ప్రారంభం మాత్రమే. పుస్తకాల నిరంతర నవీకరణ, పోటీ పరీక్షల ప్రత్యేక మెటీరియల్, డిజిటల్ సదుపాయాల నిర్వహణ, నాణ్యమైన ఇంటర్నెట్, పరిశుభ్రమైన వాతావరణం, తగిన సిబ్బంది అందుబాటులో ఉంటే ఈ కేంద్రం యువతకు మరింత ఉపయోగకరంగా మారుతుంది. విద్యార్థులు, నిరుద్యోగ యువత, పుస్తక ప్రియుల అవసరాలకు అనుగుణంగా సేవలను విస్తరించాల్సిన అవసరం ఉంది.
చదువుకునే ప్రతి యువకుడికి అండగా… విజయమే లక్ష్యంగా…
ఒక గ్రంథాలయం అంటే నాలుగు గోడలు, కొన్ని పుస్తకాలు మాత్రమే కాదు, అది కలలకు చిరునామా… ప్రతిభకు వేదిక… భవిష్యత్తుకు మార్గదర్శి. మంగళగిరి మోడల్ గ్రంథాలయం రాబోయే తరాలకు విజ్ఞాన భాండాగారంగా, యువత విజయ ప్రస్థానానికి బలమైన పునాదిగా నిలవాలని ఆకాంక్షిద్దాం.



















