- 4 మండలాల్లో 1,301 మంది రైతులకు చెందిన 2,915.10 ఎకరాల భూములకు విముక్తి
- 1959 నాటి రికార్డులను పరిశీలించి అక్కడికక్కడే ‘వెబ్ల్యండ్’ సవరణకు ఆదేశాలు
- రిజిస్ట్రేషన్లు, బ్యాంకు రుణాలు, పంటల బీమాకు మార్గం సుగమం
కొండపి (చైతన్యరథం): గత ఐదు పదుల కాలంగా పరిష్కారానికి నోచుకోక నలిగిపోతున్న ‘గర్భకండ్రిక భూముల సమస్యకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చారిత్రాత్మక పరిష్కారం చూపారు. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో ఎనిమిది గ్రామాల రైతులతో సీఎం నేరుగా మాట్లాడి వారి దశాబ్దాల కష్టాలను స్వయంగా విన్నారు. ఈ సందర్భంగా భూ సమస్య తీవ్రతను, చారిత్రక నేపథ్యాన్ని జిల్లా కలెక్టర్ రాజాబాబు ముఖ్యమంత్రికి వివరంగా సమర్పించారు. మొత్తం నాలుగు మండలాల పరిధిలోని 8 గ్రామాల్లో ఉన్న 2,915.10 ఎకరాల వివాదాస్పద భూములకు భూహక్కులు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిద్వారా 1,301 మంది రైతు కుటుంబాలకు ఆర్థిక భద్రత లభించింది. జరుగుమల్లి మండలం నర్సింగోలు, పచ్చవ, వర్దినేనిపాలెం, కె. బిట్రగుంట గ్రామాల్లో 569 మందికి 1,260 ఎకరాలు కేటాయించారు. (ఒక్క నర్సింగోలు గ్రామంలోనే 209 మందికి 400.24 ఎకరాల పట్టాలు అందించారు). కొండపి మండలం ఇలవర, వెన్నూరు గ్రామాల్లో 281 మందికి 1,003 ఎకరాలు జారీ చేశారు. నాగులుప్పలపాడు మండలం ఓబన్నపాలెంలో 430 మందికి 567 ఎకరాల మేర పట్టాలు అందజేశారు. సింగరాయకొండ మండలం కలికివాయ గ్రామంలో 21 మందికి 62 ఎకరాల భూమిపై హక్కులు కల్పించారు.
చారిత్రక రికార్డుల ఆధారంగా పరిష్కారం:
ఈ భూ సమస్యల పరిష్కారానికి సీఎం చంద్రబాబు స్వయంగా చొరవ తీసుకున్నారు. 1959 నాటి ఫారం-2 చారిత్రక రెవెన్యూ రికార్డులతో పాటు ప్రస్తుతం సాగులో ఉన్న రైతులు సమర్పించిన పత్రాలను స్వయంగా పరిశీలించారు. ఇనాం భూముల చిక్కులను చట్టబద్ధ ప్రక్రియ ద్వారా పరిష్కరిస్తూ రైత్వారి పట్టాల జారీకి ఆమోదం తెలిపారు. వెబ్ ల్యాండ్ రికార్డుల్లో భూముల వివరాలను తక్షణం సవరించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ నిర్ణయంతో… భూముల క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లకు ఉన్న అడ్డంకులు తొలిగాయి. బ్యాంకుల నుంచి లభించే వ్యవసాయ రుణాలు, పంటల బీమా సులభంగా అందుతాయి. ప్రభుత్వ సబ్సిడీలు, సంక్షేమ పథకాలు పొందేందుకు రైతులకు పూర్తి అర్హత లభించింది. దశాబ్దాల నాటి భూములాటలకు స్వస్తి పలికి, తమ చేతికి పట్టాలు అందించడంతో ఎనిమిది గ్రామాల రైతులు తీవ్ర ఆనందం వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.















