- కష్టాలను గుర్తించి… పరిష్కరిస్తుంది చంద్రబాబేనంటూ నిర్వాసితుల కన్నీళ్లు
- పునరావాసం అడిగితే… అరెస్టులు చేశారంటూ నాటి పాలనపై రైతు కన్నెర్ర
- పునరావసంతో పిల్లల భవిష్యత్తుపై భరోసా కలిగిందన్న నిర్వాసితులు
- తమ 30 ఏళ్ల కల నెరవేరుతోందంటూ సంతోషం వ్యక్తం చేసిన రైతులు
యర్రగొండపాలెం (చైతన్య రథం): మార్కాపురం జిల్లా దోర్నాల పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించడంతోపాటు… ప్రాజెక్టు పరిధిలోని నిర్వాసితులు, రైతులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశం ఆసాంతం భావోద్వేగభరిత వాతావరణం మధ్య సాగింది. ప్రాజెక్టు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవడంతోపాటు… పునరావాసం విషయంలోనూ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నందుకు నిర్వాసితులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. పునరావాసం విషయంలో నాటి ప్రభుత్వ వేధింపులను రైతులు, నిర్వాసితులు ఈ సమావేశంలో వివరించారు. పునరావాసం అందించే నిమిత్తం రూ.300 కోట్లు ఇవ్వడానికి స్వయంగా సీఎం రావడంపై సుంకేశుల గ్రామానికి చెందిన దూదేకుల ఖాసీం వలీ అనే నిర్వాసితుడు భావోద్వేగానికి గురయ్యారు. తమ బాధలను గుర్తించి పరిష్కారం చూపింది చంద్రబాబే అంటూ ఖాసీం వలీ కన్నీళ్లు పెట్టుకున్నారు. గత పాలకులు పునరావాసం అడిగితే అరెస్టులు చేసి వేధించారంటూ నాటి సంగతులను నిర్వాసితులు గుర్తు చేసుకున్నారు. తమ హక్కులను కాలరాసే విధంగా తమను బంధించారని వెలిగొండ ప్రాజెక్టు పరిధిలోని రైతులు సీఎంకు వివరించారు. పునరావాసం డబ్బులు అందుతుండడంతో తమ పిల్లల చదువు, భవిష్యత్తుపై భరోసా కలిగిందని మరో నిర్వాసితుడు హనుమ ప్రసాద్ చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టు పనులను చకచకా చేపట్టడం ద్వారా తమ 30 ఏళ్ల కలను సాకారం చేస్తున్నారంటూ కొందరు రైతులు పాదాభివందనం చేసే ప్రయత్నం చేయగా వారిని ముఖ్యమంత్రి నివారించారు. ఆ తర్వాత రైతులు, నిర్వాసితులు మాట్లాడిన అంశాలపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఏ ఒక్కరికీ నష్టం కలగకుండా.. ప్రతి ఒక్కరికీ న్యాయం చేసే గ్యారెంటీ తనది అంటూ నిర్వాసితులకు ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. నాలుగు జిల్లాల తలరాతలు మార్చేందుకు సహకరించిన నిర్వాసితుల త్యాగానికి తగిన ఫలాలు అందిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. వెలిగొండ ప్రాజెక్టు పరిధిలో మొత్తం 7,225 మంది నిర్వాసితులు ఉంటే కేవలం 96 మందికే ఆర్ అండ్ ఆర్ నిధులను గత ప్రభుత్వం అందించింది. శనివారం నాడు 2,351 మంది నిర్వాసితులకు రూ.300 కోట్ల మేర ఆర్ అండ్ ఆర్ నిధులు సీఎం చంద్రబాబు అందించారు. మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాల రైతులు ఈ సమావేశానికి హాజరయ్యారు. రైతుల మధ్యనే కూర్చొని ముఖాముఖిలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.















