- ఇంటి దగ్గరకే అత్యుత్తమ వైద్య సేవలు అందించేలా ‘సంజీవని’
- కార్పొరేట్ ఆస్పత్రుల్లో యోగా శిక్షణకు ప్రత్యేక సెల్
- యూరియా వాడకం తగ్గితే మెరుగ్గా ప్రజారోగ్యం
- లలితా పీవీఎస్ ఆస్పత్రి ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
గుంటూరు (చైతన్యరథం): హెల్తీ సిటిజన్సే.. వెల్తీ నేషన్ నిర్మించగలరని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. అందుకే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ సాధనలో ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. బుధవారం సీఎం గుంటూరు జిల్లాలో పర్యటించారు. లలితా పీవీఎస్ హాస్పిటల్ను ప్రారంభించి పరిశీలించారు. 600 పడకలతో అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించిన లలితా ఆసుపత్రి యాజమాన్యాన్ని అభినందించారు. మొత్తంగా 32 విభాగాలకు సంబంధించి ఒకేచోట వైద్య సేవలు అందించేలా ఆస్పత్రి నిర్మించడంపై హర్షం వ్యక్తం చేశారు. పేద, మధ్య తరగతి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. ప్రారంభోత్సవంలో వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, పలువురు ప్రజాప్రతినిధులు, స్థానిక నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ… ‘ఆరోగ్యానికి మించిన ఆస్తి ఉండదు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నవారే నిజమైన ధనవంతులు. వేల కోట్ల రూపాయలున్నా, భవంతులున్నా, ఆరోగ్యం లేకపోతే ఉపయోగం లేదు. సంజీవని ప్రాజెక్టును ప్రభుత్వం త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తుంది. పైలెట్ ప్రాజెక్టును చిత్తూరు జిల్లాలో ఇప్పటికే అమలు చేస్తున్నాం. ఇది కంప్లీట్ హెల్త్ కేర్ ప్రోగ్రాం. ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ రికార్డులు తీసుకొస్తున్నాం. అత్యుత్తమ వైద్య విధానాలను ప్రజల ఇళ్ల దగ్గరకే అందుబాటులోకి తెచ్చేలా సంజీవని పనిచేస్తుంది. ప్రిడెక్టివ్, ప్రెవెంటివ్, క్యూరేటివ్ విధానాన్ని అమలు చేస్తున్నాం. 42 రకాల వైద్య పరీక్షలను ఇంటి దగ్గరే చేస్తాం. ఏ మందులు వేసుకోవాలి, ఎప్పుడు ఆసుపత్రులకు రావాలనే అంశాలను కూడా సంజీవని ద్వారా ప్రజలకు గైడ్ చేస్తాం. త్వరలో యూనివర్సిల్ హెల్త్ పాలసీ తీసుకొస్తున్నాం. ఒకొక్కరికి రూ.2.50 లక్షల విలువైన వైద్యం ఉచితంగా అందిస్తాం.’ అని ముఖ్యమంత్రి వెల్లడించారు.
ఆసుపత్రులకు వెళ్లే పరిస్థితి రాకూడదు
‘తినే తిండి, మన పరిసరాలు, మన ఆలోచనా విధానం చాలా ముఖ్యం. ప్రభుత్వం ఎన్ని వైద్య సేవలు అందించినా, ఆసుపత్రులు కట్టినా ప్రజలు సరైన ఆహార నియమాలు పాటించాలి. అప్పుడే అనారోగ్య సమస్యలు ఉత్పన్నం కావు. మంచి అలవాట్లు, ఆహారం, వ్యాయామం ఆరోగ్యానికి పనికొస్తాయి. ఫుడ్ మెడిసిన్… కిచెన్ ఫార్మసీ, మనం తినే ఆహారమే మనల్ని రక్షిస్తుంది. ఒకప్పుడు కావా ల్సిన పంటలను ఎరువులు లేకుండా పండించారు. కానీ ఈరోజు మొత్తం యూరియా వాడుతున్న ఆహారం తీసుకుంటున్నాం. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. తెలిసీతెలియక ఎక్కువగా క్రిమి సంహారక మందులు వినియోగిస్తున్నారు. గత ప్రభుత్వంలో నాసిరకం మద్యం కారణంగా చాలా మందికి ఆరోగ్య సమస్యలు వచ్చాయి. ప్రజల జీవితాలతో చెలగాటమాడారు.’ అని చంద్రబాబు చెప్పారు.
రాష్ట్రంలో అత్యుత్తమ ఆరోగ్య సేవలు అందిస్తాం
‘హైదరాబాద్లో ఒకప్పుడు నిమ్స్, ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులతో పాటు ఇతర చిన్న ఆసుపత్రులు మాత్రమే ఉండేవి. హైదరాబాద్లో మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు… నాడు హెల్త్ టూరిజాన్ని ప్రమోట్ చేశాం. దేశంలో ఎక్కడినుంచైనా ఇప్పుడు హైదరాబాద్ వచ్చి ట్రీట్మెంట్ చేయించుకునే పరిస్థితి నెలకొంది. ఏపీని కూడా అదే స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నాం. బెస్ట్ హాస్పటళ్లను రాష్ట్రానికి రప్పిస్తున్నాం. టెక్నాలజీతో వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నాం. హైదరాబాద్ తరహాలో వివిధ ప్రాంతాలకు చెందిన వారు మెరుగైన వైద్య చికిత్స కోసం అమరావతి వచ్చేలా అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. కార్పొరేట్ ఆస్పత్రుల్లో యోగా శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయాలి. ప్రజలకు వైద్యారోగ్య సేవలు అందించే విషయంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ చక్కగా పని చేస్తున్నారు. టెక్నాలజీని వైద్యారోగ్య రంగానికి అనుసంధానం చేసేలా ఆయన కృషి చేస్తున్నారు.
హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రాంతాల్లో కాకుండా అమరావతిలో ఆస్పత్రి నెలకొల్పిన లలితా హాస్పిటల్స్ యజమాన్యాన్ని అభినందిస్తున్నాను. దశాబ్దాలుగా వైద్య రంగంలో లలితా గ్రూప్ ఉంది. గుంటూరులో ఇలాంటి అత్యాధునిక ఆసుపత్రిని ప్రారంభించుకోవడం సంతోషకరం. బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేస్తే దానికి తిరుగుండదు అనడానికి లలితా ఆసుపత్రే ఒక నిదర్శనం. ప్రజల్లో నమ్మకం, విశ్వసనీయత కలగాలి… అప్పుడే ఏ వ్యవస్థకైనా మనుగడ. ఏడు ఎకరాల్లో 600 పడకలతో లలితా ఆసుపత్రి ఏర్పాటైంది. 32 విభాగాలకు సేవలందించే ఏకైక సెంటర్. కార్డియాలిజీ, న్యూరాలజీ, జాయింట్ రీప్లేస్మెంట్ వంటి సేవలను ఇక్కడ అందిస్తారు. ల్యాండ్ మార్క్ సంస్థగా లలితా ఆసుపత్రి మారుతుంది.’ అని ముఖ్యమంత్రి అన్నారు.













