విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాంగణం ఒక అపూర్వ దృశ్యానికి వేదికైంది. కొండలు, అడవుల నడుము మలిచిన లయబద్ధ అడుగులు, తరతరాలుగా గిరిజన గూడేల్లో నిక్షిప్తమైన సంప్రదాయపు సవ్వడులు -ఇవాళ ఒక్కసారిగా విమానాశ్రయ ఆవరణంలో సముద్రఘోషలా విస్తరించాయి. 13 వేలమందికి పైగా గిరిజన బాలికలు, మహిళలు ఏకకాలంలో అల్లుకున్న ‘థింసా’ నృత్యం, సాధారణంగా 15 నుంచి 20 మంది గుంపులుగా మాత్రమే ప్రదర్శించే ఈ సంప్రదాయ కళారూపాన్ని ఒక సామూహిక శక్తిగా మలిచి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నూతన అధ్యాయాన్ని లిఖించింది. అల్లూరి సీతారామరాజు జిల్లానుంచి ఆరు వేల మంది, పార్వతీపురం మన్యం జిల్లా నుంచి ఐదు వేలమంది, ఏలూరు జిల్లా నుంచి రెండువేల మంది బాలికలు, మహిళలు కదం తొక్కి, ఉత్తరాంధ్ర గిరిజన సంస్కృతి ఔన్నత్యాన్ని ప్రపంచవేదికపై నిలిపారు. క్షేత్రస్థాయిలో ప్రదర్శనను నిశితంగా పరిశీలించిన గిన్నిస్ బుక్ ప్రతినిధులు, నిర్ణీత నిబంధనలన్నీ నెరవేరినట్టు ధృవీకరించారు. అనంతరం రికార్డు సర్టిఫికెట్ను ఏపీ గిరిజన సంక్షేమ మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి అందించారు.
నారా లోకేష్ సారథ్యంలో రూపుదిద్దుకున్న ఈ బృహత్తర ప్రణాళిక, కేవలం ఒక రికార్డు కోసమే కాదు తరతరాల వారసత్వానికి కొత్త వెలుగునివ్వాలన్న తపనతో ఆవిష్కృతమైంది. ఆగస్టు 1న భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విచ్చేయనున్న వేళ, ఈ గిరిజన నృత్య తరంగమే వారికి తొలి స్వాగత గీతం కానుంది. మట్టి పరిమళం అద్దిన ఈ అడుగుజాడలు, ఉత్తరాంధ్ర నేల గుండె చప్పుడును యావత్ ప్రపంచానికి వినిపించిన క్షణంగా చరిత్రలో నిలిచిపోనున్నాయి.














