- నైపుణ్యంతో కూడిన కార్మిక శక్తికి ఏఐ యుగంలో పెరగనున్న ఉపాధి అవకాశాలు
అమరావతి (చైతన్య రథం): ఐటీఐ విద్యార్థులకు ఐఐటీ పట్టభద్రులతో సమాన గౌరవం, గుర్తింపు లభించాలని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఆకాంక్షించారు. నైపుణ్య ఆధారిత పనులపట్ల సమాజంలో ఉన్న చిన్నచూపును తొలగించి, వృత్తి విద్యకు, నైపుణ్యం కలిగిన కార్మికులకు తగిన గౌరవాన్ని కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రస్తావనను స్వాగతిస్తూ ఆయన ఎక్స్ (ట్విటర్) వేదికగా స్పందించారు.
కృత్రిమ మేధ (ఏఐ) ప్రాధాన్యం పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో సాంకేతిక నైపుణ్యాలు కలిగిన పారిశ్రామిక కార్మికులకు ఉపాధి అవకాశాలు, డిమాండ్ మరింత పెరుగుతాయని లోకేశ్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా తయారీ రంగంలో సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేయగల నైపుణ్య కార్మికులకు భవిష్యత్తులో ఎంతో విలువ ఉంటుందని పేర్కొన్నారు.
తాను యువకుడిగా ఉన్న సమయంలో జర్మనీలోని ఆటోమొబైల్ పరిశ్రమల్లో ఇంటర్న్‌షిప్ చేసిన అనుభవాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అక్కడ నైపుణ్యం కలిగిన కార్మికులకు ఇచ్చే గౌరవాన్ని ప్రత్యక్షంగా చూశానని తెలిపారు. నైపుణ్య కార్మికులకు సమాజంలో లభించే గౌరవమే జర్మనీ అధిక నాణ్యతతో కూడిన తయారీ రంగంలో ప్రపంచ స్థాయి శక్తిగా ఎదగడానికి దోహదపడిన అంశాల్లో ఒకటని పేర్కొన్నారు. దేశంలో ఐటీఐ విద్యార్థులు, వృత్తి విద్యా కోర్సులు అభ్యసించే వారిపై ఉన్న చిన్నచూపు తొలగిపోవాలని, నైపుణ్యంతో కూడిన పనులు చేయడంలో గర్వపడే వాతావరణం ఏర్పడాలని లోకేశ్ తన ట్వీట్లో పేర్కొన్నారు. ‘స్కిల్ ఇండియా’ హ్యాష్‌ట్యాగ్‌తో తన అభిప్రాయాలను పంచుకున్నారు.



















