- జలధార-జలహారతి పనుల్లో అధిక ప్రాధాన్యం
- ఉపాధి హామీ నిధులు పూర్తిగా వినియోగం
- వర్షపు నీటిని ఒడిసిపట్టేలా ప్రణాళిక సిద్ధం
- ప్రతి జిల్లా ఒక వినూత్న విధానం అమలు చేయాలి
- అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి(చైతన్యరథం): ప్రస్తుతం జరుగుతున్న జలధార-జలహారతి పనుల్లో గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ-అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. జలధార పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. శనివారం సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జలధా ర-జలహారతి పనుల పురోగతిపై సీఎం సమీక్షించారు. ఉపాధి హామీ నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునేలా జల ధార పనులు చేపట్టాలని ఆదేశించారు. ఉపాధి హామీ నిధుల వినియోగంలో అలసత్వాన్ని ప్రదర్శించరాదని స్పష్టం చేశారు. నీటి మిగులు బేసిన్ల నుంచి తక్కువ నీటి లభ్యత ఉన్న బేసిన్లను కనెక్ట్ చేసే పనులను చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు. జలధార పనుల కింద చెక్ డ్యామ్‌లు, ఇంకుడు గుంతలు, ఫామ్ పాండ్‌లు, కాంటూర్ కందకాల పునరుద్ధరణ పనుల్లో ఎలాంటి జాప్యం ఉండకూడదని స్పష్టం చేశారు.
చిన్న వాగుల అభివృద్ధికి వాల్మీకిపురం వాగు అభివృద్ధి మోడల్ పరిశీలించాలని సూచించా రు. నీటి భద్రత విషయంలో ప్రతి జిల్లా ఒక వినూత్నమైన విధా నాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. జలధార మొదటి విడత పనులు పూర్తయిన తర్వాత చెక్ డ్యామ్‌లు, ఫామ్ పాండ్‌లు, చెరువులకు గండ్లు పడకూడదన్నారు. నీటి ప్రవాహానికి ఆటంకం లేకుండా కాలువలు, కరకట్టలలో అడ్డంకులు తొలగిం చాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ మేరకు అధికారులు క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. జలధార వల్ల కలిగే లాభాలను ఇరిగేషన్, అవేర్ వంటి సంస్థలు ఎప్పటికప్పుడు అంచనా వేయాలన్నారు. జిల్లాల వారీగా భూగర్భ జలాల పునరుద్ధరణ లెక్కలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. జలధార కార్యక్రమంలో స్థానికులు, రైతులు, నీటి సంఘాలను భాగస్వాములు చేయాలని.. దీనికి ప్రజా ప్రతిని ధులు, అధికారులు చొరవ తీసుకోవాలని సూచించారు. ఈ సమీక్షలో మంత్రి నిమ్మల రామానాయుడు, జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.














