- ప్రకాశం సంస్కృతి, పశుసంపదకు ఒంగోలు గిత్త ప్రతీక అని వ్యాఖ్య
ఒంగోలు, కిమ్స్ ఆసుపత్రి జంక్షన్ (చైతన్య రథం): సమాజానికి విశిష్ట సేవలందించిన మహనీయుల సేవలను స్మరించుకుంటూ, వారి ఆశయాలను భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ఒంగోలులోని కిమ్స్ హాస్పిటల్ ఫ్లై ఓవర్ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన 20మంది ప్రముఖుల విగ్రహాలను విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఒంగోలు నగరానికి ప్రత్యేక గుర్తింపుగా నిలిచే ఒంగోలు గిత్త విగ్రహాన్ని కూడా మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు.
స్ఫూర్తిదాతల ఆలోచనలు నేటి యువతకు తెలియజేసేలా విగ్రహాల ఏర్పాటు
కిమ్స్ హాస్పిటల్ జంక్షన్ వద్ద 20మంది ప్రముఖుల విగ్రహాల ఏర్పాటు ఒంగోలు నగరానికి మరో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. వివిధ రంగాల్లో స్ఫూర్తిదాయక సేవలు అందించిన మహనీయులను స్మరించుకునే అవకాశం కల్పించడం ద్వారా వారి గొప్పతనాన్ని నేటి తరానికి పరిచయం చేసే లక్ష్యంతో విగ్రహాలను ఏర్పాటు చేశారు. వారి జీవితాలు, సేవలు, స్ఫూర్తిదాయకమైన ఆలోచనలు నేటి యువతకు, భావితరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని మంత్రి లోకేష్ అన్నారు. సామాజిక, సాంస్కృతిక, విద్యా, రాజకీయ, సాహిత్య తదితర రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖుల విగ్రహాలను ఒకేచోట ఏర్పాటు చేయడం అభినందనీయమని లోకేష్ పేర్కొన్నారు. ప్రజలకు నిత్యం కనిపించే ప్రాంతంలో ఈ విగ్రహాలను ఏర్పాటు చేయడం ద్వారా ఆయా మహనీయుల సేవలు, త్యాగాలు, వారి ఆశయాలు ప్రజలకు మరింత చేరువవుతాయని తెలిపారు.
ఒంగోలుకు మరో ప్రత్యేక ఆకర్షణగా ఒంగోలు గిత్త విగ్రహం
ఒంగోలు జాతి పశువులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రత్యేక గుర్తింపును చాటిచెప్పేలా కిమ్స్ ఆసుపత్రి జంక్షన్ వద్ద ఒంగోలు గిత్త విగ్రహాన్ని మంత్రి లోకేష్ ఆవిష్కరించారు. ఒంగోలు గిత్త విశిష్టతను భావితరాలకు పరిచయం చేయడంతో పాటు, ప్రకాశం జిల్లా సంస్కృతి, పశుసంపదకు ఇది ప్రతీకగా నిలవనుంది. కార్యక్రమంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా బాల వీరాంజనేయ స్వామి, ఆనం రాంనారాయణ రెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్ధన్ రావు, ఉగ్ర నరిసింహారెడ్డి, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
మంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించిన విగ్రహాలు:
రొండా నారపరెడ్డి -మాజీ మంత్రి, మాజీ ఎంపీ, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు.
దర్శి చెంచయ్య -స్వాతంత్య్ర సమరయోధుడు.
మాదాల నారాయణ స్వామి (ఎంఎనఎస్) -మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే, భారత్-చైనా మిత్ర మండలి వ్యవస్థాపక అధ్యక్షులు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు.
నీలంరాజు వెంకట శేషయ్య -తెలుగు సాహితీవేత్త, స్వాతంత్య్ర సమరయోధుడు, ప్రముఖ పాత్రికేయులు.
కత్తి చంద్రయ్య -ప్రకాశం జిల్లా మొట్టమొదటి కలెక్టర్
వరదా శ్రీరాముల నాయుడు -ఒంగోలు తొలి పురపాలక సంఘ అధ్యక్షులు, నాలుగుసార్లు చైర్మన్‌గా సేవలు.
బివియల్ నారాయణ -‘పావలా డాక్టర’, పేదల డాక్టర్‌గా పేరుగాంచిన వైద్య శిఖామణి.
క్లౌ జాన్ ఎవరెట్ -సామాజిక సేవకులు.
గోరంట్ల వెంకన్న -మహాదాత.
భద్రిరాజు కృష్ణమూర్తి -ఆధునిక ద్రావిడ భాషాశాస్త్ర పితామహుల్లో ఒకరు.
భానుమతి రామకృష్ణ -ప్రముఖ నటి, నిర్మాత, దర్శకురాలు, స్టూడియో అధినేత్రి, రచయిత్రి, గాయని, సంగీత దర్శకురాలు.
గరికపాటి వరలక్ష్మి -ప్రముఖ నటి, గాయని, నిర్మాత, దర్శకురాలు.
టి కృష్ణ -ప్రముఖ దర్శకులు, నిర్మాత, రచయిత.
షేక్ చినమౌలానా -ప్రముఖ నాదస్వర విద్వాంసులు.
ధారా రామనాథ శాస్త్రి -నాట్యావధాని, ప్రముఖ సాహితీవేత్త.
నాగభైరవ కోటేశ్వరరావు -ప్రముఖ కవి, సాహితీవేత్త, సినిమా మాటల రచయిత.
కలేకూరి ప్రసాద్ -కవి, రచయిత, అనువాదకులు, దళిత విప్లవకర్త
పైడి తెరేష్ బాబు -ప్రముఖ హార్మోనిస్ట్, తబలా వాయిద్యకారులు, కవి, గాయకుడు, రచయిత, దళిత సాహితీవేత్త.
మల్లవరపు జాన్ -రచయిత, కవి, సాహితీవేత్త.
బండారు రామారావు -నాటక సమాజ నిర్వాహకులు, ఉపాధ్యాయులు.














