- విషయ పరిజ్ఞానంలేని, ఈ జగనేనా పాలించింది..
- చరిత్రలో కోలుకోలేని ఓటమిచ్చిన ప్రజలపై కక్షగట్టాడు
- గొడ్డలి పార్టీ అనుసరిస్తున్న విధానాలు ఏ పార్టీకీ ఉండవు
- అమరావతి లక్ష కోట్ల ఆదాయాన్నిచ్చే సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్
- పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టీకరణ
పాలకొల్లు (చైతన్య రథం): అమరావతి రాజధానిపై జగన్ మాట్లాడుతున్న మాటలకు, పిచ్చి తుగ్లక్ కూడా అసూయ పడేలా ఉన్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు ఎద్దేవా చేశారు. సోమవారం పాలకొల్లు మున్సిపల్ కౌన్సిల్ హాల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన గొడ్డలి పార్టీ నాయకుల్లో జగన్ మావిగన్ అజెండాతో ముందుకు వెళ్తాం అంటుంటే, సజ్జల విజయవాడే రాజధాని అంటున్నారని, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 30 రాజధానులు కావాలంటూ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఇలా విషయపరిజ్ఞానం లేని జగనా, గత 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలించింది అని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారని విమర్శించారు.
నాడు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు అమరావతిని స్వాగతిస్తున్నాను, రాజధానికి 30వేల ఎకరాలు కావాలి, నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను అని అసెంబ్లీలో జగన్ మాట్లాడాడని మంత్రి నిమ్మల గుర్తు చేశారు. 2019 ఎన్నికల్లో 151 సీట్లతో, 50 శాతంకుపైగా ఓట్లతో, ప్రజలు అధికారం ఇస్తే, అధికారంలోకి వచ్చాక మాట మార్చి, మూడు రాజధానులు అని, ఒక్కచోట కూడా, ఒక్క ఇటుక ముక్క కూడా జగన్ పేర్చలేకపోయాడని ఎద్దేవా చేశారు. నాడు చంద్రబాబు కట్టించిన అసెంబ్లీ, సెక్రటేరియట్‌లో జగన్ ఐదేళ్లు కాలక్షేపం చేశాడన్నారు.
కూటమి ప్రభుత్వం అమరావతి రాజధానిని లక్ష కోట్ల ఆదాయం తెచ్చే, సెల్ఫ్ ఫైనాన్స్ రాజధానిగా నిర్మిస్తుందని, సంపద సృష్టించేలా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా, అమరావతిని అభివృద్ధి చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. కర్ణాటకకు బెంగుళూరు, తమిళనాడుకు చెన్నై, తెలంగాణకు హైదరాబాద్ నుండి 70 శాతం ఆదాయం ఆందిస్తున్నట్లే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా అమరావతి అదేస్థాయిలో ఆదాయం ఆర్జిస్తుందని అన్నారు. అమరావతి రాజధాని విషయంలో గొడ్డలి పార్టీ నాయకుడు జగన్ పూటకో మాట, రోజుకో మాట, కనీస జ్ఞానం లేకుండా మాట్లాడితే భవిష్యత్తులో బెంగుళూరు, తాడేపల్లి ప్యాలెస్‌లకే పరిమితమవ్వాల్సి వస్తుందని హితవు పలికారు.
చరిత్రలో కోలుకోలేని విధంగా 2024 ఎన్నికల్లో గొడ్డలి పార్టీకి 11 సీట్లు ఇచ్చి ఓడించారని.. కనీస ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని, ప్రజలపై జగన్ కక్ష కట్టాడని.. అందుకే రాష్ట్రంలో విధ్వంశ రాజకీయాలకు తెరలేపారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో గొడ్డలి పార్టీ అనుసరిస్తున్న విధానాలు, భారతదేశంలో ఏపార్టీకి ఉండవన్నారు. సొంత తల్లి, చెల్లి, చిన్నాన్నను పట్టించుకోని జగన్, రాష్ట్ర ప్రజల భవిష్యత్తును ఏం పట్టించుకుంటాడని మంత్రి నిమ్మల రామానాయుడు ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు సంక్షేమం, అభివృద్ధి కోసం అహర్నిశలూ పని చేస్తూ, రాష్ట్రానికి పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలను తీసుకువస్తున్నారని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావాలని పని చేస్తున్నారని, మంత్రి నారా లోకేశ్ విద్యావ్యవస్దలో విన్నూత్న మార్పులు తీసుకొస్తున్నారని ఇలా కూటమి పార్టీల నాయకులు కిందిస్థాయినుండి పైస్థాయి వరకూ ప్రతి ఒక్కరం అహర్నిశలూ శ్రమించి రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం పని చేస్తుంటే, గొడ్డలి పార్టీనాయకులు రాష్ట్రంలో విధ్వంశాలకు వ్యూహాలు పన్నుతున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు.

















