విశాఖపట్నం(చైతన్యరథం): సీఐఐ భాగస్వామ్య సదస్సులో తొలిరోజు కియా, రిలయన్స్, గెయిల్ సహా వివిధ దిగ్గజ కంపెనీ లు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. తొలి రోజు మొత్తం 88 పెట్టుబడి ప్రతిపాదనలకు సంబంధించిన ఒప్పందాలు, ప్రభుత్వ ఉత్తర్వుల మార్పిడి జరిగింది. 73 అవగాహన ఒప్పందాలు, 15 ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. తొలిరోజున పెట్టుబడి ప్రతిపాదనలు చేసిన సంస్థల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్, గ్రీన్కో ఎనర్జీస్, క్లీన్ మ్యాక్స్ ఎన్విరో ఎనర్జీ సొల్యూషన్స్, కియా ఇండియా ఉన్నాయి. శ్రీకాకు ళంలో రష్మి మెటలర్జికల్ ఇండస్ట్రీస్, కడపలో జేఎస్ డబ్ల్యూ గ్రూప్ పెట్టుబడులు పెట్టనున్నాయి. పునరుద్పాదక ఇంధన రంగంలో గ్రీన్కో సంస్థ, క్లీన్ మ్యాక్స్, కృష్ణా జిల్లాలో మేఘా ఇంజినీరింగ్ ఎంఓయూలు చేసుకున్నాయి. ఆటోమొబైల్, వాహన విడిభాగాలు, ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయి. శ్రీ సత్యసాయి జిల్లాలో కియా, తిరుపతి జిల్లాలో హీరో మోటో కార్ప్, ప్రకాశం జిల్లాలో ఎంఎన్ఎల్ సొల్యూషన్స్ పెట్టుబడులు పెట్టనున్నాయి. రసాయనాలు, పెట్రోకెమికల్స్ రంగంలో శ్రీకాకు ళంలో గెయిల్ ఇండియా, నెల్లూరులో ఎన్ఎన్ మ్యాగ్నెటెక్ , తిరుపతిలో ఎన్ఎన్ సిలోక్స్ గ్రీన్ మెట్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ముందుకు వచ్చాయి. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో నాయుడు పేటలో ఎస్ఎల్ఎన్ కాఫీ, హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్, అనంతపురంలో శ్రీ వసుధ ఫుడ్స్ ఎంఓయూలు చేసుకున్నాయి.



















