అమరావతి (చైతన్యరథం): రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ దశలవారీగా కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నట్లు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. సచివాలయంలో గురువారం కేబినెట్ భేటీకి ముందు ఆయన నేతృత్వంలో మంత్రుల కీలక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు ముఖ్యాంశాలపై లోకేష్ దిశానిర్దేశం చేశారు. పింఛన్ల కోసం వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తూ అర్హులందరికీ త్వరితగతిన లబ్ధి చేకూర్చాలని అధికారులను, మంత్రులను ఆదేశించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు, నాయకులు పూర్తిస్థాయిలో సమాయత్తం కావాలని లోకేష్ పిలుపునిచ్చారు. అన్ని స్థానాల్లోనూ కూటమి అభ్యర్థుల ఘన విజయమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. అక్టోబరు నాటికి స్థానిక ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని, ఎన్నికలు వాయిదాపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కోర్టులో పెండింగ్లో ఉన్న అంశాలను కూడా త్వరితగతిన పరిష్కరించి అన్ని స్థానాల్లోనూ ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందన్నారు.
మొదట పురపాలక (మున్సిపల్) ఎన్నికలు, ఆ తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ, అనంతరం పంచాయతీ ఎన్నికలు వరుసగా జరుగుతాయని షెడ్యూల్ సరళిని వివరించారు. స్థానిక ఎన్నికలు వాయిదాపడితే కేంద్ర ఫైనాన్స్ కమిషన్ నిధులు నిలిచిపోయి రాష్ట్రానికి తీవ్ర నష్టం దురుద్దేశంతోనే జరుగుతుందనే ప్రతిపక్షం కోర్టు కేసులతో కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. విద్యా శాఖను లక్ష్యంగా చేసుకుని వైసీపీ తప్పుడు ప్రచారాలు చేస్తోందని, అలాంటి
కుట్రలపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం చెప్పిన మాట వినని అధికారులు, ప్రభుత్వం లేదా మంత్రులకే చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరించే అధికారుల విషయంలో ప్రత్యామ్నాయ చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇటీవల కొన్ని సమస్యలు కేవలం అధికారుల అలసత్వం, నిర్లక్ష్యం వల్లే తలెత్తాయని. అభిప్రాయపడ్డారు. వైద్య ఆరోగ్య రంగంలో చిన్న పొరపాటు జరిగినా సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై ట్రోలింగ్ చేస్తూ బురదజల్లే యత్నాలు చేస్తున్నారని, ఇలాంటి దుష్ప్రచారాలపై మంత్రులు తక్షణం స్పందించాలని కోరారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై గత ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి, అన్యాయంగా నిర్బంధించి
మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 9న రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని లోకేష్ పిలుపునిచ్చారు.
















