- ఈస్ట్-వెస్ట్ రైల్ ఫ్రైట్ కారిడార్ ఏర్పాటు చేయండి
- రైల్వే ప్రాజెక్టులపై సమీక్షలో సీఎం చంద్రబాబు
- పోర్టుల కనెక్టివిటీకి ప్రథమ ప్రాధాన్యత
- వెల్లడించిన రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్
- దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ను సందర్శించిన సీఎం, రైల్వే మంత్రి
విశాఖపట్నం (చైతన్య రథం): ఆంధ్రప్రదేశ్‌నుంచి వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా ఉత్పత్తులను రవాణా చేసేందుకు ప్రత్యేక కంటైనర్ రీఫర్ రైళ్లు అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైల్వే శాఖను కోరారు. ఏపీని లాజిస్టిక్స్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు అవసరమైన రైలు కనెక్టివిటీని పెంచాలని విజ్ఞప్తి చేశారు. విశాఖలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయాన్ని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో కలిసి సందర్శించారు. అనంతరం రైల్వే మంత్రితో కలిసి దక్షిణ మధ్య, తూర్పు, దక్షిణ కోస్తా రైల్వే జోన్ల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కొత్త రైల్వే జోన్ కార్యకలాపాలు, ఏపీలో రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి, రైల్వే మంత్రితో కలిసి చర్చించారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధి, కార్యకలాపాలు సహా, ఏపీలోని రైల్వే ప్రాజెక్టులపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. 2026 జూన్ 1నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభించేలా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడం శుభ పరిణామమన్నారు.
కొత్తగా ఏర్పాటవుతున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో మరికొన్ని రైల్వే సెక్షన్లు విలీనం చేస్తూ కొన్ని పాలనాపరమైన మార్పులు చేపట్టాలని సీఎం కోరారు. ఏపీ రాష్ట్ర పరిధిలోకి వచ్చే అరకు -కొత్తవలస సెక్షన్, కర్నూలు -డోన్‌లను కొత్త జోన్‌లో కలపడం ద్వారా ఆయా ప్రాంతాల అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుందని వివరించారు. రైల్ రూట్ డెన్సిటీలేని కారణంగా ఏపీలో లాజిస్టిక్స్ రంగాన్ని అభివృద్ధి చేసేలా నిర్దేశించుకున్న లక్ష్యాలకు ఇబ్బంది కలుగుతున్నట్టు వివరించారు. రాయలసీమలోని వివిధ ప్రాంతాలను అనుసంధానిస్తూ నూతన రైల్వే మార్గాలను వేయాలని కోరారు. రాష్ట్రంలోని ప్రస్తుతం ఉన్న పోర్టులు సహా కొత్తగా నిర్మిస్తున్న మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులకు కనెక్టివిటినీ పెంచాలని విజ్ఞప్తి చేశారు. చత్తీస్‌ఘడ్, ఒడిశా, తెలంగాణ, మహారాష్ట్రలోని నాగ్‌పూర్, మధ్యప్రదేశ్‌లోని ఇటార్సీ, కర్ణాటకలోని బళ్లారి, బెంగుళూరు తదితర ప్రాంతాలనుంచి ఈ పోర్టులకు కార్గో రవాణా చేసేలా హింటర్ ల్యాండ్‌ను రైల్వే ద్వారా అనుసంధానించాలని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను సీఎం చంద్రబాబు కోరారు.
ఓడరేవుల అనుసంధానం: రైల్వే మంత్రి
ఏపీలోని పోర్టులను అనుసంధానించే అంశానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టుల్లో జరుగుతున్న పనులు, ప్రతిపాదిత నూతన మార్గాలు, పనులగురించి ముఖ్యమంత్రికి ఆయన స్వయంగా వివరించారు. ఈ సమీక్షకు మంత్రి డీబీవీ స్వామి, ఎంపీ భరత్, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, గణబాబు, విష్ణు కుమార్‌రాజు, రైల్వే శాఖ ఉన్నతాధికారులు, ఏపీ రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటి కృష్ణబాబు తదితరులు హాజరయ్యారు.
















