- సాగునీటి కాలువల పర్యవేక్షణ బాధ్యత రైతులు తీసుకోవాలి
- గత ఐదేళ్లు సాగునీటి రంగాన్ని, వ్యవసాయాన్ని గాలికి వదిలేశారు
- సాగునీటి రంగం కాపాడుకుంటే రైతాంగం బలోపేతమైనట్లే
- పంటకాల్వ పూడికతీత ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం (చైతన్య రథం): వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడం ద్వారా మాత్రమే మానవ మనుగడను కాపాడుకోగలుగుతామని ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నం నియోజకవర్గం చిట్టిపాలెంలో కాలువ పూడికతీత పనులను ప్రారంభించారు. కలెక్టర్ డి.కె.బాలాజీ, డీసీఎంఎస్ ఛైర్మన్ బండి రామకృష్ణతో కలిసి పనులకు భూమిపూజ చేశారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. రైతాంగానికి అవసరమైన సాగునీటి వ్యవస్థలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మంత్రివర్గ ఆమోదంతో ఆపరేషన్ అండ్ మేనేజ్‌మెంట్ కింద కాలువల మరమ్మతులు, నిర్వహణ పనుల కోసం భారీగా నిధులు మంజూరు చేశారు. సాగునీటి కాలువల మరమ్మతులకు రూ.1.75 కోట్లు, డ్రైనేజీల మరమ్మతులకు రూ.1.75 కోట్లు, అరిసేపల్లి కాలువ పనులకు రూ.6 లక్షలు కేటాయించారు. బందరు సెక్షన్ పరిధిలో 17 పనులకు రూ.99.36 లక్షలు, 9వ ఛానల్ పరిధిలో 11 పనులకు రూ.75 లక్షలు, మురుగునీటి కాలువల 32 పనులకు రూ.1.75 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు.
అదేవిధంగా బందరు పరిధిలో మొత్తం రూ.25 కోట్లలో భాగంగా ఇరిగేషన్ పనుల కోసం రూ.5 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. జొన్నలవారి మోడి సైఫన్‌కు రూ.1 కోటి, సాధారణ మరమ్మతులకు రూ.1 కోటి 50 లక్షలు, సముద్రపు నీరు రాకుండా డ్రైనేజ్ అవుట్ ఫాల్ స్లూయిస్ పనులకు రూ.1 కోటి, లంకపల్లి డ్రైన్ తవ్వకానికి రూ.20 లక్షలు, స్ట్రక్చర్ల మరమ్మతులకు రూ.1 కోటి 30 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. ఈ నిధులతో తాళ్లపాలెం డ్రైన్, శివగంగ డ్రైన్, పోతిరెడ్డిపల్లె తదితర ప్రాంతాల్లో అవసరాలను గుర్తించి అంచనాలు సిద్ధం చేసి పనులు ప్రారంభించినట్లు తెలిపారు. ఎండాకాలంలోనే కాలువల పనులను పూర్తి చేసి, సాగునీరు విడుదల చేసే సమయానికి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంచేలా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తోందన్నారు. గత ఐదు సంవత్సరాలు రాష్ట్రంలో సాగునీటి సంఘాలే లేవు. సాగునీటి ప్రాజెక్టు పనులు చేపట్టలేదు. కానీ బిల్లులు చేసుకుని జేబులు నింపుకున్నారు. కానీ నేడు వర్షాలు రావడానికి ముందే సాగునీటి కాలువలు శుభ్రం చేసే పనులు చేపట్టాం. ప్రభుత్వం చేపట్టే పనుల్ని క్షేత్రస్థాయిలో రైతులు, ప్రజలు పర్యవేక్షించాలి. ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది కలిగినా, పనులు సరిగా జరగడం లేదని అనిపించినా రైతులు అధికారుల దృష్టికి తీసుకెళ్లి మెరుగ్గా చేయించుకోవాలి అని సూచించారు.
గత ప్రభుత్వ హయాంలో ధాన్యం డబ్బుల కోసం రైతులు నెలల తరబడి ఎదురుచూడాల్సి వచ్చేదని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో పంట కోత అనంతరం 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో ధాన్యం చెల్లింపులు జమ అవుతున్నాయన్నారు. పనుల నాణ్యత పర్యవేక్షణ కోసం రైతులు నీటి సంఘాలను ఏర్పాటు చేసుకుని ప్రభుత్వ పనుల్లో భాగస్వాములు కావాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. యూరియా అధిక వినియోగం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, దాని వాడకాన్ని తగ్గించాలని సూచించారు. రైతులకు అవసరమైన యూరియా, విత్తనాలు వ్యవసాయ, ఇరిగేషన్ శాఖల ద్వారా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచుతామని హామీ ఇచ్చారు. వైసీపీ నేతలు అధికారంలో ఉన్నపుడు రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకున్నారు.
రాజధాని అమరావతిపై విషం చిమ్మి మూడు రాజధానులంటూ డ్రామాలాడారు. ఇప్పుడు మావిగన్ అంటూ విచిత్ర ప్రతిపాదనలు తెచ్చి అబాసుపాలయ్యారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో.. అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చాం. రాయలసీమకు గతంలో కియా తీసుకొచ్చాం. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్ తీసుకొస్తున్నాం. డ్రోన్ ట్రైనింగ్ సెంటర్, డిఫెన్స్ యుద్ధ విమానాల తయారీ యూనిట్, రాయల్ ఎన్ ఫీల్డ్ వాహనాల తయారీ లాంటి అనేక కంపెనీలొచ్చాయి. ఉత్తరాంధ్రలో అర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్, భోగాపురం విమానాశ్రయం, షిప్ యార్డు, గూగుల్ లాంటి ప్రపంచ దిగ్గజ సంస్థలు వస్తున్నాయి. మచిలీపట్నం పోర్టును త్వరలోనే పూర్తి చేయబోతున్నాం. ఈ ప్రాంతంలో అనేక సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నాయి. రేపల్లె-మచిలీపట్నం రైల్వే ప్రాజెక్టు పూర్తి చేయబోతున్నాం. తద్వారా పోర్టు కనెక్టివిటీ పెంచాలని ప్రతిపాదించాం. తెలంగాణ ప్రభుత్వం కూడా బందరు పోర్టును అనుసంధానిస్తూ 12 వరుసల రోడ్డు కావాలని అడుగుతున్నారు. విజయవాడ-మచిలీపట్నం రోడ్డు కూడా మనమే పూర్తి చేశాం. దాన్ని విస్తరించేందుకు సన్నాహలు జరుగుతున్నాయి. 216 రోడ్డును కూడా నాలుగు వరుసలుగా అభివృద్ధి చేస్తున్నాం. అమరావతి పనులు పూర్తవుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం చేశామని వివరించారు.
అనంతరం జీలుగ, జనుము, పిల్లిపెసర విత్తనాలను సబ్సిడీతో రైతులకు అందించారు. దిగుబడులు పెంచడానికి యూరియా లాంటి కెమికల్స్ వినియోగం తగ్గించాలని సూచించారు. గతంలో పంజాబ్‌లో పంట దిగుబడుల కోసం రసాయనాల వినియోగం పెంచారు. ఇప్పుడు ప్రతి రోజు ఒక రైలు కేన్సర్ బాధితుల కోసం ఢిల్లీకి వెళ్తోంది. అలాంటి పరిస్థితులు ఎక్కడా రాకుండా చూసుకోవల్సిన బాధ్యత రైతులపైనే ఉంది. దిగుబడుల కోసం ఏం వాడాలి, ఎంత మోతాదులో వాడాలో వ్యవసాయ అధికారుల్ని అడిగి తెలుసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ బండి రామకృష్ణ, మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచె దుర్గాప్రసాద్ (నాని), మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపు సత్యనారాయణ, ఇరిగేషన్ శాఖ అధికారులు, కూటమి నాయకులు లంకె శేషగిరిరావు, మధు, కాగిత గోపాలరావు తదితర నాయకులు, రైతులు పాల్గొన్నారు.
















