విశాఖపట్నం (చైతన్య రథం): ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరబోతోంది. విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం జూలైనుంచే అందుబాటులోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని విమానయాన సంస్థలు జూలై 8 నుంచి తమ విమానాలను భోగాపురంనుంచే నడుపుతామని ప్రకటించాయి. ప్రముఖ సింగపూర్ ఎయిర్లైన్స్ అనుబంధ సంస్థ స్కూట్ తన వెబ్సైట్లో ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేసింది. పాత విశాఖ విమానాశ్రయంనుంచి కాకుండా, 50 కిలోమీటర్ల దూరంలోని కొత్త విమానాశ్రయంనుంచే సర్వీసులు నడుస్తాయని స్పష్టం చేసింది. దీన్నిబట్టి జూలై మొదటి వారానికే కమర్షియల్ ఆపరేషన్స్ మొదలవడం నిశ్చయంగా కనిపిస్తోంది.
భోగాపురం ఎయిర్పోర్ట్-కీలక విశేషాలు
జూన్ నెలాఖరుకల్లా పనులు పూర్తి చేస్తామని ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ధృవీకరించారు. ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ కోరిన రాష్ట్ర ప్రభుత్వం -జూలై 5, 8 తేదీలు, ఆగస్టు 17 లేదా 19 తేదీలను ప్రతిపాదించింది. జూలై 5న మోదీ చేతుల మీదుగా ప్రారంభమవుతుందని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
నిర్మాణ వివరాలు:
విస్తీర్ణం: 2,203 ఎకరాలు. అంచనా వ్యయం: రూ.4,592
కోట్లు. నిర్మాణ సంస్థ: జీఎంఆర్ గ్రూప్.
సామర్థ్యం:
మొదటి దశ: ఏడాదికి 60 లక్షలమంది ప్రయాణికులు.
భవిష్యత్తు లక్ష్యం: ఏడాదికి 4 కోట్లమంది ప్రయాణికులు
ప్రత్యేకతలు: ప్రపంచంలోనే అతిపెద్ద విమానాలు ఎయిర్ బస్ ఏ380 దిగగలిగే 3.8 కి.మీ. రన్వే. అంతర్జాతీయస్థాయి కార్గో టెర్మినల్. విమానాల మరమ్మతుల సదుపాయాలు. జాతీయ రహదారికి అనుసంధానంగా భారీ ట్రంపెట్ జంక్షన్
ప్రభావం: భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వస్తే విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు మహర్దశ పట్టినట్లే. ఐటీ, పారిశ్రామిక, పర్యాటక రంగాలు జెట్ వేగంతో దూసుకుపోవడం తథ్యంగా కనిపిస్తోంది.












