- ఇంటింటికీ యోగా… సంపూర్ణ ఆరోగ్యం ప్రభుత్వ లక్ష్యం
- టెక్నాలజీకి ఆధ్యాత్మికను అనుసంధానిస్తే అన్జపబుల్
- ఆగస్టు 15నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని అమలు
- భారత శక్తిని ప్రపంచానికి చాటుతున్న ప్రధాని సేవలు శ్లాఘనీయం
- తిరుపతిలో యోగాంధ్ర- 2027
- అంతర్జాతీయ యోగా దినోత్సవంలో సీఎం చంద్రబాబు
- బాబా రామ్ దేవ్తో కలిసి చంద్రబాబు, లోకేష్ యోగాసనాలు
- సమాజ హితానికి బాధ్యతతో వ్యవహరిస్తామని ప్రతిజ్ఞ
అమరావతి (చైతన్య రథం): ఇంటింటికీ యోగా… సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. స్వర్ణగ్రామ, స్వర్ణవార్డు కార్యాలయాల్లో యోగా మందిరాలను నిర్మిస్తామని అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆదివారం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో సీఎం చంద్రబాబు యోగాంధ్ర లోగో ఉన్న చొక్కా ధరించి హాజరయ్యారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ప్రముఖ యోగా గురు రామ్ దేవ్ బాబా వివిధ ఆసనాలు వేయించారు. ప్రాణాయామం, అనులోమ, విలోమ పద్ధతుల్లో సీఎం చంద్రబాబు యోగాభ్యాసం చేశారు. అలాగే యోగాభ్యాసంలో భాగంగా వివిధ ఆసనాలను సీఎం చంద్రబాబు సునాయాసంగా వేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఐజీఎం స్టేడియం విద్యార్థి, యువతీ, యువకులతో నిండిపోయింది. వివిధ స్థాయిల్లోని అధికారులు, ఉద్యోగులు, ప్రజలు అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొని యోగాసనాలు వేశారు. ఉదయం ఐదు గంటలనుంచి రామ్ దేవ్ బాబా ప్రజలతో యోగ సాధన చేయించారు.
సమాజహితం కోసం బాధ్యతతో వ్యవహరిస్తామని ప్రజలతో సీఎం చంద్రబాబు ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ… “ప్రశాంత వాతావరణంలో యోగా గురువు రామ్ దేవ్ బాబాతో కలిసి యోగాభ్యాసం చేయడం ఎన్నటికీ మరువలేం. యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. ప్రధాని మోదీ ప్రపంచానికి భారతదేశ శక్తిని చాటుతున్నారు. దేశాన్ని అగ్రభాగాన నిలుపుతున్నారు. ప్రధాని చొరవతో 190 దేశాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రపంచానికి భారత్ విశ్వగురు… ప్రపంచానికి మార్గనిర్దేశం చేయగలిగేది భారతదేశం. ఫిజికల్, మెంటల్ ఫిట్నెస్ పెంచేది యోగానే. యోగాను ప్రజలకు దగ్గర చేసిన రామ్హవ్ బాబా కృషి అమోఘం. సాంకేతికత.. ఆధ్యాత్మికత కాంబినేషన్తో వెళ్తేనే భవిష్యత్, ఆథ్యాత్మికత, యోగా సాధనతో హెల్తీ, వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ సాధ్యం. ఆధ్యాత్మికాంధ్రప్రదేశ్ సాధించేందుకు కృషి చేద్దాం” అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.
యోగా కోసం ప్రత్యేక పోర్టల్
“యోగాంధ్ర-2025లో విశాఖలో నిర్వహించి రికార్డులు సృష్టించాం. ప్రధాని మోదీ సమక్షంలో గిన్నిస్ రికార్డులు, ప్రపంచ రికార్డులు సాధించాం. వచ్చే ఏడాది తిరుపతిలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తాం. 1.33 లక్షల సెంటర్లల్లో కోటిమందికి పైగా యోగ సాధన చేస్తున్నారు. ఇంటింటికి యోగా చేరాలి. ప్రజారోగ్యం బాగుండాలి. ఇదే ప్రభుత్వ లక్ష్యం. స్వర్ణగ్రామ, స్వర్ణవార్డు కార్యాలయాల్లో శాశ్వత యోగా మందిరాలు నిర్మిస్తాం. యోగా కార్యక్రమాల పర్యవేక్షణకు జిల్లా, మండలస్థాయి అధికారులను నియమిస్తాం. స్టాండర్డ్ యోగా ప్రోటోకాల్స్ రూపొందించేందుకు నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేస్తాం. యోగాంధ్ర కోసం ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేస్తాం. జంక్ఫుడ్ వద్దు, ఫాస్ట్ ఫుడ్ను దూరంగా పెడదాం. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రొత్సహిస్తున్నాం. రసాయన రహిత ఆహారాన్ని స్వీకరిస్తే అనారోగ్యం దరి చేరదు. రాష్ట్రంలో పచ్చదనాన్ని 50 శాతానికి పెంచుతాం. సంజీవని ప్రాజెక్టును ఆగస్టు 15నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తాం. వైద్య నిపుణులను ప్రజలకు చేరువ చేస్తాం. సంజీవనిలో యోగాను చేరుస్తాం. రోజుకో గంట యోగా, ధ్యానం, ప్రాణాయామం చేయాలి. అప్పుడు ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరమే రాదు.
నేను 30 ఏళ్లనుంచి యోగా అభ్యాసం చేస్తాను. ప్రతి రోజూ బిజీగా ఉంటాను. రకరకాల సమస్యలను ఫేస్ చేయాల్సి
వస్తుంది. కానీ యోగాసాధన చేయడంవల్ల అన్ని ఇబ్బందులను అధిగమించగలుగుతున్నాను. టెక్నాలజీకి ఆధ్యాత్మికతత తోడైతే అన్స్టాపబుల్. నేటితరం టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్నట్టే… యోగాను, ఆధ్యాత్మికతను అడాప్ట్
చేసుకోవాలి” అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో మొత్తం 1.07 కోట్లమంది పౌరులు, 2.5 లక్షలమంది శిక్షకులు యోగాలో పాల్గొన్నందుకు రెండు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ దక్కాయి. వాటిని అధికారులు వేదికపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్నాయుడు, శ్రీనివాస వర్మ, యోగా నేచురోపతి సలహాదారు మంతెన సత్యనారాయణరాజు, మంత్రులు సత్యకుమార్ యాదవ్, అచ్చెన్నాయుడు, కందుల దుర్గేష్, సవిత, పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని), మున్సిపల్ వ్యవహారాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ సురేష్కుమార్, ఆయుష్ డైరెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు, జిల్లా కలెక్టర్ జి లక్ష్మీశ, పతంజలి ఆయుర్వేద సహ- వస్థాపకులు ఆచార్య బాలకృష్ణ, వివిధ కార్పొరేషన్స్ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.














