అమరావతి (చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పురపాలక (మున్సిపల్), పరిషత్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి (టీడీపీ – జనసేన – బీజేపీ) సాధించిన ఘన విజయం పట్ల తెలుగుదేశం పార్టీ వర్గాలు హర్షం వ్యక్తం
చేశాయి. ఈ సందర్భంగా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును మీడియా కో-ఆర్డినేటర్ ధారపనేని నరేంద్రబాబు శనివారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం
అందజేసి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నరేంద్రబాబు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో, ఐటీ, మానవ వనరుల అభివృద్ధి
శాఖల మంత్రి నారా లోకేష్ మార్గదర్శకత్వంలో సాగుతున్న కూటమి ప్రభుత్వ అద్భుత పనితీరుకు ఈ ఎన్నికల ఫలితాలే తిరుగులేని నిదర్శనమని పేర్కొన్నారు.
యువగళం స్ఫూర్తితో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనకు, విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులకు నారా లోకేష్ చేపడుతున్న చర్యలు… ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి విధానాల పట్ల ప్రజలు సంపూర్ణ విశ్వాసం ప్రకటించారని తెలిపారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు సమర్థ నాయకత్వంలో నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయడం వల్లే ఈ భారీ విజయం సాధ్యమైందని కొనియాడారు. ఎన్నికల విజయం కోసం అహర్నిశలు శ్రమించిన కార్యకర్తలకు, నాయకులకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.




















