చంద్రబాబునాయుడు 1995లో తొలిసారి ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తీవ్ర విద్యుత్ సంక్షోభంలో చిక్కుకుని ఉంది. విద్యుత్ వ్యవస్థ పనితీరు అస్తవ్యస్తంగా మారింది. కరెంట్ ఎప్పుడు పోతుందో, ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. నిత్యం విద్యుత్ కోతలతో ప్రజలు, చదువుకునే విద్యార్థులు, మోటార్లు కాలిపోయి పంటలు ఎండిపోయి రైతులు, వ్యాపారులు, పరిశ్రమలు మూతపడి పారిశ్రామికవేత్తలు అవస్థలు పడేవారు. విద్యుత్ సంక్షోభం ఏర్పడి రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకిగా మారింది. తీవ్ర విద్యుత్ కొరతను అర్థం చేసుకున్న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అత్యంత సాహసోపేతమైన దూరదృష్టితో కూడిన విద్యుత్ సంస్కరణలకు శ్రీకారం చుట్టి అమలు చేశారు. ఆయన తెచ్చిన విద్యుత్ సంస్కరణలు భారతీయ విద్యుత్ రంగ చరిత్రలో ఒక కీలక మలుపు. విద్యుత్ కొరతను అధిగమించడానికి ఆయన బహుముఖ వ్యూహాన్ని అనుసరించి తాత్కాలిక ఉపశమన చర్యలతో పరిమితం కాకుండా దీర్ఘకాలిక సంస్కరణలతో విద్యుత్ రంగానికి కొత్త దిశను చూపించారు. విద్యుత్ ఉత్పత్తి పెంచేందుకు రాష్ట్ర విద్యుత్ బోర్డును ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్‌కో, డిస్కం… మూడు వ్యవస్థలుగా విభజించి బాధ్యత పెంచారు. విద్యుత్ బోర్డు విభజన ద్వారా జవాబుదారీ పెంచడమే కాకుండా నిర్వహణ లోపాలను తగ్గించారు. ఈ చర్యల ద్వారా రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి, సగటు వినియోగం గణనీయంగా పెరిగింది. విద్యుత్ కొరతతో ఇబ్బందులుపడుతున్న రాష్ట్రం క్రమంగా సరిపడా విద్యుత్ అందించగల స్థాయికి చేరుకుంది. పరిశ్రమల విస్తరణకు, ఐటీ రంగ అభివృద్ధికి, వ్యవసాయానికి అవసరమైన విద్యుత్ సరఫరా మెరుగుపడింది.
మిగులు విద్యుత్ దిశగా ఏపీ ముందడుగు
విద్యుత్ డిమాండ్‌ను తట్టుకోవడానికి, ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి చంద్రబాబు ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం ( పీపీపీ) ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించారు. థర్మల్-హైడల్ ప్రాజెక్టులు కొత్త ప్లాంట్ల ఏర్పాటుతో పాటు ఉన్న ప్లాంట్ల సామర్థ్యాన్ని పెంచడం ద్వారా మిగులు విద్యుత్ దిశగా అడుగులు పడ్డాయి. సౌర, పవన విద్యుత్ పునరుత్పాదక ఇంధన వనరుల ప్రాముఖ్యతను అప్పుడే గుర్తించి వాటికి పునాదులు వేశారు. ప్రభుత్వరంగ ప్లాంట్ల బలోపేతం విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్, రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్, ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ ను గణనీయంగా పెంచి, దేశంలోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచేలా చేశారు. కాకినాడ వద్ద ‘స్పెక్ట్రమ’-‘జీవీకే’ వంటి ప్రాజెక్టులు ఆయన హయాంలోనే పట్టాలెక్కాయి. జల విద్యుత్ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ పవర్‌హౌస్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల ద్వారా పీక్ డిమాండ్ సమయంలో తక్కువ ఖర్చుతో విద్యుత్ అందించే ప్రయత్నం చేశారు. విద్యుత్ సరఫరాలో జరిగే లైన్‌లాస్‌లను తగ్గించడానికి అధునాతన సాంకేతికత ఉపయోగించారు. వంద శాతం మీటరింగ్ విధానాన్ని ప్రవేశపెట్టి విద్యుత్ చౌర్యాన్ని అరికట్టారు. దూరదృష్టితో విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చి లక్షలాది ట్రాన్స్‌ఫార్మర్లు, వేలాది సబ్ స్టేషన్లు నిర్మాణం చేశారు. బలహీనంగా వున్న విద్యుత్ లైన్లను బలోపేతం చేశారు. దానివల్ల లైన్‌లాస్ తగ్గించి ఉత్పత్తి పెంచి విద్యుత్ కోతలను నివారించారు. గృహ అవసరాలకు, వ్యవసాయానికి, పరిశ్రమలకు సరిపడినంత విద్యుత్ అందజేయడంతో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి. సంస్కరణల పట్ల తీవ్ర వ్యతిరేకత ఏర్పడి రాజకీయ పోరాటాలు జరిగి రాజకీయంగా ఆయనకీ నష్టం జరిగి ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చినా ఆయన రాష్ట్రాభివృద్ధి కోసం వెనుకాడలేదు. ఆయన సంస్కరణలు ఆంధ్రప్రదేశ్‌ను ఐటీ, పారిశ్రామిక రంగాల్లో అగ్రగామిగా నిలబెట్టాయి. నిరంతర విద్యుత్ సరఫరాతో పరిశ్రమలు రాష్ట్రానికి రావడం ప్రారంభించాయి. విద్యుత్ సంస్కరణలు కేవలం ఒక్క విద్యుత్ శాఖలో మార్పులు మాత్రమే కాదు అవి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చెయ్యడానికి ఉపయోగపడ్డాయి. క్రిసిల్-ఇక్రాల గుర్తింపు ద్వారా ఏపీ ట్రాన్స్ కోను దేశంలోనే అత్యుత్తమ ఎలక్ట్రిసిటీ బోర్డుగా నిలిపారు చంద్రబాబు.
సీబీఎన్ హయాంలోనే అత్యధిక విద్యుదుత్పత్తి
స్వాతంత్య్రం వచ్చిన 79 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్‌ని పరిపాలించిన 19 ముఖ్యమంత్రులు 30,112 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు. అందులో చంద్రబాబునాయుడు ఒక్కరే 22వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చెయ్యడం రాష్ట్రాభివృద్ధి పట్ల ఆయన అంకితభావానికి నిదర్శనం. ఉమ్మడి రాష్ట్రంలో విజయవాడ ధర్మల్ ప్రాజెక్టు 9సార్లు, రాయలసీమ ధర్మల్ ప్రాజెక్టు 5సార్లు, కొత్తగూడెం ధర్మల్ ప్రాజెక్ట్ 4సార్లు బంగారు పతకాలు సాధించే స్థాయికి చేర్చారు. వాటిని ఉమ్మడి రాష్ట్రంలో సబ్ స్టేషన్ల సంఖ్యను 1,539 నుంచి 2,390కి పెంచి నాణ్యమైన విద్యుత్ అందించారు. మానవాళి మనుగడకు, రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి గాలి, నీరు తర్వాత అత్యంత అవసరమైన అంశంగా గుర్తించారు. ఉమ్మడి రాష్ట్రంలో 19 లక్షల విద్యుత్ కనెక్షన్లను క్రమబద్ధీకరించి 66.90 లక్షల కొత్త కనెక్షన్లతో మొత్తం 1.51 కోట్ల వినియోగదారులతో దేశంలోనే ఆగ్రగామిగా నిలిపారు. వ్యవసాయ రంగానికి 37.04 శాతం విద్యుత్తును అందించారు. సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి రంగంలో కేంద్రంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుని అతి తక్కువ సమయంలో 22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటును అధిగమించి 24 గంటలు నిరంతర విద్యుత్ అందించిన తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నవ్యాంధ్రలో ఐదేళ్లు పేద, మధ్య తరగతి వారిపై భారం మోపకూడదని విద్యుత్ చార్జీలు పెంచకుండా పేదల పక్షపాతిగా నిలిచారు. దేశంలో ఐదేళ్లలో 2014-19 మధ్య 14,655 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను నెలకొల్పారు. 2014-19 మధ్య రాష్ట్రంలో 7వేల మెగావాట్ల సామర్ధ్యంతో సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులు స్థాపించి 13 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారు. జగన్ తన బినామీ కంపెనీలకు లబ్ధి చేకూర్చేందుకు పీపీఏ ఒప్పందాలు రద్దు చేసి యూనిట్ విద్యుత్ ధర గరిష్ఠంగా రూ.15కు కొనుగోలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత గత ఏడాది యూనిట్ విద్యుత్ ధర రూ.5.20కు కొనుగోలు చేయగా.. ఇప్పుడు రూ.4.90కు కొనుగోలు చేస్తోంది. మరో 30పైసలు తగ్గించడానికి సానుకూలంగా ఉంది. 2029 నాటికి యూనిట్ విద్యుత్
రూ.1.19కే కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
సౌర, పవన విద్యుత్ రంగంలో రూ.36వేల కోట్ల పెట్టుబడులు తెచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో 160 మెగావాట్ల వాయుశక్తి ఆధారిత హైబ్రిడ్ విద్యుత్ ఉత్పత్తికి కృషి చేశారు. నవ్యాంధ్రలో దేశంలో అత్యధికంగా 2014-19 మధ్య 36 లక్షల మోటార్లకు కొత్త కనెక్షన్లు ఇచ్చారు చంద్రబాబు.
రెన్యువబుల్ ఎనర్జీ హబ్‌గా ఆంధ్రప్రదేశ్
కేవలం సంప్రదాయ విద్యుత్ ఉత్పత్తి మాత్రమే కాకుండా పర్యావరణహితమైన విద్యుత్‌వైపు మొగ్గుచూపడం ఆయన దూరదృష్టికి నిదర్శనం. ఏపీని సోలార్ హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పార్కు నెలకొల్పారు. ఆసియాలోనే అతి పెద్దదైన కర్నూలు అల్ట్రా మెగా సోలార్ పార్కు, వెయ్యి మెగావాట్ల పవర్ ప్లాంట్ స్థాపించారు. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఉన్న గాలి మళ్లింపు సామర్థ్యాన్ని గుర్తించి పెద్ద ఎత్తున విండ్ మిల్స్ ఏర్పాటును ప్రోత్సహించారు. పునరుత్పాదక ఇంధన విప్లవం, పారిశ్రామిక రంగానికి చౌక ధరకే విద్యుత్తును అందించడమే లక్ష్యంగా అపారమైన సూర్యరశ్మి, తీర ప్రాంత గాలిని సంపదగా మార్చేందుకు గ్రీన్ ఎనర్జీ పాలసీ`2024కు శ్రీకారం చుట్టారు. కేవలం విద్యుత్ భారాన్ని తగ్గించడమే కాకుండా లక్షలాది మంది యువతకు ఉపాధి కల్పించేందుకు ఐదు ప్రధాన విభాగాలపై ప్రత్యేక దృష్టి సారించారు. గ్రీన్ ఎనర్జీ-సోలార్ విండ్-గ్రీన్ హైడ్రోజన్-గ్రీన్ అమ్మోనియా-పంప్డ్ స్టోరేజీ రంగాల్లో రూ.3లక్షల కోట్ల భారీ పెట్టుబడులు తీసుకొచ్చారు సీబీఎన్. ఆయన లక్ష్యం ప్రకారం ఆంధ్రప్రదేశ్ కేవలం విద్యుత్ వినియోగదారుగానే కాకుండా దేశానికే ఇంధనాన్ని సరఫరా చేసే పవర్ హౌస్‌గా మారబోతోంది. పర్యావరణ పరిరక్షణతో పాటు ఆర్థికాభివృద్ధిని సమతుల్యం చేస్తూ చేపట్టిన ప్రణాళిక రాష్ట్ర రూపురేఖలను మార్చడమే కాకుండా గ్రీన్ ఎనర్జీ రంగంలో ఏపీని ప్రపంచ పటంలో నిలుపుతుంది. సోలార్, విండ్ ఎనర్జీతో పాటు భవిష్యత్తు ఇంధనంగా పిలవబడే గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో ఏపీని దేశంలోనే అగ్రగామిగా నిలపడం కోసం కృషి చేస్తున్నారు.
దీనివల్ల సామాన్య ప్రజలు, పరిశ్రమలపై విద్యుత్ చార్జీల భారం తగ్గుతుంది. సంస్కరణలు అమలు చేసి చరిత్రలో తొలిసారి ట్రూ డౌన్ అమలు చేసి ప్రజలపై కరెంట్ బిల్లులు భారం తగ్గించారు. ప్రజలపై పడిన రూ.20,288 కోట్ల ట్రూఅప్ భారాన్ని ప్రభుత్వమే భరించి 1.30కోట్ల గృహ విద్యుత్ వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చారు. వాణిజ్య కేటగిరీ వినియోగదారులకు యూనిట్ విద్యుత్ ధరను రూ.12.25 నుంచి రూ.9.95కు తగ్గించి వ్యాపారస్తులకు అండగా నిలిచారు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.1,200 కోట్లతో ఉచితంగా 2కేవీ రూఫ్ టాప్ సోలార్లు ఏర్పాటుచేసి పేదల పక్షపాతిగా నిలిచారు. ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ రూ.1.50కే అందించి అండగా నిలిచారు. చంద్రబాబు తెచ్చిన విద్యుత్ సంస్కరణల విప్లవంతో రాష్ట్రంలో విద్యుదుత్పత్తి పెరిగి సరఫరా స్థిరపడింది. పరిశ్రమలకు నమ్మకమైన విద్యుత్ అందుబాటులోకి రావడంతో పెట్టుబడులు పెరిగాయి. వ్యవసాయం, సేవా రంగాలు కూడా లాభపడ్డాయి. మొత్తంగా విద్యుత్ రంగం సంక్షోభం నుంచి బయటపడటమే కాకుండా అభివృద్ధికి పునాది పడింది. విద్యుత్ సంక్షోభాన్ని అవకాశంగా మలిచి వ్యవస్థను పునర్నిర్మించిన నాయకుడిగా చంద్రబాబు నిలిచారు.
తొండపు దశరధ జనార్దన్
టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు
















