- ఏక కాలంలో 13 వేల మంది గిరిజన బాలికల నృత్యం
- అవార్డు అందుకున్న మంత్రి సంధ్యారాణి
- నేడు ప్రధాని పర్యటనకు విస్తృత బందోబస్తు
విజయనగరం (చైతన్యరథం): భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా 13 వేల మంది గిరిజన బాలికలు ఏక కాలంలో ప్రదర్శించిన థింసా నృత్యం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నమోదయింది. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమాన్ని గిన్నిస్ బుక్ ప్రతినిధులు ప్రత్యక్షంగా వీక్షించి రికార్డు సర్టిఫికెట్ను రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి అందించారు. ఉత్తరాంధ్ర సంస్కృతి, సాంప్రదాయాల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా ఈ వేడుకను నిర్వహించారు. శనివారం భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆదివాసీలు అపూర్వ స్వాగతం పలకనున్నారు. ఇందు కోసం గత మూడు రోజులుగా ఆదివాసీ విద్యార్థినులు రిహార్సల్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఆదివాసీ విద్యార్థినులు తరలివచ్చి ఈ థింసా నృత్యంలో పాల్గొన్నారు.
అంగరంగ వైభవంగా ఏర్పాట్లు..
భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఘనస్వాగతం చెప్పేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సంప్రదాయ థింసా నృత్యంతో 13, 500 మంది ఆదివాసీ బాలికలు ప్రధానికి స్వాగతం పలక సున్నారు. ఆంధ్రప్రదేశ్ సంస్కృతి సంప్రదాయాలు, కళలు ఉట్టిపడేలా అల్లూరి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అధికారులు అలంకరించారు.
ప్రత్యేక కార్యక్రమాలు..
విమానాశ్రయ స్వాగత ద్వారం వద్ద ఆకట్టుకునేలా భారీ స్థాయిలో ఏటికొప్పాక కళాకృతిలో అలంకరించారు. విమానాశ్రయం లోపల ప్రాంగణంలో ఏపీ చారిత్రక వైభవం చాటేలా తోలు: బొమ్మలాట, బొబ్బిలి వీణ, భౌగోళిక వారసత్వం చాటిచెప్పేలా బంగినపల్లి మామిడి లాంటి చిత్రాలతో అలంకరించారు. ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
కట్టుదిట్టమైన భద్రత..!
భోగాపురం విమానాశ్రయంలో ప్రధాని మోదీ పర్యటన భద్రతా ఏర్పాట్లను రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా శుక్రవారం పరిశీలించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్, టెర్మినల్ భవనం, సభా ప్రాంగణం, థింసా నృత్య వేదికను సందర్శించారు. దాదాపు 3 వేల సీసీ కెమెరాలతో భద్రత, ట్రాఫిక్, జనసమీకరణపై నిఘా ఏర్పాటు చేశారు. బందోబస్తు, ట్రాఫిక్ నిర్వహణలో పూర్తి సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను డీజీపీ ఆదేశించారు.
రవాణా ఏర్పాట్లు పూర్తి
ప్రధాని పర్యటనకు రవాణా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఆ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. 2 వేల ఆర్టీసీ వాహనాలు, 3 వేల ప్రైవేట్ వాహనాలతో కలిపి మొత్తం 5 వేల వాహనాలు సిద్ధం చేశారు. అనుకున్న సమయానికి గమ్యస్థానానికి చేరుకునేలా రవాణా శాఖ అధికారులు పక్కాగా ఏర్పాట్లు చేశారు. భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి 3 లక్షల మంది జనం వస్తారని అంచనా వేస్తున్న అధికారులు అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎయిరిండియా ఫ్లైట్ షెడ్యూల్ విడుదల
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 24 వరకు ఎయిరిండియా ఫ్లైట్ షెడ్యూల్ను ప్రకటించింది. హైదరాబాద్-భోగాపురం మధ్య రోజూ 5 సర్వీసులను ఎయిరిండియా నడపనుంది. బెంగళూరు-భోగాపురం మధ్య రోజూ 2 సర్వీసులు, ఆది, శుక్రవారాలు మినహా మిగిలిన 5 రోజులు బెంగళూరు-భోగాపురం మధ్య మరో సర్వీస్ నడుపుతుంది. విజయవాడ-భోగాపురం మధ్య రోజూ 4 సర్వీసులు నడపనున్నట్లు ప్రకటించింది.














