- వన్ టైమ్ ఎమ్మెల్యేలుగా మిగలొద్దు
- ‘సర్’పై అవగాహన పెంచుకోండి… అప్రమత్తంగా ఉండండి
- ప్రతి ఓటును మ్యాపింగ్ చేయాలి… అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్ల జాబితాలో ఉండాలి
- కూటమి పార్టీలను సమన్వయం చేసుకోవాలి
- టీడీపీ ప్రజా ప్రతినిధులు, పరిశీలకులు, బీఎల్ లకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం
- రెండేళ్ల పాలనపై ఈనెల 25 నుంచి 45 రోజుల పాటు సైకిళ్లపై ఇంటింటి ప్రచారం
- చిన్న పామైనా విషం కక్కుతోంది… గొడ్డలి పార్టీని పెద్ద కర్రతో కొట్టాలి
- డీఎస్సీ, నంద్యాల ఘటనల్లో అలెర్టుగా ఉండడంతో తోకముడిచారు
మంగళగిరి (చైతన్యరథం): ఓటర్ల జాబితాకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియపై ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ‘సర్’పై జరిగిన రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ నకు ఆయన హాజర య్యారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జోనల్ కో-ఆర్డినేటర్లు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్య దర్శులు, పరిశీలకులు, బీఎల్ ఏలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో ఓటర్ల జాబితాలను ఆధారం చేసుకుని వ్యూహాలు, ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సి ఉంటుందని గుర్తు చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ‘సర్’ ప్రక్రియపై రాష్ట్రస్థాయి నేతలు మొదలుకుని గ్రామ స్థాయి వరకు ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవడమే కాకుండా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… “మహానాడును వర్చువల్ అద్భుతంగా నిర్వహించుకున్నాం. రెండు రోజుల మహానాడుకు 24.50 లక్షల మంది హాజరయ్యారు. వర్చువల్గా మహానాడును ఈ స్థాయిలో నిర్వహించుకోవడం సాధ్యమా అనే అనుమానాలను పటాపంచలు చేస్తూ… సక్సెస్ చేసుకోగలిగాం. ఇప్పుడు పార్టీ యంత్రాంగంపై అతి పెద్ద కీలక బాధ్యత ఉంది. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ‘సర్’ ప్రక్రియ మొదలవు తోంది. ప్రతి 20-25 ఏళ్లకోసారి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతుంది. 2002 ఓటర్ల జాబితాను పరి గణలోకి తీసుకుని ‘సర్’ ప్రక్రియను చేపడుతున్నారు. జులై 14వ తేదీలోగా రెండుసార్లు ఓట్ల మ్యాపింగ్ చేస్తారు. ఈ రెండుసార్లు మ్యాపింగ్ జరిగేలోగా ఓట్ల చేరికలు పరిపూర్ణంగా పూర్తి కావాలి. అవసరమైతే మూడోసారి కూడా ఇళ్లకు వెళ్లి ఓట్ల పరిశీలన జర పాలి. బీఎల్ వోలతోపాటు మన పార్టీకి చెందిన బీఎల్ఎలు కూడా వెళ్లాలి. ‘సర్’ను అందరూ సీరియస్ గా తీసుకోవాలి… ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదు. ఓట్లు నమోదు చేసుకోవడం ఓటర్ల బాధ్యత. ఓట్ల చేరికలపై ప్రజలకు అవగాహన కల్పించడం రాజకీయ పార్టీగా మన ప్రాథమిక బాధ్యత. ఏ ఎన్నికలకైనా ఓటర్ల జాబితా అనేది చాలా కీలకం.ఓటర్ల జాబితా ఆధారంగానే ఎన్నికల్లో వ్యూహాలను అమలు చేయగలం… ప్రణాళికలు సిద్ధం చేసు కుంటాం. పార్టీ బలంగా ఉంటే ప్రభుత్వం మరింత బలంగా ఉంటుంది. ‘సర్’పై ప్రతిరోజూ మానిటరింగ్ చేస్తాం. మన ఓట్లు ఉన్నాయా..? లేవా..? అనేది నిరంతరం చూసుకోవాలి. ఏపీకి చెందిన స్థానికులు వివిధరకాల కారణాలతో ఇతర ప్రాంతాలకు వెళ్తారు. వారి ఓట్ల విషయంలో జాగ్రత్తలు తీసు కోవాలి. వివిధ ప్రాంతాల్లో ఉన్న వాళ్లు పెద్ద ఎత్తున వచ్చి ఓట్లేయడం వల్లే మొన్నటి ఎన్నికల్లో కూటమికి 164 సీట్లు వచ్చాయి.” అని చంద్రబాబు స్పష్టం చేశారు.
వన్ టైమ్ ఎమ్మెల్యేలుగా మిగలొద్దు…
“చిన్న పామైనా పెద్ద కర్రతో కొట్టాలి… గొడ్డలి పార్టీ విషయంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. ఎన్నికల్లో హామీ ఇచ్చి.. మొదటి సంతకం పెట్టి మెగా డీఎస్సీ నిర్వహించాం. మెగా డీఎస్సీ జరగకూడదని 241 కేసులు వేసి అడ్డుకున్నారు. కానీ వాటిని ఎదుర్కొని అత్యంత పారదర్శకంగా డీఎస్సీ నిర్వహించి.. నియామకాలు పూర్తి చేశాం. పారదర్శకంగా నిర్వహించిన డీఎస్సీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. గట్టిగా కౌంటర్లు ఇస్తే.. ఇప్పుడు తోకముడిచారు. నంద్యాలలో ఓ వైసీపీ కార్యకర్తే వైఎస్ విగ్రహం తల తీసేశాడు. పోలీసులు నిమిషాల్లో పట్టుకున్నారు. వైసీపీ కార్యకర్తను గుర్తించకుంటే టీడీపీపై నెపం నెట్టేవారు. వివేకా హత్య అనేది ఓ కేస్ స్టడీ. చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలి… లేకుంటే విషం చిమ్ముతుంది… దీన్ని ప్రతి ఒక్కరూ నిరంతరం గుర్తు పెట్టుకోవాలి. గొడ్డలి పార్టీతో నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. నేను ఎన్నో పోరాటాలు చేశాను. కానీ నీచులతో ఎప్పుడూ పోరాటాలు చేయలేదు. పార్టీ పెట్టినప్పటి నుంచి హిందూపురం, కుప్పం సహా ఇంకొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ గెలుస్తూనే ఉంది. ఇలాంటి నియోజకవర్గాల సంఖ్య పెరగాలి.
కొత్తగా ఎమ్మెల్యేలు అయిన వారు వన్టైమ్ ఎమ్మెల్యేలుగా మిగిలిపోకూడదు. మళ్లీ మళ్లీ గెలవాలి, అభివృద్ధి, సుపరిపాలన ద్వారా ఓట్లు పడతాయి. ప్రజా ప్రతినిధుల వ్యవహార శైలితోనే ఓట్లు పెరుగుతాయి,తగ్గుతాయి. ప్రజల కోసం పని చేసినా నోరు అదుపులో పెట్టుకోకుంటే నష్టమే జరుగుతుంది. కార్యకర్త మొదలుకుని నాయకుడి వరకు ప్రతి ఒక్కరికీ క్యారెక్టర్, ట్రస్ట్ అనేది చాలా ముఖ్యం.” అన్నారు. సైకిల్ పవర్ చూపుదాం… ప్రజలకు చేరువవుదాం… “జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు ఇంటింటి ప్రచారం చేపట్టాలి. రెండేళ్లల్లో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలి. 45 రోజుల్లో ఇంటింటి ప్రచారం చేపట్టాలి… పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్లాలి. ఈ ఇంటింటి ప్రచారంలో నేను కూడా పాల్గొంటాను. సైకిళ్ల మీద వెళ్లి ప్రజలను కలవాలి.
వీలుంటే ఈ-సైకిళ్లపై ప్రచారం చేపట్టాలి. నేను కూడా సైకిల్ మీదే ప్రచారం చేస్తాను. ప్రధానిగా మోదీ 12ఏళ్లు పూర్తి చేసుకున్నారు.. నేను నాలుగోసారి సీఎంగా ఉన్నాను. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. వీటితో పాటు కేంద్ర-రాష్ట్ర
ప్రభుత్వాలు సాధించిన ప్రగతిపై పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టాలి. టీడీపీ అందరికి చెందిన పార్టీ… తెలుగు వాళ్ల పార్టీ. ప్రతి వర్గాన్నీ మనం ఓన్ చేసుకోవాలి. సోషల్ రీ-ఇంజనీరింగ్ తో పదవులు, సీట్ల కేటాయింపులు చేశాం. నామినేటెడ్ పదవుల్లోను, పార్టీ పదవుల్లోను సోషల్ రీ-ఇంజనీరింగ్ చేపడుతున్నాం. కార్యకర్తల సాధికారత గురించి ఆలోచించాలి… కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని టీడీపీ తప్ప ఏ పార్టీ పెట్టలేదు. చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను ఆదుకుంటున్నాం. చనిపోయిన కార్యకర్తలకు రూ.5లక్షల ప్రమాద బీమా ఇస్తున్నాం… పిల్లల చదువుకు ప్రత్యేకంగా స్కూల్ ఏర్పాటు చేశాం. కార్యకర్తల పిల్లలకు నైపుణ్య శిక్షణ ఇచ్చి మంచి ఉద్యోగాలకు సిఫార్సులు చేస్తున్నాం. కార్యకర్తల ఆర్థిక సాధికారత కోసం ఎథికల్ ఎకనమిక్ ఎంపవర్మెంట్ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నాం.
ప్రతి కార్యకర్త ఆరోగ్యంగా ఉండడానికి ఎంతైనా ఖర్చు చేస్తాం. మన కార్యకర్తలను ఆదుకునేందుకు పార్టీ చర్యలు తీసుకుంటుంది. ప్రతీ నాయకుడూ ఇదే విధంగా ఆలోచన చేయాలి. మనకు తెలిసి కానీ తెలియకుండా కానీ తప్పులు జరగకూడదు. అన్ని విధాలా జాగ్రత్తలు తీసుకోవాలి. గత ప్రభుత్వంలో విధ్వంసమైన వ్యవస్థలను గాడిలో పెడుతున్నాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో పోయిన బ్రాండ్ను మళ్లీ తెచ్చాం. పోలవరం ప్రాజెక్టు ఆగిపోతుందని అందరూ భయపడ్డారు. కానీ మళ్లీ ప్రాజెక్టును ట్రాక్లో పెట్టాం. సంక్షేమం అందిస్తున్నాం… అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నాం. ఈ నెల 21న అమరావతిలో 25వేల మందితో యోగా డే నిర్వహిస్తాం. యోగా మన జీవన విధానంలో భాగం కావాలి.” అని చంద్రబాబు స్పష్టం చేశారు.
కూటమి పార్టీల సమన్వయం ముఖ్యం
‘సర్’ ప్రక్రియ పర్యవేక్షణలో కూటమి పార్టీలను కూడా సమన్వయం చేసుకుని వెళ్లాలి. ఎన్నికలప్పుడే మిత్రపక్షాలతో కలుస్తాం… మిగిలిన రోజుల్లో పట్టించుకోం అంటే కుదరదు. ప్రభుత్వంలోనే కాదు అన్ని కార్యక్రమాల్లోనూ జనసేన, బీజేపీలను సమన్వయం చేసుకోవాలి. నా రాజకీయ చరిత్రలో 2024 ఎన్నికల్లో సాధించినటువంటి ఘన విజయం ఎప్పుడూ చూడలేదు. కొత్త వారికి టిక్కెట్లు ఇచ్చినా.. కూటమి పార్టీ అభ్యర్థి అనగానే ప్రజలు, కార్యకర్తలు ఓటేశారు. పార్టీల మధ్య సమన్వయానికి ‘సర్’ మొదటి టెస్ట్. చాలా మంది అనుచరులను కోరుకుంటారు…. కానీ నేను నాయకులను కోరుకుంటాను.
సమర్థవంతమైన నాయకత్వం ఉంటే పార్టీకి బలం పెరుగుతుంది. 2024 ఎన్నికల ముందు పట్టభద్రుల ఎమ్మెల్సీలు గెలిచాం. పూర్తిస్థాయిలో గ్రౌండ్ వర్క్ టెక్నికల్ వర్క్ చేసి అద్భుత విజయాన్ని నాటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూపించాం. గ్రాడ్యుయేట్ల ఎన్నికల్లో ఒకప్పుడు పోటీ చేసేవాళ్లం కాదు. కానీ నాడు ఆ ఎన్నికల్లోనూ పోటీ చేసి గెలిచాం. అదీ మన నెట్వర్క్ గొప్పదనం. ‘సర్’ విషయంలోనూ అదే స్థాయిలో కష్టపడి పని చేయాలి. పార్టీలో వివిధ కీలక అంశాలపై చర్చలు జరగాలి. అందులో కార్యకర్తలు భాగస్వాములు కావాలి. అధికార ఫలితాలను కార్యకర్తలకు అందించాలి. క్షేత్రస్థాయిలో కొన్నిచోట్ల మిత్రపక్షాలు ఉండకపోవచ్చు. అయినా వారిని కూడా కలుపుకుని వెళ్లాలి. 2024 ఎన్నికలకంటే ఎక్కువగా మిత్రపక్షాలతో పనిచేయాలి. మిత్రధర్మాన్ని ప్రతి నేతా, ప్రతి కార్యకర్తా పాటించాల్సిందే. ‘సర్’ పై మూడు పార్టీలతో త్వరలో కో-ఆర్డినేషన్ కమిటీ కూడా వేస్తాం. దీనికి సంబంధించి త్వరలో ఓ ఎన్డీఏ సమావేశం నిర్వహించుకుంటాం.”అని టీడీపీ అధినేత వెల్లడించారు.














