- ఆర్టీసీ ఆస్తుల సద్వినియోగంతో సంస్థ బలోపేతానికి ప్రణాళికలు
- ఐ అండ్ ఐ, ఆర్టీసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
అమరావతి, మే 29:- రాష్ట్రంలోని పోర్టులు, ఎయిర్ పోర్టుల నిర్మాణాలను పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఇన్ఫ్రా ప్రాజెక్టుల పూర్తికి కాలపరిమితిని నిర్దేశించుకుని పని చేయాలని స్పష్టం చేశారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో పెట్టుబడులు, మౌళిక సదుపాయల కల్పన, ఆర్టీసీపై ముఖ్యమంత్రి సమీక్షించారు. పోర్టులు, ఎయిర్ పోర్టులు, ఫిషింగ్ హర్బర్ల నిర్మాణం పురోగతిపై సమావేశంలో చర్చించారు. మూలపేట, రామాయపట్నం, మచిలీపట్నం పోర్టుల నిర్మాణాలపై సీఎం సమీక్షించారు. అలాగే జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాల పురోగతిపై ముఖ్యమంత్రి సమీక్షించారు. దగదర్తి, కుప్పం, శ్రీకాకుళం ఎయిర్ పోర్టుల నిర్మాణం, భూ సేకరణ, నిధుల సమీకరణ, కేంద్రం నుంచి అనుమతులు వంటి అంశాలపై అధికారులకు ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు.
ఈవీ బస్సుల కొనుగోళ్లపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ…”ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి ప్రారంభోత్సవాల తేదీని ప్రకటించేశాం. రాష్ట్రంలో పెట్టే పెద్దపెద్ద పరిశ్రమలను కూడా 18 నెలల్లో గ్రౌండ్ చేసి ఉత్పత్తి మొదలు పెట్టాలని చెబుతున్నాం. ఇదే తరహాలో ఇన్ఫ్రా ప్రాజెక్టులనూ పూర్తి చేయాలి. ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న పోర్టులు, ఎయిర్ పోర్టులు, ఫిషింగ్ హర్బర్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి. అనుమతులు, సాంకేతిక అంశాలు, టెండర్ ప్రక్రియ, నిర్మాణాలన్నింటికీ టైమ్ బౌండ్ పెట్టుకని పని చేయాలి. దశాబ్దాల తరబడి ప్రాజెక్టులను పూర్తి చేయకుండా… జాప్యం చేస్తూ ఉండడం సరైన విధానం కాదు. ఇక ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన నిధుల సమీకరణపైనా ప్రధానంగా ఫోకస్ పెట్టాలి. ఆర్టీసీ ఆస్తులను సద్వినియోగం చేసుకుని.. ఆ సంస్థను మరింత బలోపేతం చేసుకునేలా ప్రణాళికలు సిద్దం చేయాలి.“అని సీఎం చంద్రబాబు సూచించారు. ఈ సమీక్షలో మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి, సీఎస్ సాయి ప్రసాద్, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.















