- హైరైజ్, ఐకానిక్ నిర్మాణాలపై ప్రత్యేక ప్రణాళిక
- సీఎం చంద్రబాబు అధ్యక్షతన 60వ సీఆర్డీఏ సమావేశం
- ముఖ్యమంత్రితో సమావేశమైన బిట్స్ పిలానీ ప్రతినిధులు
- 2027 విద్యా సంవత్సరంనుంచి బిట్స్ పిలానీ అడ్మిషన్లు
అమరావతి (చైతన్య రథం): రాష్ట్రానికి ఆదాయాన్ని ఆర్జించే రెవెన్యూ ఎర్నింగ్ సిటీగా అమరావతిని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాజధానిలో చేపట్టే నిర్మాణాలు ఐకానిక్‌గా ఉండటంతోపాటు తెలుగుదనం ఉట్టిపడేలా.. సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఉండాలని సూచనలు చేశారు. సచివాలయంలో గురువారం ముఖ్యమంత్రి అధ్యక్షతన 60వ సీఆర్డీఏ సమావేశం జరిగింది. రాజధాని నిర్మాణంలో భాగంగా చేసిన వివిధ ప్రతిపాదనలకు సీఆర్డీఏ ఆమోదించింది. అమరావతిని హరిత, నీలి నగరంగా, లివబుల్ సిటీగా నిర్మిస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. బిట్స్ పిలానీలాంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల క్యాంపస్‌లతో అమరావతి నగరం ఓ కీలకమైన విద్యా కేంద్రంగా నిలుస్తుందని సీఎం వ్యాఖ్యానించారు.
రాజధాని ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనను వేగవంతం చేయాలని.. నగరాన్ని విజయవాడతో అనుసంధానించేందుకు కృష్ణా నదిపై నిర్మించే బ్రిడ్జిని ఐకానిక్‌గా నిర్మించాలన్నారు. ఏపీ గవర్నమెంటు కాంప్లెక్స్ నిర్మాణంలో భాగంగా చేపట్టే అసెంబ్లీలాంటి భవనాలను సందర్శించే వారికి అద్భుతమైన అనుభూతి కలిగేలా నిర్మాణాలు చేపట్టాలన్నారు. రాజధాని ప్రాంతంలో చేపట్టే ప్రతీ ప్రభుత్వ కార్యాలయం పూర్తిగా సద్వినియోగం కావటంతోపాటు వినూత్న డిజైన్లు ఉండాలని సూచించారు. రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణ ప్రక్రియపై కార్యాచరణ మొదలు పెట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు.
ఆర్ధిక కార్యకలాపాల కేంద్రంగా రాజధాని
ఆంధ్రప్రదేశ్‌కు ఓ గ్రోత్ ఇంజన్‌గా అమరావతి ఉండాలని ముఖ్యమంత్రి సూచనలు చేశారు. రాజధాని ప్రాంతంలో వివిధ రంగాల్లో పెట్టుబడులతోపాటు ఆర్ధిక కార్యకలాపాల కేంద్రంగా మారాలన్నారు. రాజధానిలో నిర్మించే ఎత్తైన, ఐకానిక్ భవనాల నిర్మాణానికి సంబంధించి ప్రత్యేక ప్రణాళిక ఉండాలన్నారు. నవ నగరాలతోపాటు నగర విస్తరణకు సంబంధించి భవిష్యత్ ప్రణాళికలు కూడా ఉండాలన్నారు. బ్యాంకులు, ఆర్ధిక సంస్థలకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోనే స్థలాలు కేటాయించాలన్నారు. నీరు, విద్యుత్ సరఫరాలాగే డిస్ట్రిక్ట్ కూలింగ్ వ్యవస్థ ద్వారా భవనాలకు చల్లదనం అందేందుకు అవసరమైన ప్రణాళికలు చేయాలన్నారు. నీరు, విద్యుత్, గ్యాస్ అవసరాలన్నీ ప్రజలకు డక్ట్‌ల ద్వారా సరఫరా జరిగేలా చూడాలన్నారు.
60వ సీఆర్డీఏ భేటీలో వివిధ అంశాలకు ఆమోదం
అమరావతి క్వాంటం వ్యాలీలో ట్విన్ టవర్ల నిర్మాణానికి రూ.1208.41 కోట్లు వెచ్చించేందుకు పాలనానుమతి ఇచ్చేందుకు సీఆర్డీఏ ఆమోదం తెలిపింది. అమరావతి సచివాలయ, జీఏడీ, హెచఓడీ టవర్ల నిర్మాణంలో ఫాసేడ్, గ్లేజింగ్, క్లాడింగ్ పనులు చేపట్టేందుకు రూ.2540 కోట్ల వెచ్చించేందుకు అథారిటీ ఆమోదించింది. ఏపీ శాసనసభ భవనంలో వివిధ సివిల్ స్ట్రక్చర్ పనులకుగాను రూ.798 కోట్లను వెచ్చించేందుకు ఆమోదించారు. ఎల్పీఎస్ జోన్ 11లో రోడ్లు, డ్రైన్లు, నీటి సరఫరా, మురుగునీటి పారుదలలాంటి మౌలిక సదుపాయాల కల్పనకు ఆమోద ముద్ర వేసింది. రాజధానిలో 220 కేవీ లైన్స్ రీరూటింగ్ చేసేందుకూ అనుమతి మంజూరు చేసింది. 2వ దశ ఎల్పీఎస్ గ్రామాల్లో రైతులకు యాన్యుటీ, పెన్షన్ మంజూరు కోసం నిబంధనల్లో మార్పు చేసేందుకు అథారిటీ ఆమోదాన్ని తెలియచేసింది. మెట్ట భూములకు ఎకరాకు రూ.40 వేల చొప్పున, జరీబుకు రూ.60 వేలకు కౌలును పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
అలాగే ప్రతీ ఏటా మెట్ట భూములకు రూ.3 వేల చొప్పున, జరీబు భూములకు రూ.5 వేల చొప్పున పదేళ్లపాటు పెంపునకు ఆమోదం తెలిపింది. రాజధానిలో వివిధ సంస్థలకు భూములను కేటాయిస్తూ మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫార్సులకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలియచేసింది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ సెబీకి అమరావతి ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్‌లో 1.78 ఎకరాల భూమిని కేటాయించేందుకు అంగీకారం తెలిపింది. స్వామి నారాయణ్ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్‌కు ఏర్పాటుకు వేర్వేరుచోట్ల 4.23 ఎకరాల భూమి కేటాయించేందుకు ఆమోదం తెలిపింది. అత్యవసర సేవల విభాగం అగ్నిమాపక శాఖకు రాయపూడి వద్ద 2 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. డీఏవీ పాఠశాలకు నెక్కల్లువద్ద 3 ఎకరాలు, ఆప్కాబ్‌కు రాయపూడివద్ద 0.49 ఎకరాలను కేటాయించేందుకు ఆమోదం తెలిపింది.
ఏఐ క్యాంపస్‌గా బిట్స్ పిలాని
అంతకుముందు బిట్స్ పిలాని సంస్థ ప్రతినిధులు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు. రాజధాని ప్రాతంలో నిర్మిస్తున్న బిట్స్ పిలాని క్యాంపస్ పనుల పురోగతిపై ముఖ్యమంత్రికి వివరించారు. రాజధానిలో నిర్మిస్తున్న క్యాంపస్‌లో క్వాంటం, ఏఐ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రతినిధులు తెలిపారు. 2027నుంచి అడ్మిషన్లు ప్రారంభిస్తామని ముఖ్యమంత్రికి తెలియచేశారు. రాజధాని ప్రాంతంలోని క్యాంపస్ సహా సంస్థ విస్తరణకు రూ.250 కోట్లమేర వెచ్చించనున్నట్టు వెల్లడించారు. మూడు దశల్లో బిట్స్ పిలాని అమరావతి క్యాంపస్ నిర్మిస్తున్నామని.. మొత్తం 10 వేలమంది విద్యార్ధులు విద్యను అభ్యసించేలా క్యాంపస్ నిర్మాణం జరుగుతుందన్నారు. దీనిపై స్పందించిన సీఎం క్వాంటం టెక్నాలజీ రంగంలో స్టార్టప్‌లను ప్రోత్సహించేలా క్యాంపస్‌లో ప్రణాళికలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. సమావేశంలో పురపాలక, సీఆర్డీఏ, ఆర్ధిక, అటవీ, ఏజీసీఐఎల్ అధికారులు హాజరయ్యారు.
.















