- రాష్ట్రంలో 54శాతం లోటు వర్షపాతం
- ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు గణనీయంగా తగ్గుముఖం
- సాగునీటి ఒత్తిడి ప్రాంతాల్లో క్రాప్ డైవర్సిఫికేషన్
- ‘పీఎండీఎస్’ విధానం తక్షణ అవసరం
- రైతులకు ఎకరాకు రూ.వెయ్యితో 32 రకాల విత్తనాల సరఫరాకు ప్రభుత్వం సిద్ధం
- ప్రతిపక్షాల కట్టుకథలను క్షేత్రస్థాయిలో ఎండగట్టాలి: చంద్రబాబు
మంగళగిరి (చైతన్యరథం): రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రజలకు తాగునీటి సరఫరాకే తమ ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో తాగునీటితో పాటు పశువుల దాహార్తి తీర్చడానికి, పరిశ్రమల అవసరాలకు లోటు లేకుండా పక్కా కార్యాచరణ అమలు చేస్తున్నామని వెల్లడించారు. ‘లీడర్షిప్ ‘కాంక్లేవ్’ లో మంత్రులు అచ్చెన్నాయుడు, అనితలతో పాటు సీఎం చంద్రబాబు ఎల్‌నినో ప్రభావం, వ్యవసాయ పరిస్థితులపై ప్రజాప్రతినిధులతో సుదీర్ఘంగా సమీక్షించి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 54శాతం లోటు వర్షపాతం నమోదైం దని, భూగర్భ జలాలు కూడా గణనీయంగా తగ్గుతున్నాయని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. “గత ఏడాది రిజర్వాయర్లలో 737 టీఎంసీల నీరు ఉండగా, ఈసారి 530 టీఎంసీలకు (12%) పరిమితమైంది. నెల్లూరు (177%), తిరుపతి (158%), కోనసీమ (103%) జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువగా పంటలు వేస్తే.. మార్కాపురం (21%), (20%), జిల్లాల్లో సాగు బాగా తగ్గింది.
నీటి సంక్షోభం దృష్ట్యా పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా 36 టీఎంసీల గోదావరి నీటిని ప్రకాశం బ్యారేజీకి తరలించి కృష్ణా డెల్టాలో పంటలను కాపాడుకున్నాం. ఈ సీజన్లో ఇంకా 71 టీఎంసీల నీరు అవసరం ఉంది” అని వివరించారు. రాయలసీమ జిల్లాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని… కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 14,900 ఎకరాల్లో పంటలు ఎండిపోయి రైతులు నష్టపోయారని సీఎం తెలిపారు. నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో క్రాప్ డైవర్సిఫికేషన్ (పంట మార్పిడి) అవసరమని సూచించారు. “ప్రతి ఎకరాలో సాగు సాధ్యమయ్యేలా 32 రకాల విత్తనాలతో కూడిన పీఎండీఎస్ విధానాన్ని ప్రోత్సహిస్తున్నాం. ఎకరాకు రూ.1,000 వ్యయంతో ప్రభుత్వం విత్తనాలు సరఫరా చేయడానికి సిద్ధంగా ఉంది. 25 లక్షల ఎకరాల్లో ఈ విధానం అవలంబించేలా ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో రైతుల్లో అవగాహన కల్పించాలి” అని పిలుపునిచ్చారు.
‘రైతన్నా మీకోసం’ ద్వారా ప్రజాప్రతినిధులు రైతులతో సమన్వయం చేసుకోవాలని కోరారు. రాష్ట్రంలో రూ.35 వేల కోట్ల వ్యయంతో రాబోయే మూడేళ్లలో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు నీరిస్తామని సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. “గత పాలకులు పోలవరం డయాఫ్రమ్ వాల్‌ను దెబ్బతీసి, సాగునీటి రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. అప్పట్లో భారీగా ఖర్చు చేసిన చరిత్ర మనదే. ఇప్పుడు ఏమీ చేయని వారు లేనిపోని దుష్ప్రచారాలు చేస్తుంటే ఊరుకోవద్దు. ప్రతిపక్షాల డ్రామాలు, కట్టుకథలను ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయికి వెళ్లి సమర్థవంతంగా తిప్పికొట్టాలి” అని సీఎం స్పష్టం చేశారు.















