- గనుల లీజుకు వెసులుబాటు కల్పించండి
- అమలు చేస్తే సిమెంట్, ఐరన్ ఓర్,
- రోడ్డు నిర్మాణ పరిశ్రమలకు మేలు
- కేంద్ర గనుల మంత్రికి చంద్రబాబు లేఖ
అమరావతి (చైతన్యరథం): లాటరైట్ మైన్ వర్గీకరణలో జరిగిన మార్పులపై కేంద్ర గనుల మంత్రి కిషన్‌రెడ్డికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. లాటరైట్‌లో అల్యూమినియం 20 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఉంటే దాన్ని ఉప ఖనిజంగా కాకుండా బాక్సైట్‌గా పరిగణించాలంటూ ఇటీవల కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మార్పుల వల్ల ఏపీ ఎదుర్కొంటున్న ఇబ్బందులను లేఖలో ప్రస్తావించారు. కేంద్రం నిర్ణయం వల్ల ఏపీలో గనుల లీజుల ప్రక్రియ స్తంభించిపోయిందని పేర్కొన్నారు. కొత్త నిబంధనలతో గతంలో మైనర్ మినరల్ కింద ప్రాసెస్ చేసిన 402 గనుల లీజు దరఖాస్తులను రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా హోల్డ్‌లో పెట్టిందని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. నిలిచిపోయిన వాటిలో 19 లెటర్ ఆఫ్ ఇంటెంట్ దరఖాస్తులు, 113 ప్రభుత్వ భూముల దరఖాస్తులు, 255 అటవీ భూముల దరఖాస్తులు, 15 పట్టా భూముల దరఖాస్తులు ఉన్నాయని వివరించారు.
పాత నిబంధనల మేరకు అప్లికేషన్ ఫీజులు, భూముల కొనుగోళ్లు, అటవీ అనుమతుల కోసం వందలాది మంది దరఖాస్తుదారులు కోట్లాది రూపాయలు ఖర్చు చేశారని లేఖలో ప్రస్తావించారు. గతంలో మైకా, క్వార్ట్జ్, ఫెల్డ్‌స్పార్, బారైట్స్ ఖనిజాలను మైనర్ నుంచి మేజర్ ఖనిజాలుగా మార్చినప్పుడు కేంద్రం సేవింగ్ క్లాజ్ ఇచ్చిందని లేఖలో గుర్తు చేశారు. ఇప్పుడు అదే తరహాలో లాటరైట్ ఖనిజానికి కూడా సేవింగ్ క్లాజ్ ఇచ్చి పెండింగ్‌లో ఉన్న 402 దరఖాస్తులను పాత రూల్స్ కిందనే ప్రాసెస్ పూర్తి చేసి రెండేళ్లు వెసులుబాటు ఇవ్వాలని కోరారు. సడలింపు ఇస్తే వందలాది మంది దరఖాస్తుదారులకు ఆర్థిక నష్టం తప్పుతుందని, కోర్టు వివాదాలు రావని లేఖలో వివరించారు. సేవింగ్ క్లాజ్ అమలు చేస్తే సిమెంట్, ఐరన్ ఓర్, రోడ్డు నిర్మాణ పరిశ్రమలకు ముడిసరుకు కొరత లేకుండా ఉపాధి నిలబడుతుందని తెలిపారు.















