అమరావతి (చైతన్యరథం): ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి భేటీ అయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పలుచోట్ల ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలపై కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉండవల్లిలోని సీఎం నివాసానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల గడువు ముగుస్తున్న నేపథ్యంలో కూటమి సీట్ల సర్దుబాటు అంశంపై వీరిద్దరూ సుమారు అరగంట పాటు సుదీర్ఘంగా చర్చించారు. కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీలకు చెందిన ఆశావాహులు అవకాశం ఉన్నచోట్ల పోటీపోటీగా నామినేషన్లు దాఖలు చేస్తుండటంతో కొన్నిచోట్ల గందరగోళ పరిస్థితి నెలకొంది. పోటీ ఉన్న స్థానాల్లో తిరుగు బాట్లను నివారించి, కూటమి అభ్యర్థుల మధ్య ఏకాభిప్రాయం సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. ఇదిలా ఉండగా గురువారం కూడా పవన్ కళ్యాణ్ సీఎంతో సమావేశమై సీట్ల సర్దుబాటుపై చర్చించిన విషయం తెలిసిందే.
నామినేషన్ల చివరి రోజు కావడం, పలుచోట్ల ఫ్రెండ్లీ ఫైట్ వాతావరణం కనిపిస్తుండటంతో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.















