- పట్టా భూమి కబ్జా చేశారంటూ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు
- వైసీపీ మాజీ సర్పంచ్ భూదందా.. నకిలీ పత్రాలతో లీజు డ్రామా
- మాజీ ఎంపీ ఆంథోనిరెడ్డి వారసుల భూకుంభకోణం..
- స్కూల్ పేరిట ఉచితంగా కొట్టేసి రూ.15 కోట్లకు అమ్మకం
- వృద్ధురాలి ఇంటి స్థలాన్ని నొక్కేసిన వైసీపీ నేతలు..
- మాజీ ఎమ్మెల్యే కనుసన్నల్లో భూదందా..
- 10సెంట్ల ప్రభుత్వ భూమి ప్రైవేట్ ఆస్తిగా అక్రమ రిజిస్ట్రేషన్
- టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్‌లో భూ ఫిర్యాదులు
- అర్జీలు స్వీకరించి సమస్యలు పరిష్కరిస్తామన్న మంత్రి కొల్లు
మంగళగిరి (చైతన్య రథం): తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల నుంచి హాజరైన బాధితుల నుంచి గనులు, భూగర్భ, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్వయంగా వినతులు స్వీకరించి, సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. భూ ఆక్రమణలు, రెవెన్యూ రికార్డుల తారుమారు, పెన్షన్లు, రేషన్, ఇళ్ల నిర్మాణాలు వంటి పలు అంశాలపై బాధితులు అర్జీలు సమర్పించారు. పల్నాడు జిల్లా మాచర్ల మండలం జమ్మలమడక గ్రామానికి చెందిన పిన్నెబోయిన రాంబాబు అర్జీ ఇస్తూ, తమ కుటుంబానికి చెందిన 2.30 ఎకరాల పట్టా భూమిపై వైసీపీ నాయకుడు పిన్నెబోయిన రామకృష్ణ కన్నువేసి, గత ప్రభుత్వంలో అధికార బలంతో రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి, ఆన్లైన్లో తన పేరు నమోదు చేయించుకుని ఆ భూమిని వేరొకరికి అక్రమంగా విక్రయించాడని ఫిర్యాదు చేశారు. కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ తహశీల్దార్ ఆన్లైన్ రికార్డుల నుంచి అక్రమ పేరును తొలగించడం లేదని, తమకు న్యాయం చేయాలని కోరారు.
విజయనగరం జిల్లా భోగాపురం మండలం కంచెరు గ్రామానికి చెందిన శీరపు రమేష్ తమ నాయనమ్మ పేరిట ఉన్న 94 సెంట్ల భూమిని స్థానిక వైసీపీ మాజీ ప్రెసిడెంట్ శీరపు గురునాథ్ రెడ్డి రాజకీయ బలంతో ఆక్రమించుకున్నారని, తమ తల్లి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని నకిలీ లీజు డాక్యుమెంట్లు సృష్టించి భూమిని కైవసం చేసుకున్నారని ఫిర్యాదు చేశారు. తమను న్యాయం అడిగినందుకు తనతో పాటు కుటుంబాన్ని వేధిస్తున్నారని, చర్యలు తీసుకోవాలని కోరారు.
అనంతపురం జిల్లా శింగనమలకు చెందిన బిళ్ళగండ్ల రామకృష్ణ, ‘నిర్మలా సొసైటీ’ అనే క్రైస్తవ మత సంస్థ పేరిట మాజీ ఎంపీ పి. ఆంథోని రెడ్డి, వారసులు ఉచితంగా పొందిన సుమారు 60 ఎకరాల ప్రభుత్వ భూమిలో కేవలం 5 ఎకరాల్లో మాత్రమే స్కూలు నిర్మించి, మిగిలిన 55 ఎకరాల్లో గత 50 ఏళ్లుగా వ్యవసాయం చేస్తూ రూ.30 కోట్ల మేర లబ్ధి పొందుతున్నారని ఆరోపించారు. ఈ భూమిని నిబంధనలకు విరుద్ధంగా బెంగళూరుకు చెందిన హైదర్‌వలి అనే వ్యక్తి ‘బి.యస్. ఇంటర్నేషనల్ స్కూల’ సంస్థకు రూ.15 కోట్లకు అక్రమంగా బదిలీ చేశారని, పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని, భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలం నాలుగు రోడ్ల గ్రామానికి చెందిన టి. సుబ్బమ్మ, గత ఏడేళ్లుగా సరమట్లపల్లికి చెందిన వైసీపీ నాయకులు మల్లికార్జున రెడ్డి, జ్ఞాన్ రెడ్డి, రమణ రెడ్డి, జబర్ సాబ్, సురేష్ రెడ్డిలు కలిసి తన 5 సెంట్ల ఇంటి స్థలాన్ని అక్రమంగా కబ్జా చేసి, దుకాణం కూడా నిర్మించారని ఫిర్యాదు చేశారు.
కృష్ణా జిల్లా ఘంటసాల మండలం పాపవినాశనం గ్రామానికి చెందిన ఎం. బుజ్జి, 2008లో ప్రభుత్వం పేదల నివాస స్థలాల కోసం సేకరించి 42 మంది లబ్ధిదారులకు కేటాయించిన భూమిలో, 2020లో నాటి వైసీపీ మండల పరిషత్ ఉపాధ్యక్షుడు కుంపటి నాగేంద్రబాబు తన సహచరులతో కలిసి తప్పుడు దస్తావేజు సృష్టించి 10 సెంట్ల స్థలాన్ని అక్రమంగా ఆక్రమించుకున్నారని వివరించారు. ఫిర్యాదుపై సర్వే చేయాలని తహశీల్దార్ ప్రయత్నించగా, నాటి వైసీపీ ఎమ్మెల్యే, నాగేంద్రబాబు రాజకీయ బలంతో రెవెన్యూ సిబ్బందిని బెదిరించి సర్వేను అడ్డుకున్నారని, స్థానిక రెవెన్యూ సిబ్బంది కూడా అక్రమాలకు సహకరించారని ఆరోపించారు.
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం సిద్ధరామపురం గ్రామానికి చెందిన కె. శ్రీనివాస్, తనకు చెందిన 6.60 ఎకరాల భూమిని గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నాయకులు అధికారులతో కుమ్మక్కై వెబ్‌ల్యాండ్ రికార్డుల్లో కేవలం 0.68 సెంట్లుగా చూపించి, మిగిలిన భూమిని రికార్డుల నుంచి తొలగించారని ఫిర్యాదు చేశారు.
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం యరవపల్లి గ్రామానికి చెందిన బి. హనుమంతు, 1970లో తన తాత పేరిట రిజిస్టర్ అయిన 1.25 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు రికార్డులను కంప్యూటరైజ్ చేసే సమయంలో పొరపాటున ప్రభుత్వ భూమిగా మార్చేశారని, అసలు పత్రాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. వైఎసఆర్ కడప జిల్లా పెండ్లిమర్రి మండలం పోగులపల్లె గ్రామానికి చెందిన గురవయ్య, తమ పూర్వీకుల నుంచి వారసత్వంగా, కొనుగోలు ద్వారా సంక్రమించిన సుమారు 2 ఎకరాల చుక్కల భూమిని, పాత పట్టా-పాస్‌బుక్ పత్రాలు ఉన్నప్పటికీ డి. శ్రీనివాసులుతో సహా మరికొందరు అక్రమంగా ఆక్రమించుకుని నిమ్మచెట్లు నాటారని ఫిర్యాదు చేశారు.
పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం నిమ్మలపాడు గ్రామానికి చెందిన పోలినాయుడు, తనకు చెందిన 1.75 ఎకరాల భూమిని రీ-సర్వే చేసి తనకు అప్పగించాలని, ప్రస్తుతం అది కొందరి పేరిట తప్పుగా నమోదైందని కోరారు. చిత్తూరు జిల్లా యాదమరి మండలం మొటాండ్లపల్లి గ్రామానికి చెందిన మల్లేశ్వరి, తమ వంశపారంపర్య 2.64 ఎకరాల భూమిపై సక్రమ పత్రాలు ఉన్నప్పటికీ, పక్క గ్రామం చిన్నారెడ్డిపల్లికి చెందిన భరత్ రెడ్డి పోలీసుల సహకారంతో బలవంతంగా భవనం నిర్మించి ఆక్రమించారని, అడ్డుకున్నందుకు తమపైనే తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయించారని, ఆ కేసులు ఇప్పటికీ కోర్టులో నడుస్తున్నాయని వివరించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోట మండలం గూడలి గ్రామానికి చెందిన సుబ్బమ్మ, 2024 ఏప్రిల్‌లో తన అన్న వద్ద కొనుగోలు చేసిన భూమి దేవాలయ భూమిగా తేలడంతో, చెల్లించిన సొమ్ము వాపసు కోరగా ఎదుటి పక్షం వారు తనపై దౌర్జన్యానికి, భౌతిక దాడికి పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. వీటితోపాటు పలువురు పింఛన్, రేషన్, ఇళ్ల నిర్మాణాల సమస్యలపై అర్జీలు ఇవ్వగా, మరికొందరు ఉద్యోగాల కోసం రెస్యూమ్‌లు అందజేశారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నామని కొందరు ఆర్థిక తోడ్పాటు కోరుతూ విజ్ఞప్తులు చేశారు.














