- రూ.7,358 కోట్ల పెండింగ్ బిల్లుల విడుదలకు గ్రీన్ సిగ్నల్
- నిధుల లభ్యతమేరకు పెండింగ్ క్లియర్ చేయాలని ఆదేశం
- చిన్న కాంట్రాక్టర్లకు పెద్దపీట వేయాలని సీఎం సూచన
- ఆర్థిక శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష
అమరావతి (చైతన్య రథం): గత ప్రభుత్వంనుంచి వారసత్వంగా వచ్చిన పెండింగ్ బిల్లుల చెల్లింపులపై గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్థిక శాఖపై సమీక్షించారు. ఈమేరకు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఆరా తీశారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపులు జరపాలని గతంలో ఇచ్చిన ఆదేశాలను ఏమేరకు అమలు చేశారని అడిగారు. సీఎం సూచనల మేరకు కసరత్తు చేశామని… నిధుల లభ్యతను బట్టి చెల్లింపులను జరుపుతున్నామని అధికారులు వివరించారు. ఉద్యోగులకు రిలీఫ్ ఇచ్చేలా మొత్తంగా రూ.7,358 కోట్లమేర పెండింగ్ బిల్లుల విడుదలకు చర్యలు తీసుకున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. దీంట్లో భాగంగా ఇప్పటికే ప్రావిడెంట్ ఫండ్ బకాయిల కింద రూ.1,848 కోట్లను నేరుగా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేశామని, అలాగే గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ కింద 4,793మందికి సంబంధించిన రూ.76 కోట్ల చెల్లింపులు కూడా పూర్తి చేశామని వెల్లడించారు. వీటితో పాటు గ్రాట్యుటీ బకాయిల కింద రూ.3,411 కోట్లు, పెండింగులో ఉన్న రిటైర్డ్ ఉద్యోగుల లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ కింద రూ. 1,800 కోట్లు, పోలీస్ శాఖకు సంబంధించి అదనపు సరెండర్ లీవుల నిమిత్తం రూ.223 కోట్ల బిల్లుల విడుదల ప్రక్రియ కొనసాగుతోందని.. మరో రెండు రోజుల్లో చెల్లింపులు పూర్తి చేస్తామని అధికారులు సీఎంకు చెప్పారు.
తల్లికి వందనం తర్వాత ఒకేసారి ఇంత పెద్దమొత్తంలో చెల్లింపులు జరుపుతోంది ఉద్యోగులకు మాత్రమేనని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. నిధుల లభ్యతనుబట్టి ఉద్యోగుల పెండింగ్ బిల్లుల సహా అన్ని రకాల పెండింగ్ బిల్లులకు చెల్లింపులు జరపాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఈక్రమంలో గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల విషయంలో జరిగిన పరిణామాలు ప్రస్తావనకు వచ్చాయి. నాడు ఉద్యోగుల సొంత సొమ్మును కూడా నాటి ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, తమ నిధుల కోసం ప్రశ్నించిన నేతలపై కేసులు పెట్టి వేధించారనే అంశం చర్చకు వచ్చింది. ఇక ఇదే సమీక్షా సమావేశంలో వివిధ పనులు చేసిన కాంట్రాక్టర్లకు, మెటిరీయల్ సరఫరా చేసిన వారికి జరపాల్సిన చెల్లింపులపైనా సీఎం ఆరా తీశారు. వివిధ శాఖలకు మెటీరియల్ సరఫరా చేసిన చిన్న చిన్న కాంట్రాక్టర్లకు రూ.614 కోట్ల బకాయిల చెల్లింపులు జరిపామని అధికారులు తెలిపారు. పనులు చేసిన, మెటిరీయల్ సరఫరా చేసిన వాళ్లకు బిల్లులు చెల్లింపులు జరిపే ప్రక్రియలో చిన్న కాంట్రాక్టర్లకు పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.














