- మ్యాజిక్ డ్రెయిన్స్ తో పల్లెలో పారిశుధ్య విప్లవం
- గ్రామాల్లో మురుగునీటి సమస్యకు పరిష్కార మార్గం
- సిమెంటు డ్రెయిన్లతో పోలిస్తే 80 శాతం ఆదా
- ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణ పి.వి.సింధు
- ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు
అమరావతి(చైతన్యరథం): పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన గ్రామీణాంధ్రప్రదేశ్ లక్ష్య సాధన కోసం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ విప్లవాత్మక ఆలోచనలను అమలు చేస్తున్నారని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలంపిక్ మెడలిస్ట్ పి.వి.సింధు ప్రశం సించారు. పవన్ కళ్యాణ్ ఆలోచనల నుంచి పురుడు పోసుకున్న మ్యాజిక్ డ్రెయిన్స్ పల్లెల్లో మురుగు సమస్య నివారణలో గేమ్ ఛేంజర్ లాంటిదన్నారు. ఉప ముఖ్యమంత్రి 20 నెలల పాలన గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ విడుదల చేసిన వీడియో సందేశంలో మ్యాజిక్ డ్రెయిన్స్ లాంటి సరికొత్త విధానాలు అమలు చేయడంపై ఆనందం వ్యక్తం చేశారు. “పాలనా వ్యవహారాలు కొత్తే అయినా వినూత్న కార్యక్రమాలతో ప్రజా సమస్యలకు పరిష్కార మార్గాలు అన్వేషిస్తున్నారు. మన దేశంలో మెజారిటీ శాతం ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తుంటారు. అయితే గ్రామాల్లో పారిశుధ్యం పెద్ద సవాలుగా ఉంటుంది.
సరైన మురుగు నీటి పారుదల వ్యవస్థ లేక ప్రజలు అపరిశుభ్ర వాతావరణంలో జీవనం సాగిస్తూ ఉంటారు. ఈ సమస్యకు పవన్ కళ్యాణ్ మ్యాజిక్ డ్రెయిన్స్ రూపంలో అద్భుత పరిష్కార మార్గాన్ని కనుగొన్నారు. ఇంకుడు గుంతలతో కూడిన డ్రెయిన్లు ఇళ్ల నుంచి వచ్చే మురుగు నీటిని క్షణాల్లో మాయం చేస్తాయి. మూడంచెల ఫిల్టర్ బెడ్ల ద్వారా శుద్ధి చేయబడిన నీటిని భూగర్భజలంగా మార్చేస్తాయి. మురుగు నీటి నిల్వ, దుర్వాసన తదితర సమస్యలకు మ్యాజిక్ డ్రెయిన్లు చక్కటి పరిష్కార మార్గమని పేర్కొన్నారు. సాధారణ సిమెంట్ డ్రెయిన్ల నిర్మాణంతో పోలిస్తే మ్యాజిక్ డ్రెయిన్లకు 80 శాతం నిర్మాణ వ్యయం కూడా ఆదా అవుతుంది. గ్రామీణ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు పారిశుధ్యాన్ని ఈ మ్యాజిక్ డ్రెయిన్లు పెంపొందిస్తాయి. ప్రజలు ఆరోగ్యకరమైన జీవనాన్ని సాగించే వెసులుబాటు కల్పిస్తాయన్నారు. ఇలాంటి ముందు చూపుతో కూడిన వినూత్న కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని, ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో, పవన కళ్యాణ్ దార్శనికత్వంలో గ్రామీణాంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

















