- లక్షలాది పేదల కడుపునింపే మహోన్నత కార్యక్రమం
- రూ.5లకే పరిశుభ్ర వాతావరణంలో గౌరవ భోజనం
- ప్రభుత్వానికి ముఖ్యమంత్రి సతీమణి భువనేశ్వరి ప్రశంస
- చంద్రబాబు జన్మదినం సందర్భంగా భారీ విరాళం
- అన్న క్యాంటీన్లకు రూ.76 లక్షల ఇచ్చిన భువనేశ్వరి
- నేడు రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లలో ఉచిత భోజనం
- భువనమ్మ విరాళాన్ని అభినందించిన సీఎం చంద్రబాబు
అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలో అన్న క్యాంటీన్లు అన్నంపెట్టే అమ్మను తలపిస్తున్నాయని నారా భువనేశ్వరి అన్నారు. అన్న క్యాంటీన్ల సేవలు ఎంతో మన్నన పొందాయని… లక్షలాది పేదల కడుపు నింపే మహోన్నత కార్యక్రమంగా కూటమి ప్రభుత్వం దీన్ని నిర్వహించడం గొప్ప విషయమని భువనేశ్వరి అభిప్రాయపడ్డారు. రూ.5లకే పరిశుభ్ర వాతావరణంలో ప్రభుత్వం గౌరవంగా పేదలకు భోజనం అందిస్తోందని అన్నారు. ఏప్రిల్ 20న ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా నారా భువనేశ్వరి రూ.76 లక్షలు విరాళంగా అందించారు. ఈమేరకు సీఎం క్యాంప్ కార్యాలయంలో చెక్‌ను అన్న క్యాంటీన్ సీఈవోకు అందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినమైన ఏప్రిల్ 20న రాష్ట్ర వ్యాప్తంగా 269 అన్న క్యాంటీన్లలో పూర్తి ఉచితంగా భోజనం అందించాలని భువనేశ్వరి కోరారు. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా పేదలకు కడపునింపే అన్న క్యాంటీన్లకు విరాళమివ్వడం ఎంతో సంతృప్తిని ఇచ్చిందని భువనేశ్వరి అన్నారు. అత్యంత పరిశుభ్రమైన వాతారణంలో అన్న క్యాంటీన్లలో పౌష్టికాహారం అందించడం గొప్ప విషయమని ఆమె అభిప్రాయపడ్డారు. రోజువారీ కూలీలు, పేదలు ఈ పథకం ద్వారా ఎంతో లబ్ది పొందుతున్నారని.. ఇలాంటి కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని కోరారు.
ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదనే లక్ష్యంతో అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని భువనేశ్వరి స్పష్టం చేశారు. అన్న క్యాంటీన్లకు ఆర్థికంగా చేయూతనిచ్చి స్ఫూర్తి నింపేందుకు అంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడంకంటే సంతృప్తి ఏముంటుదని వ్యాఖ్యానించిన భువనేశ్వరి…. తాను పలు సందర్భాల్లో అన్న వితరణ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు కలిగిన సంతృప్తిని, ప్రజల స్పందనను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తమ మనవడు దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా 12 ఏళ్లుగా ప్రతీ ఏటా తిరుమలలో అన్న ప్రసాదానికి రూ.44 లక్షలు విరాళంగా ఇస్తున్న విషయాన్ని ఆమె ప్రస్థావించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నారా భువనేశ్వరి…. అన్న క్యాంటీన్లకు రూ.76 లక్షల విరాళం ఈ ఏడాది మీ పుట్టిన రోజుకు మేమిచ్చే బహుమానమంటూ వ్యాఖ్యానించారు.
తన పేరు మీద అన్న క్యాంటీన్లకు ఒక రోజు అన్నదానానికి రూ.76 లక్షల విరాళమిచ్చిన తన సతీమణి భువనేశ్వరిని ముఖ్యమంత్రి అభినందించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… “రాష్ట్రంలో అన్నదాన కార్యక్రమాన్ని ఒక గొప్ప కార్యక్రమంగా ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. తిరుమలలో భక్తుల సహకారంతో నాలుగు దశాబ్దాలుగా అన్నదానం జరుగుతోంది. అలాగే ప్రముఖ దేవాలయాల్లోనూ అన్నదానం నిర్వహిస్తున్నాం. పేదలకు రూ.5లకే కడుపునింపే అన్న క్యాంటీన్ సేవలను మరింత విస్తరించాలి. నాణ్యతను పాటించడంతో పాటు.. పవిత్రంగా, గౌరవంగా, పరిశుభ్రంగా ఆహారం అందించే కార్యక్రమానికి దాతలు ముందుకొచ్చి విరాళాలివ్వాలి. పుట్టిన రోజు, పెళ్లి రోజు సహా తమకు నచ్చిన రోజు భోజనాలకు అయ్యే ఖర్చును విరాళంగా ఇచ్చేందుకు ప్రజలు ముందుకు రావాలి. ఇదొక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమంగా మారి బ్రాండ్‌ను సృష్టించాలి’ అని చంద్రబాబు ఆకాంక్షించారు.














